Tuesday, September 6, 2022

ఇలాంటి వ్యక్తుల ఆశీస్సులు ఎలా ఫలిస్తాయంటే! – సెప్టెంబర్ 4, 2022 – భగవద్గీత 18వ అధ్యాయం – మోక్ష సన్యాస యోగం – 33వ శ్లోకం – శ్రీ కృష్ణార్పణమస్తు!

 ఇలాంటి వ్యక్తుల ఆశీస్సులు ఎలా ఫలిస్తాయంటే! – సెప్టెంబర్ 4, 2022 – భగవద్గీత 18వ అధ్యాయం – మోక్ష సన్యాస యోగం – 33వ శ్లోకం – శ్రీ కృష్ణార్పణమస్తు!

ధృత్యా యయా ధారయతే మనఃప్రాణేంద్రియక్రియాః ।
యోగేనావ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్త్వికీ ।। 33 ।।

వివరణ: యోగము ద్వారా పెంపొందించుకున్న ధృడ చిత్త సంకల్పము; మరియు మనస్సు, ప్రాణ వాయువులు, ఇంద్రియముల యొక్క కార్యకలాపములకు ఆధారముగా ఉన్న సంకల్పాన్ని, సత్త్వ గుణ దృఢమనస్కత అంటారు.
--------------

భగవద్గీత లోని ఈ 18వ అధ్యాయంలోని అన్ని శ్లోకాలను  క్రమం తప్పకుండా మీరు గమనించినట్లయితే, ఒక "కర్మ (పని)" జరగడానికి కారణమైన అనేక అంశాల గురించి శ్రీకృష్ణ భగవానుడు ఒకదాని తర్వాత మరొకటి వివరించడం స్పష్టంగా అర్థం అయ్యే ఉంటుంది.  ఉదాహరణకు నిన్నటివరకు చెప్పుకున్న శ్లోకంలో  ఒక పని చేయడానికి "బుద్ధి" అనేది కూడా  ఒక ముఖ్యమైన అంశం కాబట్టి మనుషులు ఎన్ని రకాల బుద్ధి కలిగి ఉంటారో  శ్రీకృష్ణ భగవానుడు వివరించారు.

ఇప్పుడు ఈ 33 వ శ్లోకం నుండి  ఒక కర్మ చేయడానికి కర్త, జ్ఞానం, బుద్ధి మాత్రమే కాకుండా "ధృతి" (దృఢ సంకల్పం) కూడా ముఖ్యం కాబట్టి దాని గురించి  తెలియజేస్తున్నారు.  అందులో భాగంగానే "సత్త్వ గుణ దృఢ మనస్థత్వం" గురించి ఈ శ్లోకం చెప్పబడింది.

సహజంగా ఒక పనిని చేసేటప్పుడు అందరం  ఒకటే బలంగా అనుకుంటాం. "నేను ఈ పని ఖచ్చితంగా చేయాలి", లేదా "ఫలానా వ్యక్తి నాతో అలా ప్రవర్తించాడు కాబట్టి నేను ఇలాగే ప్రవర్తించి తీరాలి, నేనేమైనా తక్కువ తిన్నానా ఏమిటి" - ఇలా  రకరకాలుగా చాలా బలంగా నిర్ణయించుకొని పలురకాల కర్మలు చేస్తుంటాం. అంటే ఆ సంకల్పం మనం చేసే కర్మలకు డ్రైవింగ్ ఫోర్స్ అన్నమాట.

అయితే సత్త్వ గుణంలో ఉన్న వ్యక్తి యొక్క ఇలాంటి దృఢ సంకల్పం కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటుంది.  అన్నిటికంటే ప్రధానమైనది అలాంటి వ్యక్తులు నిరంతరం యోగ స్థితిలో ఉంటారు.  అంటే వారి బుద్ధి, ఆత్మ, శరీరమూ ఈ మూడూ ఒకటే ఎలైన్‌మెంట్‌లో ఉంటాయి. హృదయానికి మంచి అనిపించినది బుద్ది  రెండో ఆలోచన లేకుండా చేస్తుంది. ఇలా సోల్, మైండ్ రెండూ ఒకే పొందికలో ఉన్న వ్యక్తులకు హార్ట్ రేట్ వేరియబులిటీ (HRV) చాలా మెరుగ్గా ఉండి,  నిరంతరం జీవితంలో ఫ్లెక్సిబుల్ గా ఉండగలుగుతారు. వారికి మానసిక ఒత్తిడి ఏర్పడదు.  కేవలం ఏ వ్యక్తి అయితే హృదయం చెప్పేది ఒకటి, మైండ్ చెప్పేది వేరు ఒకటి అయి ఉంటుందో అలాంటి వ్యక్తులు ఊరికే మానసిక సంఘర్షణకు గురి అవుతూ ఉంటారు. HRV  మెరుగ్గా ఉన్న వ్యక్తులకు హార్ట్ సమస్యలు గానీ,  శరీరంలో వివిధ అవయవాల్లో టిష్యూల్లో ఇన్‌ఫ్లమేషన్  ప్రమాదం గానీ ఉండదు.

