Monday, January 2, 2023

ఐతరేయం

 బుద్ధుడు ఉపనిషత్తులు చెప్పిన పంచభూతాల్లో ”ఆకాశం” అనే భూతాన్ని ఒప్పుకోలేదు. అలాగే ఆకాశభూత నిర్మితిగా చెప్పిన ”ఆత్మ”నూ అంగీకరించలేదు.

ఐతరేయం

ఈ ఉపనిషత్‌ లో ”పునర్జన్మ” భావాలు ఒక కల్పనగానే కన్పిస్తాయి. దీనికి ముందున్న ఉపనిషత్తులు పునర్జన్మ గురించి ఎంతగా చెప్పినా అది ఈ ఉపనిషత్‌ కాలానికి ఈ దేశప్రజల్లో బలంగా నాటుకుపోలేదు. ఈ ఉపనిషత్‌ జన్మల్ని 3 రకాలుగా వర్గీకరించింది.-

మొదటి జన్మ: పాలలో వెన్నలా, చెరకురసంలో బెల్లంలా పురుషుని దేహంలో ”రేతస్సు”(వీర్యం) ఉంటుంది. ఇది స్త్రీ గర్భంలో పడడమే మొదటి జన్మ. గర్భధారణ ప్రక్రియ మూలం పురుషుడేే. స్త్రీ కాదు. అని చెప్తుంది ఈ ఉపనిషత్‌.

రెండవ జన్మ: స్త్రీ గర్భాశయంలో పెరిగి పెద్దయి- పుట్టడం జీవుని రెండో జన్మ.

మూడవ జన్మ: ఈ జీవుడు పెరిగి పెద్దవాడై, తండ్రిగా మారి, తిరిగి పుత్రునిగా పుట్టడం మూడో జన్మ-

ఇలా ప్రతి జీవికి తను తల్లి కడుపున పుట్టడం, భూమ్మీద పడడం, తిరిగి తను భార్యవలన బిడ్డగా పుట్టడం ఈ మూడు జన్మలూ ఒక పరంపరగా ఉంటాయి. ఇలా ఈ లోకం ‘సంతానం’ రూపంలో తెంపు లేకుండా ఉంటుంది. – అంటుంది ఈ ఉపనిషత్‌. ఈ భావాలు బౌద్ధంలోని ప్రతీత్య సముత్పాదానికి నకలే.

ఇక ఆ తర్వాత ఉపనిషత్తుల్లో ‘ఆత్మ’ భావాలు ఎన్నెన్ని ఉన్నా అవన్నీ బుద్ధుని తర్వాత కాలానివే. దాదాపుగా ఇదే కాలంలో కొందరు స్వతంత్ర దార్శనికులు ఉన్నారు. వారు కూడా ‘ఆత్మ’ ‘దేవుడు’ ‘పునర్జన్మ’ మీద తమ తమ అభిప్రాయాలు చెప్పారు. వాటినీ చూద్దాం-

చార్వాకుడు: ‘భగవంతుడు లేడు. ఆత్మలేదు. పునర్జన్మలేదు. పరలోకం లేదు.’ అని చెప్పాడు.

అజితకేశకంబళి: పరలోకం లేదు. మూర్ఖుడైనా, పండితుడైనా చనిపోగానే ఉచ్ఛిన్నుడవుతాడు.

మక్కలిగోశాలి: ”జీవుల పాపపుణ్య కర్మలు ముందే నిర్ణయించబడతాయి. ప్రత్యేక పూజల వల్ల, శీలం వల్ల, దానం వల్ల అవి మారవు. ఆరు జన్మల వరకూ జీవులు సుఖదుఃఖాలు అనుభవించాల్సిందే.

ప్రకృథ కాత్యాయన్‌: ప్రతి వస్తువూ అచలమైంది. నిత్యమైంది. ఏ కర్మా దాని మూలాన్ని మార్చలేదు. (అంటే కర్మ ప్రభావం వస్తువు మీద పడదు) కాబట్టి పాపపుణ్యాలు అంటవు.

పూరణ కశ్యపుడు: ‘ఎంత మంచిపని చేసినా పుణ్యం రాదు. ఎంతచెడ్డ పనిచేసినా పాపం అంటదు’- అంటాడు. ఆయన అక్రియతావాది. అహేతువాది. అ ప్రత్యయవాది. అంటే కార్యకారణవాదాన్ని ఒప్పుకోడు. అసత్తు నుండి (లేని దాన్నుండి) సత్‌ (ఉన్నది) ఉత్పత్తి అవుతుంది అంటారు. ఈయన వాదాన్ని ‘అదిత్య సముత్పాదం’ అంటారు.

ఆత్మ ఉండొచ్చు. ఆత్మ లేకపోవొచ్చు. ఆత్మ ఇదని చెప్పలేనిది కావొచ్చు…’ అని మహావీరుడు చెప్పాడు.

ఇవీ, బుద్ధుని కాలం వరకూ ఉన్న దైవ, ఆత్మ, పునర్జన్మ భావాలు.

ఇవి నిజాలైనా కాకపోయినా, సత్యాలైనా కాకపోయినా మానవ విజ్ఞాన ప్రవాహంలో ఇవన్నీ మైలురాళ్ళే. తీసిపారేయాల్సినవి కావు. ప్రపంచంలో ఈనాటికీ ఈ భావాలన్నీ ఉన్నాయి. ఇంకా బ్రతికే ఉన్నాయి. అక్కడక్కడా కొద్దిగా రూపుమార్చుకున్నాయి తప్ప, దాదాపుగా అన్ని ధోరణులూ ఏదొక ప్రాంతంలో, ఏదొక జాతిలో బ్రతికే ఉన్నాయి.

ఇవి మైలురాళ్ళని ఎందుకన్నానంటే… ఒక్కసారి చిన్నతనంలో ‘ఆవు-పెద్దపులి’ పాఠంలోని ఒక పద్యం గుర్తుకు తెచ్చుకుంటే ఈ విషయం తేలిగ్గా అర్థం అవుతుంది.

”నుతజల పూరితంబులగు నూతులు నూరిటికంటే…” అనే పద్యాన్ని చూద్దాం. దాని అర్థం ఇది…..

వంద మంచినీటి కయ్యలకంటే ఒక బావిమేలు.
వంద బావులకంటే ఒక్క జలాశయం మేలు
వంద జలాశయాల కంటే ఒక్క క్రతువు మేలు
వంద క్రతువుల కంటే ఒక్క కొడుకు మేలు
వందమంది కొడుకుల కంటే ఒక సత్యవాక్యం మేలు…” అన్నట్టు…

జనన మరణాల గురించి పట్టించుకోని ఇతర జీవప్రపంచం కంటే …
జననమరణాల ప్రాధాన్యతను గురించి మానవులకు తొలిగా కలిగిన భావనలు వందరెట్లు మేలు.
దానికంటే …మరణానంతర సంస్కారాలు సాగించడం వందరెట్ల మేలైన ఆలోచన.
ఈ ఆలోచనే మరణానంతర జీవితం గురించి ఆలోచించడానికి పునాది అయ్యింది కాబట్టి.. దేవుడు, దైవలోక భావనలు వందరెట్లు మేలు.
ఈ దైవభావనలో మానవ సమాజ జీవనానికీ, సామాజిక నియమాలకూ సంబంధించిన మంచి-చెడులకు ముడిపెట్టి ”స్వర్గ-నరకాలు” భావన చేయడం ఈ మంచి చెడులతో తిరిగి మరలా, మరలా పుడతాం అనే ఆలోచన ఇంకాస్తమేలు.
ఇలా తిరిగి పుట్టేది ఒకటుందనీ, అదే ”ఆత్మ” అని ఆలోచించడం, ఇంకా మేలైన ఆలోచనే...🙏

🍁సర్వేజనః సుఖినోభవంతు 🍁                @
.

No comments:

Post a Comment