301222g0913. 311222-4.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
శేషాద్రి లేదా శేషాచలం:
➖➖➖✍️
ఈ శిఖరానికి శేషాద్రి లేదా శేషాచలం అనే నామధేయం రావడానికి వెనుక చాలా ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి.
ఒకప్పుడు వైకుంఠవాసి అయిన శ్రీమహావిష్ణువు మందిరానికి ద్వారపాలకులుగా ఉండే జయ విజయులు శాపవశాత్తూ భూలోకంలో రాక్షసులుగా జన్మించినప్పుడు, ఆపద్ధర్మంగా ఆదిశేషుడు వైకుంఠద్వారానికి కాపలా కాస్తున్నాడు.
శ్రీమహావిష్ణువుకు పర్యంకముగా, తల్పముగా ఛత్రముగా ఇంకా అనేక రకాలుగా యుగయుగాల నుండి సేవలందించడం వల్ల శ్రీమహావిష్ణువుకు శ్రీమహాలక్ష్మి తర్వాత అత్యంత సన్నిహితంగా మెలగటం వల్ల; ప్రస్తుతం ద్వారపాలకునిగా అదనపు బాధ్యత చేపట్టడం వల్ల అతనిలో కొద్దిగా అహంకారపు ఛాయలు పొడచూపాయి.
దానిని గమనించిన శ్రీమహావిష్ణువు ఆదిశేషునికి తగిన గుణపాఠం నేర్పి,
సరి ఐన బాటలో పెట్టాలని తగిన అవకాశం కోసం వేచి చూస్తున్నాడు.
ఇదిలా ఉండగా ఒకనాడు అష్టదిక్పాలకులలో ఒకడు, శ్రీమహావిష్ణువుకు పరమభక్తుడు, వినయ విధేయతలతో అణిగిమణిగి ఉండే వాయుదేవుడు విష్ణుమూర్తి దర్శనార్థం వైకుంఠానికి యేతెంచి, ద్వారపాలకునిగా ఉన్న ఆదిశేషునితో శ్రీహరి దర్శనానికై అనుమతి కోరాడు.
వాస్తవానికి దేవతల తారతమ్యంలో వాయుదేవుడు ఆదిశేషువు కంటే పై కక్ష్యలోని వాడు. కానీ, ఆదిశేషువు తరతమ బేధాలను గుర్తించకుండా వాయుదేవునికి అహంకారపూరితంగా, నిర్లక్ష్యంతో సమాధానమిచ్చాడు.
అత్యవసర విషయమై శ్రీమన్నారాయణునితో సత్వరమే సమావేశమవ్వాలని చెప్పినప్పటికీ ఆదిశేషుడు ఏకపక్షంగా వ్యవహరించి, వాయుదేవుణ్ణి అడ్డుకుని, పరుషపదజాలాన్ని ఉపయోగించాడు.
దాంతో స్వతహాగా నిగర్వి, శాంతస్వభావుడు ఐనట్టి వాయుదేవుడు కూడా కోపోద్రిక్తుడై ఆదిశేషువును తూలనాడాడు.
శ్రీమహావిష్ణువుకు అతి సమీపంలో తాను ఉంటానని, వారికి తాను అత్యంత ప్రీతిపాత్రుడనని ఆదిశేషుడు వాదించగా; విసుగు చెందిన వాయుదేవుడు ఇంటి యజమానికి సమీపంలోనున్నంత మాత్రాన కాపలాగా ఉంచుకున్న శునకం గొప్పదెలా ఔతుందని పరుషంగా ప్రశ్నించాడు.
అలా వారిరువురికి చాలాసేపు వాదోపవాదాలు జరుగుతుండగా,
వారి సంభాషణలను అన్యాపదేశంగా విన్న విష్ణుమూర్తి తన పీఠం నుంచి తరలి ప్రవేశద్వారం వద్దకు వచ్చాడు.
దాంతో కక్షిదారులిరువురు శ్రీమహావిష్ణువుకు తమ తమ వాదనలను వినిపించారు. అంతే కాకుండా, వారిద్దరిలో ఎవరు గొప్పవారో తేల్చి చెప్పవలసిందిగా శ్రీహరిని కోరారు.
