Tuesday, January 10, 2023

****రమణాయ ఆధ్యాయము - 21 ఆణిముత్యాలు - 6 - జగత్తు

 భగవాన్ రమణ మహర్షి నిత్య పారాయణం
ఓం నమో భగవతే శ్రీ రమణాయ 
ఆధ్యాయము - 21
ఆణిముత్యాలు - 6 - జగత్తు 

      భగవాన్ చెప్పినదేమనగా ఆత్మయే బ్రహ్మామని సర్వం బ్రహ్మా మయయని చెప్పారు . అయితే ఈ కన్పించే జగత్తు సంగతి ఏమిటి ? అనే ప్రశ్న ప్రతి వారికి కలుగుతుంది . జగత్తు బ్రహ్మముకంటే భిన్నమని అభిప్రాయపడతారు . కాని భగవాన్ చెప్పినది *బ్రహ్మము లేదా ఆత్మ ఒక తెరవంటిదని ఆ తెరపై కనబడే బొమ్మలే జగత్తు అంటే ఆత్మ ఒక సినిమా తెర అయితే దానిపై కనిపించే బొమ్మలు జగత్తని అర్ధము* . తెర ఎంతసేపు వుంటే అంతసేపు మాత్రమే ప్రేక్షకుడు సినిమా చూచెదడు . *బ్రహ్మము ఎప్పుడూ సత్యమే . కాని కన్పించే జగత్తు మిథ్య*. ఆ జగత్తు కూడా బ్రహ్మమే . మనము చూచే ఈ జగత్తు అందరికి కనిపించుచున్నది . కాని అది నిజంకాదు . అది ఒక భ్రాంతి మాత్రమే . ఉన్నది ఒక్కటే ఆత్మ . అదే నిజము . *జగత్తు , జీవుడు , ఈశ్వరుడు ముగ్గురు కూడా ఆత్మయే* . భగవాన్ జగత్తు సినిమా తెరపై కనిపించే బొమ్మలని ఎప్పుడూ చెప్తూ ఉండేవారు . సినిమా తెరపై ఎన్నో దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి . అవన్నీ నిజం కాదు . అసత్యం మాత్రమే . తెరమటుకు సత్యమైనది అని భగవాన్ చెప్తూ మరియొక ఉదాహరణ కూడా ఇచ్చేవారు . అది అద్దంలో కన్పించే ప్రతిబింబాలు . ఆ ప్రతిబింబాలు కదిలిపోతూ ఉంటాయి . వాటివల్లగాని వాటి గుణాలవల్లగాని ఆ అద్దం మటుకు ఏ మార్పూ చెందదని భగవాన్ చెప్పేవారు . పైగా *సామాన్యులు కన్పించే జగత్తును వ్యావహారిక దృష్టితో చూస్తారు కాబట్టి ఆ అగుపించే జగత్తు సత్యంగానే తోస్తుంది . కావున భగవాన్ చెప్పినదేమనగా జ్ఞానాన్ని సముపార్జించుకుంటే కన్పించే జగత్తు సత్యము కాదని జగత్తుకు అతీతంగా పోతే ఆ కన్పించే జగత్తు మాయమై సత్యమొకటే అనగా బ్రహ్మమే లేక ఆత్మయే నిలుస్తుందన్నారు* . ఈ కన్పించే జగత్తుకాని , జీవుడుకాని , ఈశ్వరుడు కాని మాయ వలన జరుగుతున్నది . మాయ అంటేనే లేనిది ఉన్నట్లుగ చూపించుట . *భగవాన్ చెప్పినదేమనగా మన ఆత్మే ప్రపంచముగా అనేకమైన నామ రూపాలతో అగుపిస్తుందని కొందరు భగవాన్ తో “ మన చుట్టూ* కనపడే ప్రపంచాన్ని ఎలా లేదనగలమని ” వాదించేవారు .అలాంటి వారికి భగవాన్ కలల అనుభవం గురించి చెప్తూ వుండేవారు . దానికి వాదకులు మళ్ళీ ఈ విధంగా ప్రశ్నించే వాళ్ళు . కల చాలా తక్కువసేపే ఉంటుంది . కాని ఈ కన్పించే జగత్తు మాత్రం ఎప్పుడూ ఉంటుంది . పైగ కల ఒక్కడికే సంబంధించినదనికాని కన్పించే ప్రపంచం అందరూ చూస్తారని అనుభవిస్తారని అంటూ మరి ప్రపంచం లేదని ఎలా అనగలమని అనేవారు . భగవాన్ ఇట్లు చెప్పేవారు , " చూసేవారి బట్టే ఏదైనా ఉంటుంది . చూడబడేది కూడా నిజానికి దృష్టికి వేరుగా దృశ్యమంటూ ఏమీ లేదని చెప్పారు* ” . దీనిని దృష్టి సృష్టి వాదము అంటారు . అదేవిధముగా సృష్టి , దృష్టి వాదముకూడా ఉన్నదని భగవాన్ సమాధానమిచ్చారు . విశ్వమంతా ద్రష్టతోపాటే దృశ్యమానమవుతుందని తెలుసుకోవాలి . భగవాన్ తమ భక్తులతో ఎప్పుడూ ఒక రహస్యాన్ని చెప్పేవారు , “ నీవు నిద్రలో ఉన్నప్పుడు ప్రపంచము కనబడదు . కాని ఆ సమయములో నీవు లేకపోలేదు . నీవు మేల్కొనగానే ఈ ప్రపంచము కనబడుతున్నది . అందువల్ల ఎక్కడిదీ ప్రపంచము ? నీ భావనే కదా* . భావాలన్నీ నీవు కల్పించుకున్నవే . మొదట సృష్టింపబడేది ' నేను ' . ఆ నేను ఉదయించేది ఆత్మనుంచే . ఈ నేను యొక్క సృష్టి రహస్యాన్ని కనుగొన్న జగత్ సృష్టి రహస్యం విడిపోతుంది . కావున ఆత్మాన్వేషణ చేసుకోమని భగవాన్ చెప్పేవారు . ఆత్మ సాక్షాత్కారమైన పిదప సృష్టి లేదు . కావున భగవాన్ ఆత్మని కనుక్కోమని , సృష్టిలేదని చెప్పేవారు . ఆత్మను మరచినవాడు . అతని దృష్టి బాహ్య ప్రపంచముపై ఉండును . కావున అతనికి తాను బ్రహ్మమని మరచి జగత్తులో వస్తువులపై ఆకర్షణ దృశ్యాలకు లోబడుట వంటి బలహీనత ఏర్పడుట వలన అవిద్యలో తాను దేహమనే భ్రమ కలిగి ఉండుటచే జగత్తు సత్యమని తోస్తుంది . కాని సాధకునికి జగత్తు మిథ్యగా తోస్తుంది . ఎందుకంటే అతడు దేహము కాదని అసలు నేనును తెలుసుకొనుటచే తనకి సర్వము బ్రహ్మముగా కన్పిస్తుంది . ఆత్మ లేకుండా విశ్వమనేదే లేదు . ఆత్మ జ్ఞానానికి తాను బ్రహ్మమని ఆలోచన ఎప్పుడూ ఉంటుంది . భగవత్ అనుగ్రహం కలిగినప్పుడు మనస్సు శుద్ధిపొంది భ్రమపోయి సత్యాన్ని చూస్తాడు . భగవాన్ చెప్పింది ఈ కన్పించే ప్రపంచం వాస్తవము కాదని అనుకోకపోతే ప్రతి వారి మనస్సు ప్రపంచము వెంట పడుతుందని దానివల్ల యదార్ధము బైటకి రాదని చెప్పేవారు . మనిషి కలగన్నప్పుడు కలలోని
61 ప్రపంచము కూడా కల ఉన్నంత సేపు వాస్తవమే . కాని మేల్కొని ఉన్నపుడు కనపడే ప్రపంచము వాస్తవము కాదని నీవు ఎప్పుడూ సందేహించవు . జాగ్రత్తావస్థలోని ప్రపంచాన్ని స్వప్నావస్థలోని ప్రపంచాన్ని పోల్చి చెప్పటం రెండూ కూడా మనస్సు చేత కల్పింపబడినవే . వాటిలో నిమగ్నమైనంత వరకు అవి అసత్యంగా మనస్సు ఒప్పుకోదు . కలగంటునప్పుడు కలలోని ప్రపంచాన్ని అసత్యమని మరియు మేల్కొని ఉన్నప్పుడు కనపడే ప్రపంచాన్ని అసత్యమని ఒప్పుకోదు . కావున మనస్సును ప్రపంచమునుంచి మరల్చి అంతర్ముఖం చేసి ఆత్మ గురించిన ఎరుక ఉంటే ప్రపంచము మిథ్యగానే కన్పిస్తుంది . కలగనంత సేపూ అంతా నిజంగానే అన్పిస్తుంది . ఉదాహరణకు దాహం వేయటం . కలలో వేసిన దాహానికి నీరు త్రాగిన దాహం తీరుతుంది . ఆ కల మిథ్య అని తెలియనంతసేపు అది నిజంగానే దాహం తీరినట్లుగానే అనిపిస్తుంది . కాని మేల్కొని ఉన్న వేళలో ఆ కలలోని అసత్యాలు తెలుస్తాయి . అట్లాగే మేల్కొని ఉన్నప్పటి కనిపించే ప్రపంచము కూడా అనుభూతుల వలన అంతానిజంగానే అనిపిస్తుంది . ప్రపంచం సత్యమే అయితే గాఢనిద్రలో ఎందుకు ప్రత్యక్షముకాదు . నిద్రలో ' నేను లేను ' అని నీవు అనలేవుకదా అన్నారు భగవాన్ . భగవానుని మరియొక ప్రశ్న కూడా వేశారు . “ నేనూ నిద్రలో ఉన్నప్పుడు ప్రపంచములేదని అనలేము . అది ఎప్పుడూ ఉంటూనే వుంది . నిద్రలో నేను దానిని గమనించకపోయినా నిద్రపోనివాళ్ళూ చూస్తూనే వుంటారుకదా . ” దానికి భగవాన్ చెప్పిన సమాధానము , “ *నిద్రపోయినప్పుడు నీవున్నావని చెప్పుటకు ఇతరుల సాక్ష్యం కావలసి వచ్చింది . ఇప్పుడు మాత్రం వారి సాక్ష్యమెందుకు కావాలి* ? నీవు మేల్కొని ఉన్నప్పుడే వాళ్ళు నీవు నిద్రపోయినపుడు ప్రపంచం ఉన్నదని చెప్పగలరు . కానీ నీ ఉనికి వేరు . నిద్రలేవగానే హాయిగా పడుకున్నానంటావు . అంటే ఎంత నిద్రలోనైనా నీ గురించి నీకు ఎరుక ఉందని తెలుసు . కాని ప్రపంచం ఉందో లేదోనని ఏ మాత్రము ఎరుకలేదు . నీవు మేల్కొని ఉన్నప్పుడు ప్రపంచము వచ్చి నేను నిజముగా ఉన్నానంటుందా ? లేక నీవంటున్నావా ? నీ గురించి నేనున్నాను అనగలను . అంటే నీ ఉనికి కేవలం ఉనికి మాత్రమే కాదు . దాని గురించి నీకు జ్ఞానమున్నది . కావున *నిజానికి ఆ ఉనికే చైతన్యం* . ప్రపంచము తనంతట తాను ఉండదు . తన ఉనికి గురించి దానికి తెలియదు . కావున అది అసత్యం . "  భగవాన్ చెప్పినది నేను ఎవరో తెలుసుకోమన్నారు అన్ని సందేహాలు తీరుతాయని చెప్పారు . గాఢనిద్రలో జ్ఞానాదులేవీ ఉండవు . అలాగే ఆత్మానుభవమయిన దశలో కూడా ఉండవు . మేల్కొని ఉన్న స్థితిలో ఏవో జరుగుతున్నాయని అనుకోవటం . ఆ అనుకునే వాడికేగాని మరేమీకాదు . ఆ అనుకునేవాడే మిథ్య అవటం వల్ల ఏదో సంభవించుటలేదు నిజానికి . 

      భగవాన్ చెప్పినట్లుగా కనిపించే ప్రపంచం మిథ్య . ఆత్మ జ్ఞానానికి అది నిజం కాదని గ్రహిస్తారు . దేహభావన కలవాడు బాహ్య దృశ్యముల వెంట దృష్టి పరిగెత్తేవానికి జగత్తు సత్యముగనే కన్పిస్తుంది . మరి ఆ దృష్టి బాహ్యము నుండి మరల్చి అంతర్ముఖము చేసికొని లోనున్న ఆత్మను చూచి ఆ ఆత్మయే అంతట నిండియున్నదని జగత్తుకాని జీవుడు కాని ఈశ్వరుడు కాని అంతా బ్రహ్మమే లేక ఆత్మయే అని ఎరుక మన దృష్టి అంతర్ముఖమైనపుడు ఆత్మ జ్ఞానము కలిగినపుడు తెలుస్తుంది . సర్వం బ్రహ్మమయం . ఆ అతీతమైన స్థితికి పోవాలంటే ఆ శక్తిని అనగా అంతా బ్రహ్మమయంగా చూడాలి అంటే భగవాను అనన్య శరణాగతి వేడుకుందాం . వారి కరుణాకటాక్షములో మనకి కూడా బాహ్యదృశ్య ములపై దృష్టిపోక మహర్షి ఆశీర్వచనముతో మన దృష్టి అంతర్ముఖమై ఆత్మజ్ఞాన బోధ కల్గును . కావున మనమందరము భగవానుని ఆ స్థితికి రావాలని వేడుదాం . 

శరణు శరణు భగవాన్ శ్రీ రమణ మహర్షి .

 భగవాన్ రమణా నీవే శరణాగతి . 

అరుణాచల శివ 

No comments:

Post a Comment