Tuesday, September 13, 2022

ధనలేమి ఒక్కటే దరిద్రంగా చాలామంది భావిస్తారు. భావదారిద్య్రం, జ్ఞానలేమి, బుద్ధిరాహిత్యం... ఇటువంటివేమీ లేనివారే సంపన్నులు.

 *అమృతం గమయ*

*_జ్ఞానభిక్ష_* ..

ధనలేమి ఒక్కటే దరిద్రంగా చాలామంది భావిస్తారు. భావదారిద్య్రం, జ్ఞానలేమి, బుద్ధిరాహిత్యం... ఇటువంటివేమీ లేనివారే సంపన్నులు.

ధనం లేకున్నా సద్బుద్ధి, సద్గుణాలు కలిగిన వారికి దైవానుగ్రహం తప్పక లభిస్తుంది. ఆదిశంకరులు ఒక కటిక బీద గృహిణి ఇంటికి భిక్ష కోసం వెళ్తారు. దుఃఖాన్ని దిగమింగుకుని, ఆతిథ్య సంప్రదాయాన్ని పాటిస్తూ బీద గృహిణి తమ ఇంట్లో ఉన్న ఒకే ఒక ఉసిరికాయను ఆయనకు దానం చేస్తుంది. ఆదిశంకరుల హృదయం కరుణతో కరిగిపోతుంది. ఆ క్షణంలోనే ఆశువుగా కనకధారాస్తోత్రాన్ని చెబుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం బంగారు ఉసిరికాయలుగా వర్షిస్తుంది. ఇప్పటికీ ఆ గృహం కాలడి గ్రామంలో ఉందని చెబుతారు. రంతిదేవుడి కథ ఇలాంటిదే.

ఆతిథ్య ధర్మాన్ని నిస్వార్థంగా పాటించడం వల్లనే తక్షణం దైవానుగ్రహం లభిస్తుంది. భిక్షకు వచ్చేవారిని హీనంగా, నీచంగా చూస్తూ దుర్భాషలాడకూడదు. దైవం కేవలం ఆలయాల్లోనే ఉంటాడనుకోవడం అజ్ఞానం. దరిద్రనారాయణులంటే, భిక్షుక రూపంలో వచ్చి, మన భిక్షకు ప్రతిగా పుణ్యం ప్రసాదించేవారు. శంకరుడు ఆదిభిక్షువు. భక్తుల బాధలను తీసుకుని, ఆనందాన్ని అనుగ్రహించడం ఆయన దివ్యలక్షణం.

భక్తికి భగవంతుణ్ని ఆకర్షించే శక్తి ఉంటుంది. దైవం మనం భావించే రూపంలో రాడు. మనలోని భక్తి పరిపక్వతను, కులమత దుర్విచక్షణలు లేని సమతా భావాలను పరీక్షించే విధంగా మనం గుర్తుపట్టలేని రూపంలో రావచ్చు. భగవంతుడికి కుల మతాల దుర్విచక్షణ ఉండదు. సమాజ నిర్మాణం కోసం కుల వృత్తులు ఏర్పడ్డాయి. వాటిలో ఎక్కువ తక్కువలు మనిషి గీసుకున్న గీతలే. జన్మతో అందరూ శూద్రులే. కర్మతో మాత్రమే ఉత్తములవుతారు. ఇదే విషయాన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. శరీరభావనతోనే కులమతాల తేడాలు. ఆదిశంకరులు ‘శివానందరూపః శివోహం శివోహం’- నేను శివానందరూపుడను. నేనే శివుడిని- అని చేసుకున్న పరిచయమే మనిషికి అసలు నిర్వచనం.

మనిషి జీవితమంతా ధనార్జన కోసమే తాపత్రయపడతాడు. ఎంత సంపాదించినా వెంటవచ్చేది ఏమీ ఉండదు. జీవుడి వెంట- మంచి, చెడులనే కర్మ సంచికలు మాత్రమే ఉంటాయి. అదే జీవిత సత్యం. ఇది తెలిసినవారు ప్రాపంచిక ప్రలోభాలకు అతీతంగా ఉంటారు. కానీ, అందరికీ సత్య దర్శనం లభించదు. కలలో చూస్తున్నవన్నీ నిజమనే భ్రాంతి కలిగిస్తాయి. మెలకువ రాగానే వాస్తవం తెలుస్తుంది.

మనసు కోరికలపుట్ట. ఒక కోరిక తీరగానే మరొక కోరిక సిద్ధంగా ఉంటుంది. కోరికలు మనసు బీదతనాన్ని తెలియజేస్తాయి. భిక్షుక ప్రవృత్తికి కోరికలు కారణంగా ఉంటాయి. కోరికల పరంపరతోనే మనిషి అహర్నిశలు అశాంతిగా ఉంటాడు. ముళ్లదుప్పటి లాంటి కోరికల్ని దూరంగా విసిరేస్తే ఇక దుఃఖమే ఉండదు. కోరికలన్నింటినీ కాశీలో వదిలెయ్యమని పెద్దలు చెబుతారు. బొందితో కైలాసానికి వెళ్లవచ్చేమోగానీ, కోరికలతో జీవుడు వెళ్లగలిగేది నరకానికేనంటారు జ్ఞానులు.
జ్ఞానం అంటే, భ్రమల నుంచి బయటపడే మార్గం తెలుసుకోవడం. కేవలం తెలుసుకొంటే చాలదు. అనుసరించాలి. దత్తాత్రేయ అవతారాలన్నీ జీవులకు జ్ఞానభిక్షను అనుగ్రహించడానికేనని చెబుతారు. జ్ఞానభిక్షతో ఆత్మ ఆర్తి తీరుతుంది. కైవల్యం ప్రాప్తిస్తుంది.


🌸 Amritham Gamaya 🌸

Without experiencing for yourself the Truth, it is not any Truth to you. The Truth is just a notion if it is not in experience. Spiritual awareness and consciousness do not exist in ambiguous notions of theology but in leading yourself to Self-actualization - SathChith.

అమృతం గమయ

మీకు అనుభవంలో లేని సత్యం మీకు సత్యమే కాదు. అనుభవంలో లేని సత్యం కేవలం ఒక  అస్పష్టమైన భావన మాత్రమే. ఆధ్యాత్మిక అవగాహన మరియు చైతన్యం, శాస్త్రం యొక్క అస్పష్టమైన భావనలలో లేవు.  ఆ శాస్త్రం యొక్క సత్యం వైపు మిమ్మల్ని మీరు స్వీయ-వాస్తవికతతో నడిపించుకొని అనుభవం పొందడమే నిజమైన సత్యం - సత్ చిత్.

अमृतम् गमय

जो सत्य आपके अनुभव में नहीं है, वह आपके लिए सत्य नहीं है। जो सत्य अनुभव में नहीं है, वह केवल एक अस्पष्ट भावना ही है। आध्यात्मिक समझ और चेतना, विज्ञान की अस्पष्ट अवधारणाओं में नहीं हैं, लेकिन उस विज्ञान की सच्चाई तक वास्तविकता में आत्म-साक्षात्कार और अनुभव पाना ही आपके लिये सत्य हैं  - सत चित।


No comments:

Post a Comment