శివోహం
✍️ స్మరణ భారతి
🙏⚜️🔱⚜️🔱✡️🕉️🔯🔱⚜️🔱⚜️🙏
🔱 వేదాలలో 'యజుర్వేదం' గొప్పది. యజుర్వేదంలో నాల్గవకాండలో ఉన్న 'రుద్రం' ఇంకా గొప్పది. రుద్రం మధ్యలో ఉన్న 'పంచాక్షరి' అంతకంటే గొప్పది. పంచాక్షరి లోని రెండక్షరాలు మరీ గొప్పవి. ఆ రెండక్షరాలు - "శివ". శివ అంటే మంగళం శుభం అని అర్ధం.
✍️ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు
⚜️ నామస్మరణాత్ అన్యోపాయం నహి పశ్యామో భవతరణే ... ఈ సంసారిక జీవితంలో మానవజన్మ తరించాలంటే నామ స్మరణ చేయాలి. భగవంతుణ్ణి చేరే మార్గంలో నామస్మరణం ఉత్తమం. 'శివ' అనే రెండక్షరాలు పరబ్రహ్మ స్వరూపం. 'శి' అంటే పాపనాశనం. 'వ' అంటే ముక్తిప్రదానం.
🔱 లోకసమస్తాన్ని తనలో నిలుపుకొని, తానే లోకమైన విశ్వనాధుడు ఈశ్వరుడు. ఆదిదేవుడు, ఆద్యంతరహితుడు అయిన శివుడు మన జీవనతాత్త్వికతకు అతిసన్నిహితంగా ఉంటాడు. సుఖదుఃఖాలు అనే ద్వంద్వాల నడుమ సాగే మన జీవనయానంలో ద్వంద్వాలన్నింటినీ ఏకంచేసే అద్వయమూర్తిగా గోచరిస్తాడు.
⚜️ ప్రమధాది గణాలను నియంత్రించే సర్వాత్మకుడైన పరమశివుడే ఇంద్రియాల్ని నియంత్రించగలిగిన శక్తిమంతుడు. కాలకూట విషాన్ని, శేషనాగును కంఠంలో ధరించి ఉండటం ద్వారా మృత్యుంజయ రూపత్వం విశదమౌతుంది. గంగను శిరస్సుపై ధరించి విశ్వముక్తి మూలాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అగ్నిమయమైన తృతీయ నేత్రం దగ్గరే చంద్రకళను ధరించి ఉండడం వల్ల సంహారకర్త పోషకత్వరూపమై విరుద్ధ ధర్మాశ్రయత్వాన్ని దిగ్దర్శితం చేస్తున్నట్లు తెలుస్తుంది. సర్వలోకాధిపతియై కూడా విభూతీ వ్యాఘ్రచర్మాన్ని ధరించి పామును మెడలో వేసుకొని, కపాలం చేబూని శ్మశానంలో తిరుగాడే లోకశివశంకరుడు వైరాగ్యమునే శ్రేష్ఠమైనదిగా వ్యక్తం చేస్తున్నాడు.
⚜️ అణిమాది అష్టసిద్దులున్నా - ఒంటికి పూసుకునేది భస్మమే. చుట్టుకున్నది గజవస్త్రమే. ధరించేది నాగభరణాలే. శివుని మూడోనేత్రం జ్ఞాననేత్రం. నటరాజ స్వరూపం - కళాంతరంగుడైన శివుని కళాస్వరూపానికి ప్రతీక. స్వచ్ఛతకు హిమాలయం మారుపేరు. ధర్మరూపమైన వృషభమే వాహనం. చంద్రుడు చిత్తానికి ప్రతినిధి. గంగ చంచలత్వానికి గుర్తు. పులి స్వార్ధ చింతనకు మరో రూపం. ఏనుగంటే నిలువంత గర్వం. వాటన్నింటిని జయించమని చెబుతుంది శివతత్వం. నంది - ధర్మానికి, సర్పాలు నిర్భయత్వానికి నిదర్శనం.
🔱 భస్మాన్ని ధరించిన ఆయన దగ్గర ఏముందీ అని అడుగుతారు కొందరు. కానీ, భస్మాన్ని మించిన పవిత్రమైనది ఈ సృష్టిలో వేరే ఏమీ లేదు. జన్మాంతర పాపాలను దహించి వేసేదే భస్మం. కాబట్టే, భస్మానికి 'విభూతి' అని పేరు. విభూతి అంటే ఐశ్వర్యమనీ అర్ధముంది.
