Tuesday, December 13, 2022

 మౌనం నిశ్శబ్ధాన్ని పలకరించిన వేళ...

ఏ కర్మ కర్మరాహిత్యానికి దారి తీస్తుందో
ఆ కర్మప్రవాహానికే "కర్మయోగం" అని పేరు.

ఏ నామరూపాల ఉపాసన వలన నామరూపాతీతమైన అరూపస్థితికి చేరుస్తుందో
ఆ భావప్రవానికే "భక్తియోగం" అని పేరు.

ఏ వాక్కులు వాక్కుకు-తలపుకు అతీతమైన
స్వరూపనిష్ఠలో మనసు నిలిచేటట్టు చేస్తాయో
ఆ వాక్ ప్రవాహానికే "జ్ఞానయోగం" అని పేరు.

* * *

నిశ్శబ్ధంగా ఉండడం వేఱు,
మౌనంగా ఉండడం వేఱు.

కొందరు స్వాములు నిశ్శబ్ధంగా చేతి కదలికలతోను, పలకపై రాతలతోను భాషిస్తూ ఉంటారు.

మరికొందరు తమ భాషణం చేత అందరినీ మౌనంలోకి తీసుకెళుతున్నారు...

నిశ్శబ్ధం అనేది సాధన.
మౌనం అనేది సిద్ధి.

నిశ్శబ్దం కాలంలో ఉంటుంది.
మౌనం కాలాతీతమై ఉంటుంది.

నిశ్శబ్ధానికి మాట  ఆటంకమే.
కాని మౌనానికి మాట ఆటంకం కాదు.

గురువుగారు అంటారు-
మౌనం అనేది మాట వలన భంగం కాదు,
మాట వలన భంగం అయ్యే మౌనం మౌనం కాదు అని.

కావ్యకంఠునికి ఉపదేశించడానికై రమణుడు మౌనం వీడాడు అంటారు...తప్పు.

వారెప్పుడూ మౌనాన్ని వీడలేదు.
వారికి మౌనం అనేది దీక్ష కాదు, 
కనుక అది యెప్పుడూ చెదరలేదు.

మౌనం అనేది వారి స్వరూపం.
మౌనమే రమణుడు.
మాటలు వలన చెదరిపోయే మౌనం కాదు అది.

* * *

ఇలా ఈ ఆధునిక లోకాన్ని సమాధానపరచడానికి అవతరించిన మహనీయమూర్తులు 
ఆ అరుణాచలరమణులు, 
ఈ అనిలాచలసుబ్రహ్మణ్యులు...

వీరు భాషణం మౌనంలోకి తీసుకెళుతుంది కాబట్టి
వీరు మాట్లాడుతున్న'ట్టు' కనిపిస్తున్నప్పటికీ, ఏమీ మాట్లాడనివారే....

నేను పలికిందీ లేదు.
మీరు వినిందీ లేదు.
అంటుంటారు గురువుగారు.

* * *

చెప్పక చెప్పినవాడు - దక్షిణామూర్తి.
చెప్పి చెప్పనివాడు - మా సద్గురుమూర్తి.

ఈ మాట అర్థమై, అనుభవంలోకి తెచ్చుకున్న ఎవడైనా వాడు 'మౌనస్వామి'యే.

* * *

కత్తి అన్నిటినీ నరుకుతుంది.
కత్తినే తెగ నరుకుతుంది సత్యం.

గురుబోధ వలన గురు-శిష్య భేదం పోతుంది అంటే అదే కదా అర్థం!

అన్ని కట్టెలూ కాలడానికి కారణమైన కొరివికట్టె కూడా చివరికి కాలి బూడిదైపోతుంది.

"సత్యం"లో  సభ్యులెవరూ ఉండరు.
సత్యంతో, సత్యంలో, సత్యంగా ఉండేది సత్యమొకటే.

సత్యం ఏకాకి.

* * *

దేహాభిమానం అంటే తన దేహంపై ఉన్న అభిమానం అని మాత్రమే కాదు,

ఇతరులకు దేహం ఉంది అనుకోవడం కూడా దేహాభిమానమే.

పై పైన నీటిపై తేలియాడే బుడగల్లా ఉండే నామరూపాల వ్యవహారమే -  శబ్ధం.

ఆ నామరూపాలకు ఆధారంగా ఉన్న 
ఆత్మతత్త్వమే - మౌనం.

* * *

నాటకం ప్రదర్శిస్తుంటే ఇదొక నాటకం అని,
నాటకంలోని నటులకూ తెలుసు....
నాటకాన్ని చూసే ప్రేక్షకులకూ తెలుసు....

కానీ ఉద్దేశపూర్వకంగానే ఇది నాటకం అనే విషయాన్ని తత్కాలికంగా మరవాలి.
అప్పుడే నటులు గొప్పగా నటించగలరు,
ప్రేక్షకులు కూడా కథను బాగా ఎంజాయ్ చేయగలరు. 

కాబట్టి 
భగవంతుడు ఉద్దేశపూర్వకమైన మరపుతోనే
జీవుడుగా, ప్రపంచంగా అయ్యాడు.

జీవుడు ఉద్దేశపూర్వకమైన జ్ఞప్తితోనే(మననంతోనే) 
తిరిగి ఆత్మస్వరూపాన్ని పొందుతాడు.

మరపుకు-జ్ఞప్తికి మధ్య ఊగిసలాడే 
అందమైన నాటకమే జీవితం.

మన జీవితంలో తటస్థపడే సుఖదుఃఖానుభవాలన్నీ అంతర్గతంగా తన అంగీకారంతో ముడిపడి ఉన్నవే.

జగన్నాటకం అనే విషయం దేవునికి
జ్ఞప్తి ఉంటే - దేవుడు.
మరపుకొస్తే - జీవుడు.
అంతే.

జ్ఞప్తిలో ఉన్న జీవుడు - దేవుడు.
మరపులో ఉన్న దేవుడు - జీవుడు.

నిరాకారమే -మౌనం.
సాకారమే - శబ్ధం.

మౌనమే - దేవుడు.
శబ్దమే - జీవుడు.

మన అంతరాత్మయే నిజమైన మౌనస్వామి.
సచ్ఛీలమైన మన మనసే మౌనాశ్రమం.

కాదంటారా?

* * *

No comments:

Post a Comment