Monday, July 11, 2022

🕉శరీరం - దేహం - దేవాలయం🕉

 🕉శరీరం - దేహం - దేవాలయం🕉


శరీరం : శరీరం అని ఎందుకంటున్నారు? ‘శీర్యతే ఇతి శరీరః’ అని వ్యుత్పత్తి అర్థం. శీర్యతే అంటే శీర్ణమైపోయేది, జీర్ణమైపోయేది, శిథిలమైపోయేది అని అర్థం. జీర్ణించిపోవటం - శిథిలమైపోవటం దీని లక్షణం. ముసలితనం కావాలని మనం మందులు మాకులు మ్రింగనక్కరలేదు. అమృత భాండంలో పెట్టినా సరే ఈ శరీరం శిథిలమైపోయేదే, నశించిపోయేదే అందుకే శరీరం అన్నారు.


దేహం : దేహమని ఎందుకన్నారు? 'దహ్యతే ఇతి దేహః' అని వ్యుత్పత్తి అర్థం. దహింపబడేది గనుక దీనిని దేహం అన్నారు. చచ్చిన తరువాత కట్టెలలో కాలుస్తారు గనుక దహింపబడేది అన్నారా? మరి కొందరి దేహాలను కట్టెలతో కాల్చరు గదా! అవి దహింపబడవు గదా! మరి వాటిని దేహాలు అని అనరా? చనిపోయిన తర్వాత దహింపబడటం కాదు. జీవించిఉన్నప్పుడే తాపత్రయా లనే అగ్ని చేత నిరంతరం దహింపబడుతూ ఉండేదే ఈ దేహం. ఆధిదైవిక, ఆధిభౌతిక, ఆధ్యాత్మిక తాపాలే తాపత్రయం.



దేవాలయం : దేహాన్ని దేవాలయం అని వేదాలు, ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఎందుకు?


"దేహో దేవాలయ ప్రోక్తః జీవోదేవస్సనాతనః"- అనేది ఉపనిషద్ వాక్యం. ఈ దేహం ఎలాంటి దేవాలయం? ఇది ఒక చోట స్థిరంగా ఉండే దేవాలయం కాదు. ఇది చరదేవాలయం. కదులుతూ ఉండేది. బయట కనిపించే దేవాలయాన్ని మానవులే కట్టిస్తారు. అందులో దేవుణ్ణి కూడా మానవులే ప్రతిష్టిస్తారు. కాని ఈ శరీరమనే దేవాలయాన్ని భగవంతుడే నిర్మించి, హృదయమనే గర్భగుడిలో తనకు తానే ప్రతిష్టితుడై కూర్చున్నాడు. బయటి గుడికి - ఈ గుడికి అదే తేడా. ఇక్కడ భగవంతుడు 'స్వయంభూ:' అన్నమాట. మరి ఏ దేవాలయం ముఖ్యమైనది? ఏ దేవుని పూజ గొప్పది? ఆలోచించుకోవాలి.

🕉️

సేకరణ

No comments:

Post a Comment