⚜️ తాను గరళాన్ని మింగి లోకానికి అమృతం దక్కించిన ఈ నీలకంఠుని నెత్తిన నీళ్లు కుమ్మరిస్తే చాలు, మెచ్చి వరాలు కురిపించేస్తాడు. దోసెడు నీళ్ల అభిషేకం, చిటికెడు బూడిద అలంకారం, కూసిన్ని బిల్వపత్రాలు, కాసిన్ని ఉమ్మెత్తపువ్వులు, 'శంభో శంకర శరణు శరణు' అన్న స్మరణకే పొంగిపోయే బోళాశంకరుడు.
⚜️ అందుకే, నీలకంఠుని శిరసుపై నీళ్లుచల్లి, పత్తి రిసుమంత ఎవ్వాడు పాఱవైచు, కామధేనువు వానింటి గాడిపసర మల్ల సురశాభి వానింటి మల్లెచెట్టు
అని మాదయగారి మల్లన్నవారు కొనియాడరు.
🔱 సామాన్యుడైనా, సంపన్నుడైనా, విద్యావంతుడైనా, అవిద్యావంతుడైనా, మిత్రుడైనా, శత్రువైనా పశువైనా, పురుగైనా ... అందరూ శివయ్యకు సమానమే.
అందుకే -
సుహృద్విపక్ష పక్షమో, తృణారవింద చక్షు షో, ప్రజా మహిమహేంద్రయో, సమ ప్రవృత్తికః ... అని శివతాండవస్తోత్రం లో రావణాసురుడు కీర్తిస్తాడు.
⚜️ సర్వసృష్టి సమానత్వం శివతత్త్వం. ఆస్తికుడు, నాస్తికుడు, జ్ఞాని, అజ్ఞాని, దేవతలు, రాక్షసులు, బలవంతుడు, బలహీనుడు, సర్వగ్రంధ పారాయణుడు, నిరక్షరాస్యుడు, అందర్నీ ఆదరించి అనుగ్రహించే ప్రేమపరవశుడు శివయ్య.
🔱 రావణుడు రాక్షసుడని తెలిసినా అనుగ్రహించాడు. భస్మాసురుడు కృతఘ్నుడని తెలిసినా వరమిచ్చాడు. దోషభూయిష్టుల్ని సైతం నెత్తిన పెట్టుకొనే భక్తసులభడు శంకరుడు. ఎంతటి పాపచరితులనైనా పునీతం చేసే దయాంతరంగడు.
⚜️ మార్కండేయుడు అల్పాయుష్కుడని తెలిసినా, చిరంజీవత్వమును ఒసగేసాడు. తిన్నడు నిరక్షరాస్యుడైనా ముక్తినిచ్చాడు. సాలెపురుగు సర్పం, ఏనుగు ప్రేమకే పరవశించి మోక్షాన్ని ప్రసాదించేసాడు. చెట్టునెక్కి, భయంతో రాత్రంతా మెలుకువగా ఉండడం కోసం కొన్ని ఆకులు వేసేసరికి విలుకాడిని కూడా ఆదరంగా అక్కున చేర్చేసుకున్నాడు. అధికపనులతో కష్టింపజేసినా, అవమానించినా, అవరోధించినా .... నొవ్వక నొప్పించక చెదరని భక్తితో, దీపారాధన చేసే చాకలి పోలికి స్వర్గప్రాప్తినిచ్చాడు. ఒకానొక రోజు, విసుగ్గా ఓ ఇల్లాలు విసిరిన మలిన వస్త్రాన్ని ఆనందంగా స్వీకరించి, శుభ్రపరచి, వత్తులుగా చేసి వెలిగించిన బీద బ్రాహ్మణుకి జీవనముక్తినే ప్రసాదించిన కారుణ్యమూర్తి. ఎంతటి కరుణశాలియో కదా, ఈ గుండె చల్లని దేవర.
⚜️ వేదాలు -వాదాలు, పాండిత్య చర్చలు - పామరుల ప్రశ్నలు, తర్కాలు - మీమాంసాలు, సోత్కర్షలు - సలహాలు, సొగసులు -బేషజాలు, అవసరం లేదు భక్తికి. స్వచ్ఛమైన ప్రేమ కనబరిస్తే చాలు కదిలిపొతాడు, కరిగిపోతాడు, కరుణిస్తాడు ఈ భక్తవత్సలుడు.
మహాదేవ మహాదేవ మహాదేవేతి యో వదేత్ /
ఏకేన ముక్తిమాప్నోతి ద్వాభ్యాం శంభూ ఋణీ భవేత్ //
మహాదేవ మహాదేవ మహాదేవ
అని ముమ్మారు ఉచ్చరించునట్టివారికి ఈశ్వరుడు ఒకమారు స్మరణకు ముక్తినిఛ్చి, మిగిలిన రెండుమార్లు స్మరణకు రుణపడి ఉంటాడు.
