🪔🪔అంతర్యామి🪔🪔
🌹మనిషి ఒక పువ్వులా స్వచ్ఛంగా పవిత్రంగా జీవించాలని మంత్ర పుష్పం చెబుతోంది. పుష్పం ప్రతిఫలం ఆశించకుండా తనను తాను సమర్పించుకొంటుంది! ప్రాపంచిక జీవితం సాధన చేస్తూనే, త్యాగిగా తామరాకుపై నీటిబొట్టులా ఉండాలని శంకర భగవత్పాదులు వివేక చూడామణిలో బోధించారు.
🌹బాధలు, ఆశలు, దురాశలకు అతీతంగా జీవనం సాగిస్తే మనుగడకు పరమార్ధం ఏమిటో ఉద్బోధించారు. ఇలా జీవించడం సులభం కాకపోవచ్చు కాని, అసాధ్యం కాదు. వేలాది సంవత్సరాలుగా సాధకులెందరో పువ్వులా వికసించి జీవన సౌరభాన్ని వెదజల్లారు. వారి జీవనశైలి సహజం, సరళం. వారు నిష్కపటంగా, నిస్వార్థంగా జీవించారు. ప్రాపంచిక కోరికలు వారిని బాధించలేదు. నిరామయంగా, సదా ఆనందంతో మానవాళి అభ్యున్నతి కోసమే వారు పూవులై పరిమళించారు.
🌹ఎందరో ఉన్నత సాధకులు తమను తాము నియంత్రించుకొంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాన్ని సాధించే మార్గంలో ముందుకు వెళ్ళారు. దీక్ష, సంకల్ప బలంతో అనుకొన్నది సాధించగలిగారు. లభ్యమైన అపూర్వ శక్తిని చైతన్యాన్ని మానవాళికి పంచి నిష్క్రమించారు. పరిమళాలను వ్యాపింపజేసి, దేవుడి పాదాలకు చేరిన పుష్పంలా వారు తమ జన్మకొక సార్థకతను సమకూర్చుకొన్నారు. ఈ ఆధ్యాత్మిక ప్రస్థానంలో సాధకుల ప్రయాణం సుదీర్ఘంగా సాగింది. సాధారణ మానవుల తత్వాలను పరిశీలించారు. ఏది తప్పో, ఏది మంచిదో గ్రహించి, మంచిని మాత్రమే స్వీకరించి మనకు తెలియజేశారు.
నీటిని విడిచి పాలను మాత్రమే స్వీకరించే హంసలాగా, మంచిని తీసుకొని చెడును
విస్మరించారు. అందుకే అలాంటి సాధకులను పరమ హంస అంటారు.
🌹నిజమైన పరిత్యాగి ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని ఏర్పరచుకొని సాధన చేయడని ముండకోపనిషత్తు చెబుతోంది. పరిత్యాగి అలుపెరగని సంచారి. ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తూ, భావోద్వేగాలను దైవానికి సమర్పిస్తాడు. లోతైన ఆలోచనలు ఆ ఉన్నతుడి హృదయంలో తిరుగుతూ ఉంటాయి.
🌹 మానవులందరూ గౌతమ బుద్ధులు కాలేరు. జీవితంలో ఎదురయ్యే కష్టాలు, సమస్యలు పరిష్కరించుకొంటూ జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించడం పరిత్యాగి లక్షణం. నది ఉదృతంగా ప్రవహిస్తుంటే, ఏ మాత్రం జడవకుండా ఆ ఉప్పొంగుతున్న ఏరును దాటి ఆవలి ఒడ్డుకు (పారమార్థికానికి) చేరేవారు కొందరు. ఆ వరదకు ఆనకట్ట వేసి, దాన్నొక వనరుగా చేసుకొని జీవితాన్ని పండించుకునేవారు మరికొందరు.
🌹 పరమాత్ముడు, ఈ వైవిధ్య జీవన విధానాన్ని పూజార్హమైన పువ్వుగానే పరిగణిస్తాడని విద్యారణ్యుడు రాసిన జీవన్ముక్తి వివేక చెబుతోంది. ఎందుకంటే మనిషి అధీనంలో కర్మ, భగవంతుడి అధీనంలో కర్మ ఫలం ఉంటాయి.
🌹అగ్ని కాలుతుందని తెలుసుకొని దూరంగా ఉండాలి. అగ్నితో యజ్ఞం చేయవచ్చు. అన్నం వండుకోవచ్చు. అదే అగ్నితో గృహాన్ని దహనం చేయవచ్చు. మనిషి వివేకవంతుడై జీవిస్తే ఆ మనుగడ పరిమళాలను గుబాళిస్తుంది. అబద్ధం, కపటం, చౌర్యం, హింస, మోసం మొదలైనవన్నీ సామాజిక జీవనాన్ని కలుషితం చేసే కర్మలుగా గాంధీజీ తెలుసుకొన్నారు. వాటిని వదిలి పెట్టి తన జన్మను సార్ధకం చేసుకొన్నారు.
🌹వాసన లేని పువ్వును, మంచితనం లేని మనుషులున్న ఊరును, గుణవంతుడు కాని కొడుకును, గ్రాసం లేని కొలువును వదిలి పెట్టాలని పెమ్మయ సింగ ధీమణీ శతకం చెబుతోంది.
🌹మానవుడి జీవితం తావి లేని పువ్వులా గాక పరిమళించే పుష్పంలా ఉండాలి. అలా కాని బతుకు వాసనలేని పువ్వులా నిరాదరణకు గురి అవుతుంది.
-✍️ అప్పరుసు రమాకాంత రావు
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment