అరుణాచలం (భాగం 1)
శ్రీ అరుణాచల వైభవం:
ద్రావిడ వాంగ్మయము నందు యొక మాట యున్నది
"దర్శనాత్ అభ్రసదశీ, జననాత్ కమలాలయే, కాశ్యాంతు మరణాన్ ముక్తి, స్మరణాత్ అరుణాచలే"
చిదంబర క్షేత్రము నందు దర్శనము, తిరువారూరు క్షేత్రము నందు జననము, కాశి మహాక్షేత్రము నందు మరణము ముక్తి కారకములు. కానీ ప్రపంచము నందు ఏ ప్రదేశము నందు యున్నా అరుణాచల క్షేత్రమును ఒక్క మారు స్మరించినంతనే ముక్తి కలుగును.
అరుణాచలము ఈ సమస్త సృష్టిలోనే మొదటి క్షేత్రము. మిగిలిన క్షేత్రములన్ని అరుణాచలము తరువాత ఉద్భవించినవే. అంతేకాదు, నిర్వికారుడైన పరమేశ్వరుడు ఈ శరీరముతో దర్శనము చేయుటకు మొదటి సారి అనుకూలమైన రూపము తీసుకొన్న స్వరూపమే "అరుణాచలము".
"అరుణాచలము కన్నా గొప్ప క్షేత్రము లేదు,
నారాయణుడి కన్నా గొప్ప శివభక్తుడు లేడు,
పంచాక్షరి కన్నా గొప్ప మంత్రము లేదు,
విభూది కన్నా గొప్ప ఔషధము లేదు"
"రుణము" అనగా "బంధనము". "అచలము" అనగా "పర్వతము". మానవుడు శరీరము తో ఉన్నంత సేపు అనేక రకములైన బంధనములకు బద్ధుడగును. ఇదియే సంసారము. "అరుణ" అనగా "బంధవిమోచనము". సంసారబంధముల నుండి మనుజునకు మోక్షము కలిగించు పర్వతము గనుక "అరుణాచలము" అను నామము కలిగెను. మరియొక అర్ధము చూడగా "అరుణము" అనగా "ఎరుపు వర్ణము". ఎరుపు వర్ణము రజోగుణమునకు, అజ్ఞానమునకు ప్రతీక. అజ్ఞానమును దహించి జ్ఞానమును ప్రసాదించెడి పర్వతము గనుక "అరుణాచలమను నామమేర్పడెను.
ఈ సమస్త సృష్టికి మూలమై, నిర్వికారుడై, పరబ్రహ్మమై యున్న పరమేశ్వరునకు ఒకమారు సృష్టి చేయవలెనని సంకల్పము కలిగెను. సంకల్ప మాత్రమున తానే బ్రహ్మ మరియు విష్ణువు రూపములను పొందెను. బ్రహ్మ రూపమున సృష్టి చేసి, విష్ణు రూపమున సృష్టి నిర్వహించుచుండెను. కొంత కాలము అనంతరము బ్రహ్మవిష్ణువుల మధ్య "ఎవరు గొప్ప" అను వివాదము మొదలాయెను. సృష్టి చేయు కారణమున తానే అధికుడనని బ్రహ్మదేవుడు, సృష్టి చేసినా నిర్వహణ లేనిచో సృష్టి నిరర్ధమగును గాన తానే అధికుడినని విష్ణువు వాదించుకొనెను. ఈ విషయము గ్రహించిన పరమేశ్వరుడు "ధనుర్మాసము యొక్క ఆర్ద్రా నక్షత్ర దినము" న వారివురి మధ్య ఒక జ్యోతిస్తంభము గా ఉద్భవించెను. ఈ జ్యోతిస్తంభమునే శ్రీ రుద్రాధ్యాయము యొక్క ధ్యాన శ్లోకము కీర్తించినది.