[ చిన్నప్పుడు మా తాతయ్యగారి దగ్గర ఈ శ్లోకం చదివినప్పుడు ఇలా అనిపించేది - (రచయిత)
చన్నీటి స్నానాలు, నిత్యా దీపారాధనలు, ఆలయ సందర్శనాలు, అభిషేకాలు అర్చనలు, అష్టోత్తరాలు, శివనామస్మరణలు ... ప్రతీ కార్తీకమాసంలో ఎంతోమంది చేస్తున్నారు. మరి వారికెందుకు ముక్తి రావడం లేదు??? మరి పై కధలన్నీ అబద్దమా??? ఇది అప్పటి నా సందేహం. కానీ, అవగాహన ఏర్పడ్డాక తెలుసుకున్నా...]
⚜️ శివార్చనలో పోటీపడి తమని తాము అర్పించుకునేటంత దృఢభక్తి సాలీడు పాము ఏనుగులకు ఉన్నందునే శివసాయుజ్యమునే ప్రాప్తింపజేశాడు ఆ శ్రీకాళహస్తీశ్వరుడు.
🔱 తనకున్న శక్తిలో నోటిదారాలతోనే తనకై గూడు కాదు, శివునికై గుడి కట్టింది సాలెడు. ఆ రీతిలో మనం కూడా, మన బుద్ధిశక్తిని ఆశలదారాలను ఆస్తులు అంతస్థుల చుట్టూ తిప్పకుండా, కాస్త పరమేశ్వరార్పణం చేస్తే ముక్తి వస్తుంది.
⚜️ తన దగ్గరున్న విలువైన మణిని శివుని ముందు పెట్టి భక్తితో పూజించి తపించేది పాము. అదే రీతిలో మనలో బుసలుకొట్టే అరిషడ్వార్గాల పామును పట్టి పరమాత్ముని చుట్టూ తిప్పి తపిస్తే ముక్తి వస్తుంది.
🔱 తన తొండం నిండా జలమును నింపి అపార భక్తి పరవశంతో శివాభిషేకం చేసేది ఏనుగు. అటులనే దేహమే నేనన్న బలమైన అహంతో మధించిన మనస్సనే గజాన్ని అంకుశమనే అకుంఠిత భక్తితో అదుపులో పెట్టి శివకైంకర్యానికి ఉపక్రమిస్తే కైవల్యం వస్తుంది. ఆ మూడింటిలా ఒకే ధ్యాసతో చిత్తశుద్ధితో తపనతో మనమూ ఆరాధించాలి.
తిన్నడు అనే బోయవాని కధకు వస్తే -
తిన్నడు తత్వాన్ని ముందు గ్రహించండి -
🔱 వృక్షమూలంలో శివుణ్ణి దర్శించి, అక్కడే సేవిస్తూ వుండిపోయిన భక్తిత్వమే స్థిరత్వం, ఏ వంకరలు లేని ఏకాగ్రతయే తిన్నని తనం. చెక్కుచెదరని పట్టుదలే ధీరత్వం. మనోదృష్టిని చెదరనీయకుండా శివుణ్ణే దర్శిస్తూ, తన దృష్టిని, నమ్మిన శివునికే నివేదించడం సర్వ సమర్పణం. ఆ రీతిలోనే మన దివ్య చక్షువుతో అంతరాలయంలో నున్న శివుణ్ణి దర్శించి, త్రికరణాలను శివార్పణం చేస్తే మోక్షమొస్తుంది.
🔱 శివుని మహిమల్ని గుర్తించి ఆరాధించడమే భక్తి. పై కధల్లో చాలావరకు గతజన్మ పుణ్య ప్రారబ్ధాలు కలిసివచ్చాయని నా భావన. అందుకే పెద్దలు పూర్వజన్మ సుకృతం వుండాలి అంటారు. మనం కూడా చేసే సాధనాలు వృధా పోవు. ఏ జన్మలోనో కలిసివచ్చి ముక్తిని ప్రసాదిస్తాయి.
⚜️ 'శివపూజ' 🔱
🙏 మనస్సును శుద్ధి చేసుకోవడం - "అభిషేకం"
🙏 అత్యాశలను వదిలించుకోవడం - "విభూతి ధారణ"
🙏 నేనే అన్న అహం, నాదీ అన్న మాయ, నేనే చేస్తున్నా అన్న క్రియ - ఈ మూడు భావాలను విడిచిపెట్టడం - "త్రిదళ సమర్పణం" -
🙏 అప్పుడే తేజోమయమైన "ఆత్మలింగం" కాంచగలం.
🙏 శివోహం శివోహం శివోహం ⚜️
సేకరణ:రమణ సమూహంలో చేరడానికి 9490860693 కి WhatsApp చేయండి.
🙏⚜️🔱⚜️🔱🔯🕉️✡️🔱⚜️🔱⚜️🙏
No comments:
Post a Comment