Monday, January 16, 2023

రమణాయ అధ్యాయము 29 ( శ్రీ దత్తుడు భార్గవ రామునికి ఉపదేశించిన జ్ఞానం

 ఓం నమో భగవతే శ్రీ రమణాయ 
అధ్యాయము 29
( శ్రీ దత్తుడు భార్గవ రామునికి ఉపదేశించిన జ్ఞానం తరువాయి భాగం )

    శ్రీ దత్తుడు కనిపించే జగత్తు సత్యము కాదని అదియొక భ్రాంతి అని దానికి గల కారణం అజ్ఞానమే అని ఆ అవిద్య వలన చిదాత్మను చూడలేక జగత్తును మాత్రమే ఉన్నట్లుగా భావించి లేని జగత్తును ఉన్నదని అనుకొంటున్నామని ఈ మాయకు గల కారణం మానవుడు వారి శరీరములే ఆత్మ అని వారి భావన యొక్క దృఢ సంకల్పముచేతనే వారికి శరీరమే ఆత్మగా కనిపించుచున్నది అని మరియు వారి యొక్క అవిద్యా భావనముచే లేని జగత్తు సత్యమని అనిపిస్తుందని అటువంటివారు ఆత్మయే సత్యమని అగుపించే జగత్తు అసత్యమని దృఢముగా భావించవలెనని ఎవరు ఎట్లు జగత్తును గురించి భావించుచున్నారో అతనికి ఆ జగత్తుకూడా అట్లే కనిపించుచున్నదని పరశురామునికి సూచించినారు . ఆత్మ చైతన్యమునకు వెలుపలగా జగత్తనునది ఏదియు లేదు . అది అంతయు అద్దములో ప్రతిబింబమున్నట్లు ఆత్మ చైతన్యమునందే యున్నది . కావున ఆత్మ ఒక్కటియే సర్వ ప్రపంచము తనయందే ప్రతిబింబింపచేయుచు ప్రకాశింప చేయుచున్నది . ఆత్మకు చైతన్యమే స్వరూపము ఆత్మయందు భిన్నముగా జగత్తనేది ఉండదు . ఎన్ని విధములైన ప్రతిబింబాలు అద్దములో కనిపించినను అద్దము పరిశుద్ధముగనే ఏ వికారం పొందక ఎలాగైతే ఉండునో అలాగే ఈ జగత్ ప్రతిబింబాలు ఎన్ని వచ్చిపోయినను ఆత్మ చైతన్యం కూడా అద్దమువలె పరిశుద్ధముగా ఏ వికారము లేకుండా ఉండును . ఆత్మ అలాగని అద్దముగా అనుకోకూడదు . అద్దానికి ఎదుట వస్తువున్నప్పుడే ఆ అద్దములో ఆ వస్తువు యొక్క ప్రతిబింబము కనిపించునుగానీ ఆత్మయందు ప్రతిబింబం కనిపించుటకు ఆ ఆత్మకెదురుగా ఏ వస్తువు కూడా ఉండనవసరం లేదు . కాని తన స్వతంత్రంచే ఏ వస్తువు లేకుండానే దాని మహిమచే జగత్తును భాసింపచేయును . సంకల్పముచే మనస్సునందు ప్రపంచము భాసించును . ప్రపంచమంతా మనస్సే తప్ప వేరొకటి కాదని శ్రీ దత్తుడు చెప్పెను . *ఆత్మయందు బాహ్య పదార్ధమున్నట్లు తోచుటయే సృష్టి* , అదే అవిద్య కూడా నేను శరీరము అను భావనే అవిద్యకు కారణం .

       శ్రీ దత్తుడు తత్వజ్ఞానాన్ని పరశురామునికి బోధించెను . ఇక్కడ ఈ సంఘటనను చెప్పుటకు గల కారణం సాక్షాత్తు త్రిమూర్తి అవతారమగు ఆ దత్త భగవానుడే ' నేను'ను గురించి , శరీరము గురించి , జగత్తు గురించి , ఆత్మ గురించి కొన్ని రహస్యాలు పరశురామునికి ఉపదేశించుట వలన భగవాన్ రమణ మహర్షిగారు చెప్పిన నేను గురించి , శరీరం గురించి , జగత్తు గురించి , ఆత్మను గురించి రహస్యాలతో పోల్చి చూసిన కనిపించే జగత్తు మిథ్యే అని శరీరము ఆత్మ అని భావించుట అసత్యమని నేను అనే అహంభావన వలన మానవులు తన అహంభావన చేతనే ఇంద్రియలోలుడై విషయ వాంఛితుడైలోనున్న అసలైన నేనును అనగా ఆత్మను మరచి తానే నేనుగా భావించి తన దృష్టిని బాహ్య విషయాలపై మరల్చుటచే అవిద్యారూపుడై సుఖములను బైట వెతుకుతున్నాడే కాని శాశ్వత సుఖములను లోనున్న దానిని తెలిసికొనలేక బాహ్యముగా కనిపించే అశాశ్వత సుఖాలకు లోనవుట వలన దుఃఖాన్ని కూడా పొందుచు జన్మ జన్మలు ఈ విధముగనే పుడుతూ మరణిస్తూ తత్వజ్ఞానమును తెలుసుకొన లేకపోవుచున్నాడు . *భగవాన్ రమణ మహర్షిగారు ఏ రహస్యాన్ని దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా సులువైన పద్ధతి ద్వారా ఆత్మజ్ఞానాన్ని గూర్చి విశదీకరించినారు* . కావున భగవంతుడు మనకు మానవ జన్మ ఇచ్చినందుకు మన జన్మను సార్దకము చేసుకోవలెను . అన్ని జన్మలలో ఉత్తమమైనది . *మానవ జన్మయే మానవ జన్మకు ప్రాముఖ్యత ఏమిటంటే జ్ఞానాన్ని ప్రసాదించినాడు ఆ భగవంతుడు* . కావున మనకిచ్చిన జ్ఞానముతోనే మనకిచ్చిన అమూల్యమైన ఈ మానవ జన్మయందే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుందాం . కనీసం ఆ ఆత్మజ్ఞానాన్ని గురించి తెలుసుకొనుటకు ప్రయత్నించినను ఒకవేళ ఈ జన్మలో అది సాధ్యము కాకపోయినను మరో జన్మలోనైనా పూర్వజన్మ సంస్కారానుగుణముగా పొందే అవకాశము కలుగవచ్చును . కావున భగవాన్ రమణ మహర్షి గారిని మనకు ఈ జన్మయందే ఆత్మ జ్ఞానము కలుగువలెనని మన కాలాన్ని వృధా చేయకుండా ఆత్మ సాక్షాత్కారమునకై యత్నించే మన ప్రయత్నము సఫలీకృతము కావాలని భగవంతుడిచ్చిన ఈ మానవ జన్మ సార్ధకము చేసుకోవాలని అనన్య శరణాగతితో భగవాన్ రమణ మహర్షిని వేడుకుందాం . 
ఓ రమణా నీవే మాకు శరణాగతి . 
అరుణాచల శివ. 

No comments:

Post a Comment