"ఆపాతాళనభస్థలాన్తభువన బ్రహ్మాండ మావిస్ఫుర జ్యోతి
స్స్పాటికలింగ మౌళివిలసత్పూర్ణేందు వాన్తామృతై"
పాతాళము నుండి ఆకాశము వరకు వ్యాపించి బ్రహ్మాండమంతా నిండిపోయినట్లు కనిపించు ఆ జ్యోతిస్తంభమును చూసిన బ్రహ్మవిష్ణువులు దానియొక్క ఆద్యంతములు కనుగోనవలేనని సంకల్పించిరి. కనుగొన్నవారే అధికులని తీర్మానించిరి. వెంటనే శ్రీమహావిష్ణువు వరాహరూపము ధరించి ఆ జ్యోతిస్తంభము యొక్క మూలము కనుగొనవలెనని భూమిని త్రవ్వసాగెను. బ్రహ్మదేవుడు ఆ జ్యోతిస్తంభము యొక్క ఊర్ధ్వ భాగము కనుగొనవలెనని హంసరూపియై ఆకాశమున ఎగిరెను. అయితే బ్రహ్మవిష్ణువులు ఈ విధముగా వాదులాడుకోనుటకు కారణము వారి యందు ప్రశరించిన "శివమాయ" యే. ఈ శివమాయ శ్రీమహావిష్ణువు నందు ఎక్కువ కాలము యుండదు. ఎందుకనగా ఆ మహానుభావుడు సత్వగుణసంపన్నుడు. మాయ వీడిన అనంతరము విష్ణువు శివతత్వమును గ్రహించి వెనక్కి తిరిగి వచ్చెను. రజోగుణసంపన్నుడై, శివమాయామోహితుడైన బ్రహ్మదేవుడు జ్యోతిస్తంభము యొక్క ఊర్ధ్వ భాగము కనుగొనుటకు కొన్ని యుగముల బాటు ప్రయాణము చేసెను అయినా ఆయన జ్యోతిస్తంభము యొక్క ఊర్ధ్వభాగము కానరాలేదు. అలా ప్రయాణము చేస్తున్న బ్రహ్మదేవునకు పైనుండి క్రిందకు జారుతున్న ఒక మొగలిపువ్వు అగుపించెను. ఆయన దానిని పట్టుకొని, ఆ పుష్పమును ఎక్కడ నుండి వచ్చుచున్నావని ప్రశ్నించెను. అంతట ఆ పువ్వు తాను జ్యోతిస్తంభము యొక్క ఊర్ధ్వభాగము నుండి జారితినని, ఇది జరిగి కొన్ని మహాయుగములు గడిచినవని చెప్పెను. అది విన్న బ్రహ్మదేవుడు, తాను జ్యోతిస్తంభము యొక్క ఊర్ధ్వ భాగము చూసినట్లు విష్ణువు వద్ద సాక్ష్యము చెప్పమని కోరెను. దానికి ఆ పుష్పము అంగీకరించెను. అక్కడే యున్న ఒక గోవును గూడ ఇదే కోరగా, గోవు గూడ తన అంగీకారము తెలిపెను.
తిరిగి వచ్చిన బ్రహ్మదేవుని చూసిన నారాయణుడు, తాను జ్యోతిస్తంభము యొక్క మూలము కనుగోనలేకపోతినని చెప్పెను. బ్రహ్మదేవుడు మాత్రం తాను జ్యోతిస్తంభము యొక్క ఊర్ధ్వ భాగము చూసితినని పలికి సాక్ష్యులుగా మొగలిపువ్వును మరియు గోవును ప్రవేశబెట్టెను. మొగలిపువ్వు బ్రహ్మదేవుడు జ్యోతిస్తంభము యొక్క ఊర్ధ్వ భాగము చూసేనని అసత్యము పలికెను. గోవు మాత్రము తన ముఖముతో చూసేనని అసత్యము పలికి, తన పృష్ట భాగము తో చూడలేదని సత్యము పలికెను. అంతట జ్యోతిస్తంభము నుండి సాకారరూపమున పరమేశ్వరుడు ఉద్భవించెను. ఈ ఉద్భవము జరిగిన సమయమే "మాఘ కృష్ణ చతుర్దశి నందు అర్ధరాత్రి". ఇందు మూలముగానే ఆ దినము "మహాశివరాత్రి" గా జరుపబడుతున్నది. ఆ దినము యొక్క అర్ధరాత్రి సమయమున పరమేశ్వరుడు జ్యోతిస్తంభము నుండి ఉద్భవించిన కారణమున ఆ సమయము "లింగోద్భవ కాలము" గా ప్రసిద్ధము.