ముల్లోక వాసులందరికీ ప్రాణాధారమైన తాను గొప్పవాణ్ణని వాయుదేవుడు; భూమండల మంతటినీ తన పడగలపై మోస్తున్నందున తానే గొప్పవాణ్ణని ఆదిశేషుడు ఇలా ఎవరికి వారు తమ గొప్పతనాన్ని శ్రీమహావిష్ణువుకు చెప్పుకున్నారు.
శ్రీమన్నారాయణడు ఎప్పటి నుంచో వేచి చూస్తున్న తరుణం రానే వచ్చింది. అదే అదనుగా ఆదిశేషువుకు తన స్థానం ఏమిటో తెలియబరచదలచుకున్నాడు. వారిరువురిని ఉద్దేశించి ఇరువురు తమ తమ స్థానాలలో, కర్తవ్య నిర్వహణలో తిరుగులేని వారేనని; వారిలో ఎవరు అధికులో తేల్చటం అత్యంత కష్టతరమని బోధపరచి, వారిరువురికి ఒక పరీక్ష పెట్టదలచుకున్నట్లుగా చెప్పాడు.
వైకుంఠంలో అల్లంత దూరాన ఉన్న 'ఆనందం' అనే పర్వతాన్ని చూపించి ఆదిశేషువు తన పడగలతో ఆ పర్వతాన్ని గట్టిగా చుట్టుకుని ఉండాలని; వాయుదేవుడు శక్తినంతా ఉపయోగించి తన వాయుతాడనంతో, ఆదిశేషువు చుట్టుకొని ఉండగా ఆ పర్వతాన్ని కదిలించడానికి ప్రయత్నించాలని ఆదేశించాడు. పర్వతం కదిలితే వాయుదేవుడు గెలిచినట్లు, లేకుంటే విజయం ఆదిశేషువుదన్నమాట.
ఆ పందానికి అంగీకరించిన వారిరువురు ఈ పరీక్షకు సన్నద్ధమయ్యారు.
అపరిమిత బలశాలి అయిన ఆదిశేషువు ఆనందపర్వతాన్ని చుట్టుకొని, పడగలతో గట్టిగా అదిమి పెట్టి, తన బలానికి తానే మురిసిపోయాడు. వాయుదేవుడు ఆ పర్వతాన్ని ఏమాత్రం కదిలించలేడన్న ధీమాతో నిశ్చింతగా ఉన్నాడు.
ఆటు వాయుదేవుడు భారమంతా శ్రీమహావిష్ణువు పై వేసి, ఆ దేవదేవుని మనసులోనే స్మరించుకుంటూ, ఒక్క ఉదుటున ఉధృతమైన ప్రభంజనాన్ని సృష్టించాడు.
సాక్షాత్తు శ్రీమన్నారాయణుని మహిమ ముందు, అహంకారంతో విర్రవీగే ఆదిశేషుడి శక్తి ఏపాటిది?
చండప్రచండంగా వీచిన వాయువు ధాటికి ‘ఆనందం’ అనబడే ఆ పర్వతం ఆదిశేషువుతో సహా ఎగిరి; కొన్ని వేల యోజనాల దూరంలో ఉన్న, భూలోకం లోని సువర్ణముఖి నదీ తీరాన వచ్చి పడింది.
**************
మరో కథనం ప్రకారం, ఈ పోటీ జరుగుతున్న సమయంలో శ్రీమన్నారాయణుని సంకేతాన్ని అనుసరించి; నారదమహర్షి వైకుంఠాని కేతెంచి, ద్వారం ముందు నిలిచి, తన వీణతో మృదుమధురమైన నాదస్వరం పలికించాడు. నాగులకు సహజమైన ప్రవృత్తితో ఆ నాదస్వరానికి మైమరచిన ఆదిశేషువు తన పట్టును కొద్దిగా సడలించి, తన్మయత్వంతో నాట్యం చేయసాగాడు. అదే అదనుగా వాయుదేవుడు విజృంభించి, తన ప్రచండమారుతంతో ఆదిశేషువుతో సహా ఆనందపర్వతాన్ని భూలోకంలోకి విసిరి వేశాడు. అలా ఎగరవేయబడ్డ పర్వతం స్వర్ణముఖి నదీతీరం వద్ద ప్రతిష్ఠితమైంది.