అలాగే సత్త్వ గుణ  దృఢ సంకల్పం కలిగిన వ్యక్తులు తమ మనసును నియంత్రించుకోగలుగుతారు. సోల్ ఎప్పుడూ నిశ్చలంగా ఉంటుంది, కానీ మైండ్ మాత్రమే  విపరీతమైన ఆలోచనలు చేసి, అస్థిమితంగా ఉంటుంది. అలాంటి స్థిరత్వం లేని మైండ్‌ని  తమ అదుపులో పెట్టుకొని తాము అనుకున్న లక్ష్యాలు సాధించడానికి మైండ్‌ని సమర్థవంతంగా లేజర్ ఫోకస్‌తో ఉపయోగించుకోగలిగిన సమర్థత  ఇలాంటి వ్యక్తులకు ఉంటుంది.

సత్త్వ గుణ దృఢ సంకల్పం కలిగిన వ్యక్తులు ప్రాణాయామం వంటి అభ్యాసాల ద్వారా  శరీరంలోని ప్రాణశక్తిని శక్తి చలన క్రియ వంటి పద్ధతుల ద్వారా వివిధ చక్రాలను యాక్టివేట్ చేసుకోగలిగేలా ఉపయోగించుకోగలుగుతారు. అంతేకాదు.. కొంతమంది నిరంతరం మంత్ర పఠనం ద్వారా  ఆయా మంత్రాల్లోని శబ్ధాలు ఉత్పత్తి అవడానికి ఊపిరితిత్తుల్లోని క్రింది, మధ్య మరియు పై భాగాల్లో ప్రాణశక్తి చలనం అయ్యేలా కారణమై  తద్వారా శరీరం మొత్తంలోని అన్ని కణాలకు ప్రాణశక్తి, రక్త సరఫరా సక్రమంగా అవడానికి తమకు తెలీకుండానే కారణం అవుతుంటారు. మీరు నిశితంగా గమనిస్తే, మంత్ర పఠనం చేసే వారు ఈ కారణం చేతనే చురుకైన బుద్ధిని కలిగి ఉంటారు.

ఇంద్రియ నిగ్రహం కూడా సత్త్వ గుణ దృఢ మనస్థత్వం కలిగిన వ్యక్తుల ఒక ప్రధానమైన లక్షణం. జ్ఞానేంద్రియాలైన (సెన్సరీ ఆర్గాన్స్) కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం వంటివీ.. కర్మేంద్రియాలైన మాట, చేయి వంటివి అన్నీ తమ అదుపులో పెట్టుకోగలుగుతారు. అందుకే ఇలాంటి వ్యక్తులు తమ భావోద్వేగాలకు బానిసలుగా మారి, నోటికి ఏది వస్తే అది మాట్లాడరు. ప్రతీ మాటనీ పూర్తి విచక్షణతో అవసరం అయితేనే, అది ఎవరికీ హాని కలుగజేయనిది అయితేనే మాట్లాడతారు.

ఇలా ఇంద్రియాలు, ప్రాణశక్తి, మైండ్‌లను తమ అదుపులో పెట్టుకుని తాము అనుకున్న లక్ష్యాల వైపు వాటిని చాలా బలంగా ప్రొజెక్ట్ చెయ్యగలగడం సత్త్వ గుణ దృఢ సంకల్పం అవుతుంది. సరిగ్గా ఇదే విధంగా ఈ మూడింటిని అదుపులో పెట్టుకొని, తమకేం కావాలో యూనివర్శల్ ఫీల్డ్‌కి తెలియజేసి ప్రకృతిని కూడా శాసించగలిగిన మహర్షులు మనకు పురణాల్లో కనిపిస్తారు. ఆ స్థాయిలో కాకపోయినా తమ నిరంతర అభ్యాసాల వల్ల చేతిలో ఉన్న మురికి నీటిని కూడా కేవలం బలమైన యోగ స్థితిలో ఉన్న ఇంటెన్షన్‌తో శుద్ధి చెయ్యడం, లేదా తమ నిశ్చలమైన ఆశీస్సుల ద్వారా ఆపదలో ఉన్న వారికి మంచి జరిగేలా పాజిటివ్ వైబ్రేషన్స్ పంచగలిగిన సాధకులను మనం నిరంతరం చూస్తుంటాం.

No comments:

Post a Comment