అలా ఉద్భవించిన పరమేశ్వరుడు, బ్రహ్మదేవుడు అసత్యమాడిన కారణమున ఆయనకు భూమిపై పూజలు యుండవని శపించెను. అసత్య సాక్ష్యము చెప్పిన కారణమున మొగలిపువ్వు భగవంతుని పూజకు పనికిరాదని శపించెను. ముఖము తో అసత్యము పలికి పృష్టముతో సత్యము పలికిన కారణమున గోవుకు అభిముఖ పూజ ఉండదని, కేవలము పృష్ట భాగమునే పూజించవలెనని పలికెను. అనంతరము పరమేశ్వరుడు, శ్రీమహావిష్ణువును సమీపించి అయన యొక్క సత్వగుణమునకు సంతసించి వరము కోరికొనమనెను. అంతట నారాయణుడు తాము దర్శించిన జ్యోతి రూపమున అచలమై నిలిచి, ఆ జ్యోతి యొక్క సందర్శనము మరియు ప్రదక్షిణము చేసిన వారి అజ్ఞానమును దహించి ముక్తి ప్రసాదింపుమని కోరెను. అంతట పరమేశ్వరుడు బ్రహ్మాండమైన అగ్ని రూపమున ఒక పర్వతముగా భూమిపై నిలిచెను. అలా వెలసిన పర్వతరాజమే "అరుణాచలము".
పరమేశ్వరుడు మొదటి సారిగా కంటికి కనిపించినది అగ్ని స్వరూపమున. ఇందు కారణమున మనము అగ్నిని పూజించేదము. అగ్నిని పూజించు కారణమున మనలను "ఆర్యులు" అని అనెదరు. పరమేశ్వరుడు జ్యోతిస్తంభము గా మొదటి సారి కనిపించిన "ధనుర్మాస ఆర్ద్రా నక్షత్ర దినము" అత్యంత పవిత్రమై యున్నది. ఆ రోజు చేయు శివార్చన మరియు అభిషేకములకు పరమేశ్వరుడు అత్యంత ప్రసన్నుడగును.
అరుణాచల క్షేత్రమున వెలసిన పరమేశ్వరుడు అనంతర కాలమున పరమ శివభక్తుడగు "శ్రీ గౌతమ మహర్షి"ని రావించి ఆయనకు "అరుణాచల మాహత్యం"ను వివరించెను. అనంతరము గౌతమ మహర్షిని అరుణాచల క్షేత్రము నందే నివాసముండి అక్కడి పూజ మరియు ఉపాసనా పద్ధతులను నిర్ణయింపుమని పలికెను. అంతట గౌతమ మహర్షి తానూ, తరువాతి తరముల వారు పూజించుటకు వీలుగా లింగ రూపమున వెలియమని పరమేశ్వరుని కోరెను. అంతట పరమేశ్వరుడు పూజ, అభిషేక, అలంకార తదితర కైంకర్యములకు వీలుగా "శ్రీ అరుణాచలేశ్వరుడు" అను నామనున తేజో లింగముగా ఆవిర్భవించెను. ఈ దివ్య లింగము చుట్టూ నిర్మింపబడినదే నేడు మనము దర్శించు "శ్రీ అరుణాచలేశ్వర స్వామి" ఆలయము. పంచ భూత లింగముల యందు ఈ లింగము తేజోలింగము గా కొలవబడుచున్నది. అనంతరము గౌతమ మహర్షి అరుణాద్రీశుని పూజించి ఈ క్షేత్రము యొక్క పూజ, ఉపాసనా విధానములను నిర్ణయించెను.
ఇలా యుండగా ఒకనాడు పార్వతీ మాత గౌతమ మహర్షి ఆశ్రమమునకు వచ్చెను. కాంచీ నగరపు వర్ణన యందు "శ్రీ ఏకామ్రేశ్వరుని" గూర్చి మనము తెలుసుకొన్నప్పుడు జగన్మాత శివుని కన్నులు మూయడం, అనంతర కాలమున తపమోనరించి శంకరుని మెప్పించుట చదివి యున్నాము. అయితే ఇదంతా "జగన్నాటకము" యందు ఒక భాగము అని తెలుసుకొంటిమి. ఈ నాటకము యొక్క కొనసాగింపుగా అయ్య శంకరుడు అమ్మ ను అరుణాచలము వెళ్ళవలసినది గా ఆజ్ఞాపించెను. స్వామి ఆజ్ఞ అందుకున్న జగన్మాత కంచి క్షేత్రము నుండి అరుణాచల క్షేత్రమునకు వచ్చెను. అరుణగిరి యొక్క తూర్పు శిఖరము యైన "ప్రవాళగిరి" యందు యున్న గౌతమ మహర్షి తపోభుమి నకు జగదంబ విచ్చేసెను. అలా వచ్చిన జగదంబను గౌతముల వారు అమితానందము తో ఆహ్వానించి, శివాజ్ఞగా అమ్మకు "శ్రీ అరుణాచల మహత్యం"ను వర్ణించెను. ఇదంతా విన్న జగన్మాత తన పతి అక్కడ గిరి రూపమున యుండెనని గ్రహించి, అరుణగిరికి ప్రదక్షిణ మొనరించి పంచాగ్ని తపస్సు కు ఉద్యుక్తమయ్యెను. తన శక్తులను అరుణగిరికి కావల యుంచి తపస్సు ప్రారంభించెను.