*************
తిరుమలకొండపై ఇప్పుడు శ్రీనివాసుడు కొలువుదీరి ఉన్న 'ఆనందనిలయం' ఆ పర్వతం పైనే నెలకొని ఉన్నది.
ఈ సంఘటన జరిగిన తర్వాత, వైకుంఠవాసి అయిన మేరుపర్వతం శ్రీమహావిష్ణువు వద్దకు వచ్చి వైకుంఠం నుండి భూలోకంలోకి వాయుదేవుని ద్వారా విసిరివేయ బడ్డ 'ఆనందుడు' అనే పర్వతం తన తనయుడని; ఆదిశేషునికి వాయుదేవునికీ మధ్య తగాదాలతో ఏమాత్రం సంబంధం లేని తన కుమారుడు, తనకూ వైకుంఠానికి దూరమై, చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాడని; తాను,తన తనయుడు శ్రీహరిని యుగయుగాలుగా భక్తిశ్రద్ధలతో సేవించుకుంటున్నామని, ఎలాగైనా తన తనయుడిని అనుగ్రహించాలని మొరపెట్టుకుంది.
మేరుపర్వతం మొరను ఆలకించిన శ్రీమహావిష్ణువు ఇదంతా తన సంకల్పమేనని, ముందు ముందు రాబోయే 28వ కలియుగంలో తాను శ్రీవేంకటేశ్వరునిగా భూలోకంలో అవతరిస్తానని, అప్పుడు తాను మేరుపర్వతం తనయుడైన ఆనందపర్వతం పైనే కొలువై ఉండి, కలియుగాంతం వరకు భక్తులను ఉద్ధరిస్తారని, తద్వారా ఆనందుని జన్మ సార్థకమై అజరామరమైన కీర్తిప్రతిష్ఠలతో వర్ధిల్లుతాడని శెలవిస్తాడు.
ఆ విధంగా శ్రీనివాసుడు కొలువై ఉన్న శేషాచల పర్వతానికి 'ఆనందపర్వత' మనే మరో పేరు కూడా వచ్చింది. అలాగే, శ్రీనివాసుడు కొలువై ఉండే ఆలయానికి కూడా 'ఆనందనిలయం' అనే సార్థక నామధేయం ఏర్పడింది.
సాక్షాత్తు భగవంతుణ్ణే మోయగల సామర్థ్యం కలవాడు, ఈ భూమండలాన్నంతటిని తన పడగలపై మోయగల శక్తి సంపన్నుడు అయిన ఆదిశేషువు సైతం అజ్ఞానపూరితమైన అహంకారానికి లోను కావడం వల్ల, పరాభవాన్ని మూటగట్టుకున్నాడు.
ఆ విధంగా ఎంతటి గొప్ప వారికైనా డాంబికము, గర్వము, అహంకారము, అహంభావము తగవని శ్రీ మహావిష్ణువు తెలియజెప్పాడు. అంతేకాకుండా వినయ విధేయతలతో నుండి, భారాన్నంతా తనపై వేసి, యథాశక్తి తన కర్తవ్యాన్ని నిర్వర్తించిన వారి పక్షాన నిలచి వారికి విజయాన్ని ప్రసాదిస్తానని కూడా శ్రీమహావిష్ణువు చాటిచెప్పాడు.
ఆదిశేషుని వృత్తాంతాన్ని, శేషాచల వాసుణ్ణి తలపుకు తెచ్చుకున్నప్పుడు, అహంకారం ఎంతటి అనర్థాలు తెస్తుందో గుర్తుకు వస్తుంది. శ్రీవెంకటేశ్వరుని దర్శనార్థం తిరుమల క్షేత్రానికి భక్తిభావంతో విచ్చేయాలే తప్ప అధికారదర్పం, అతిశయం ప్రదర్శిస్తే; యాత్ర సాఫల్యం కాకపోవడమే గాకుండా, అనేక అనర్థాలకు కూడా దారి తీస్తుందన్న విషయాన్ని ఈ ఉదంతం స్ఫురణకు తెస్తుంది.✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
No comments:
Post a Comment