ఆ సమయమున మహిషాసురుడు అను అసురుడు "మహిషూరు" (ఇప్పటి మైసూరు) అను నగరమును రాజధాని గా చేసికొని పరిపాలించుచున్నడు. అతను పరమశివుని వలన గొప్ప వరములు పొంది, వరగర్వమున లోకములను పీడించుచుండెడివాడు. జగన్మాత అరుణాచలము నందు తపస్సు చేయుచున్న సమయమున మహిషాసురుడు కొంత పరివారముతో కలిసి అరుణాచల అడవుల యందు వేటకై వచ్చెను. ఆ పరివారము నందు కొంత మంది అరుణాచల క్షేత్ర ప్రవేశము చేయ్యబోగా అమ్మవారి శక్తులు వారిని అడ్డగించి అది గౌరీదేవి తపోభూమి గాన మరలిపోండని పలికెను. అంతట ఆ పరివారము పక్షి రూపములు ధరించి ఆకాశమార్గమున అమ్మవారి తపోభూమిని చేరి, అమ్మను గాంచిరి. పాపాత్ములైన వారు జగదంబ యందు అంబను చూడక స్త్రీ తత్వమును చూసిరి. వారు తిరిగి వచ్చి మహిషాసురునకు జగదంబ తపస్సు గూర్చి తెలిపిరి. అంతట మహిషుడు జగదంబను చేజిక్కించుకోవాలను దురుద్దేశముతో ఒక ముసలి బ్రాహ్మణుడి రూపమున అమ్మవారి తపోభూమికి చేరెను. వచ్చిన మాయావిని అక్కడి వారు ఆదరించిరి. అనంతరము వారు మహిషునితో గౌరీ దేవి భర్త ప్రసన్నతకై తపస్సు చేయుచున్నదని తెలిపెను. మహిషుడు అమ్మను సమీపించి ఆవిడ తపస్సు చేయుచున్న పతి తానేనని ధూర్తపు మాటలు పలికెను. వచ్చినది మహిషుడని తెలిసియున్న అంబ అతన్ని అక్కడ నుండి తరిమివేసెను. మహిషాసురుడు కోపముతో తన సర్వ సైన్యమును జత చేర్చి అరుణాచలమును ముట్టడించెను.
తానూ, తన పతి ఆడిన "జగన్నాటకము" మహిషుని అంతము కోసమేనని తెలిసి యున్న జగదంబ శత్రుసంహారమగు "దుర్గ" రూపమును ధరించెను. తన సంకల్ప మాత్రము చేత అద్భుత సైన్యమును సృజించి మహిషుని సైన్యమును మట్టుబెట్టమని పలికెను. అమ్మవారి సైన్యము మహిషుని సైన్యమును నామరూపములు లేకుండా చీల్చిచెండాడెను. సైన్యము పోయిన అనంతరము మహిషుడే స్వయంగా యుద్ధమునకు వచ్చెను. అంతట దేవతలు తమ ఆయుధములను అమ్మకు ఇచ్చి, తమ శక్తులను ఆవిడకి ధారపోసిరి. ఆయుధములను ధరించి, సింహవాహినియై అమ్మ, మహిషునితో తొమ్మిది రోజులు యుద్ధము చేసెను. తొమ్మిదవ దినమున జగన్మాత మహిషాసురుని అంతమొందించెను.
"జయజయహే మహిషాసురమర్ధిని రమ్యకపర్ధిని శైలసుతే"
అయితే తపస్సుతో శరీరము వజ్రము చేసికొన్న మహిషుడు వెంటనే మరణించలేదు. వాని శరీరము యెంత ఛీద్రము చేసినా మరణించక పోవుట చూసిన దుర్గమ్మ వాని శిరస్సును తన ఖడ్గముతో ఖండించెను. శిరము తెగిన అనంతరము వాని నుండి ఒక శివలింగము బయటపడెను. ఆ లింగమును చూసిన జగదంబ తాను వధించినది ఒక శివభక్తుడినని తలచి ఆ లింగమును పట్టుకొనెను. అమ్మవారి చేతి స్పర్శ తగిలిన వెంటనే ఆ లింగము అమ్మ దేహమునకు అత్తుక్కోనేను. యెంత ప్రయత్నించిననూ ఊడి రాదాయె. అంతట గౌతమ మహర్షి వచ్చి జగదంబతో అక్కడ ఉన్న ఒక రాతిపై తన ఖడ్గముతో ప్రహారము చేయుమని తెలిపెను. అంబ తన ఖడ్గముతో శిలపై ప్రహారము చేసినంతనే ఆ శిల నుండి గంగ ఉద్భవించి ఒక తీర్థముగా ఏర్పడెను. అదియే అత్యంత మహిమాన్వితమైన "ఖడ్గ తీర్థము". అమ్మవారు ఖడ్గ తీర్థము నందు స్నానమాచరించినంతనే దేహమునకు అతుక్కున్న లింగము ఊడి వచ్చెను. ఆవిడ ఆ లింగమును ప్రతిష్ట చేసి తపస్సును కొనసాగించెను. అమ్మ తపస్సుకు సంతసించిన పరమేశ్వరుడు "కార్తీక మాసమున కృత్తికా" నక్షత్ర దినమున ప్రత్యక్షమాయెను. కైలాసమున పసివానిగా యున్న "శ్రీ బాలసుబ్రహ్మన్యునకు" పాలు ఇవ్వకుండా పతిని చేరుటయే పరమలక్ష్యముగా చేసుకొన్న కారణమున అమ్మవారు "శ్రీ ఆపితకుచాంబికా" అను నామమున అరుణాచల క్షేత్రము నందు అరుణాచలుని దేవేరిగా వెలిసెను. అనంతరము దేవతల కోరిక మేర శివపార్వతుల కళ్యాణము అరుణాచలము నందు అత్యంత వైభవముగా జరిగెను.
ఇంతటి మహోజ్వల ఘట్టములకు సాక్షి యైన అరుణాచల క్షేత్రము దక్షిణ భారత దేశమునందు తమిళనాడు రాష్ట్రమున యున్నది. ప్రస్తుతము వ్యావహారిక నామమున "తిరువణ్ణామలై" అయినది. జిల్లా కేంద్రముగా యున్న ఈ క్షేత్రము నందు అరుణాచల పర్వతమే ప్రధానము. పర్వతము గాక శ్రీ అరుణాచలేశ్వరుని ఆలయము, శ్రీ ఆది అరుణాచలేశ్వరుని ఆలయము, శ్రీ అరుణగిరి నాధుని ఆలయము, శ్రీ దుర్గాదేవి ఆలయము ప్రధానమైన ఆలయములుగా యున్నవి. ఇవే గాక శ్రీ రమణాశ్రమము, శ్రీ శేషాద్రి స్వామి ఆశ్రమము, శ్రీ స్కందాశ్రమము, శ్రీ విరూపాక్ష గుహ మొదలైన స్థలములు ధ్యానమునకు, ఉపాసనలకు అనువైన స్థలములుగా యున్నవి.
ఇంతటి మహాక్షేత్రము నందు అడుగిడవలెననిన పూర్వ పుణ్యము ఉండవలెనని సాక్షాతూ పరమేశ్వరుడు "స్కాందపురాణము" నందు తెలిపెను. ఎన్నో క్షేత్రములు దర్శించిన ఫలముగానే అరుణాచల ప్రవేశము కల్పింపబడునని పలికెను. మానవులు అత్యంత సులభముగా తరించుటకు భగవంతుడు వీలు కల్పించిన క్షేత్రమే "అరుణాచలము". ఇంతటి మహాక్షేత్రమును మరింత వివరముగా వర్ణించుకుందాము.
"శ్రీ ఆపితకుచాంబా మాతా సమేత శ్రీ శ్రీ శ్రీ అరుణాచలేశ్వర స్వామినే నమః"
అరుణాచల శివ
అరుణాచల శివ
అరుణాచల శివ
అరుణ శివ
No comments:
Post a Comment