Thursday, January 5, 2023

మీ జీవితం మీ చేతుల్లోనే ! (సద్గురు సుభాషితాలు)

 మీ జీవితం మీ చేతుల్లోనే !
(సద్గురు సుభాషితాలు)
___________________
 - శ్రీ జగ్గీ వాసుదేవ్ 

దయచేసి మీ జీవితాన్ని మీ చేతిలోకి తీసుకోండి.దేవుడి చేతికి ఇవ్వకండి.
మీకు ఆనందాన్నిచ్చేది అని నమ్మి మీరు దేనిని స్వీకరించినా, దాంతోపాటుఉచితంగా కొన్ని సవాళ్లు మీకు వచ్చి చేరతాయి.
అది కఠిన పరిశ్రమ కావచ్చు, ముమ్మరమైన పోటీ కావచ్చు, ఎదురు చూడనిఆటుపోటులు కావచ్చు అవి ఎలాంటివయినా సరే సంతోషంగా, ఆశతో స్వీకరించండి.

మీరు ఎదగాలని నిజంగానే కోరుకుంటున్నట్లయితే, మీకు ఎదురైన కష్టాలను ఇష్టంగా
ఆహ్వానించండి.ఓడిపోయి, అందువల్ల నిరాశానిస్పృహలకు లోనైనవాళ్లు సాధారణంగా
చెప్పేటటువంటి విషయం ఏంటో తెలుసా?
‘నాకు కాలం కలిసిరావడంలేదు. నేను పిండి అమ్ముదామంటే పెనుగాలి వీస్తోంది. ఉప్పు అమ్ముదామనుకుంటే గాలివాన వస్తోంది' అని. మీరు కావాలనుకున్నా, వద్దనుకున్నా
 ఈ ప్రపంచం మీ మీదకు కష్టాలను
రెండు చేతులా విసరుతుంది. అది తప్పదు.

అటువంటప్పుడు వాటిని ఎదుర్కోవడానికి ఎందుకు భయపడతారు? కఠినమైన
సందర్భాలు మీ జీవితంలో శాపం అనుకోవద్దు. నిజానికి అవి మీకు ఇవ్వబడ్డ వరాలుఅని తెలుసుకోండి.

మీరు ఒక సినిమాకు వెళ్లారు. ఒకదాని వెనుక ఒకటిగా అందులో సంఘటనలన్నీమీరు అనుకున్నట్లే జరిగితే, ఆ సినిమాను ఆసక్తితో చూస్తారా లేక బోర్ అంటూ లేచి
బయటకు వెళ్లిపోతారా?

ఎదురుచూడని మలుపులే జీవితానికి కొత్త అందాన్నిచ్చి ఆసక్తిదాయకంగామారుస్తాయి.

ఆ పరమాత్ముడితో ఒక సన్నకారు రైతు ఒకసారి బలంగా దెబ్బలాట
వేసుకొన్నాడు.
“నీకు పైరు గురించి ఏం తెలుసు? నీకిష్టమైనప్పుడు వానను కురిపిస్తావు. అకాలంలో గాలి వీచేలా చేస్తున్నావు. నీతో పెద్ద గొడవగా ఉంది. మాట్లాడకుండా ఆ
పనులన్నీ ఒక రైతుకు అప్పగించరాదూ!" అన్నాడు.

భగవంతుడు వెంటనే “అలాగా! అయితే ఈనాటి నుంచి గాలి, వాన, ఎండఅన్నీ నీ అజమాయిషీలోనే ఉంటాయి” అంటూ వరమిచ్చి చక్కాపోయాడు.

ఆ రైతు ఆనందానికి అవధుల్లేవు.
ఋతువులు మారాయి. “వానా! కురవాలి” అన్నాడు రైతు.
కురిసింది. ఆగమనగానే ఆగింది.
తడినేలను దున్నాడు. కావాల్సిన వేగంతో గాలిని విసరమన్నాడు. విసిరింది.విత్తుజల్లాడు. గాలి, వాన, ఎండ అన్నీ ఆ రైతు మాట ప్రకారమే జరిగాయి. పైరుపచ్చగా ఏపుగా పెరిగింది. ఆ పొలం
చూడ్డానికి ఎంతో రమ్యంగా వుంది.

కోతలకాలం వచ్చింది.రైతు ఒక కంకి కోశాడు. గింజనులిమి చూశాడు. అదిరిపడ్డాడు.లోపల ధాన్యం లేదు. ఉత్తి ఊక,మరొకటి, మరొకటి అంటూ అన్నీకోసి చూశాడు. ఎందులోనూ ధాన్యము లేదు. అంతా ఉత్తి ఊకమాత్రమేవుంది.

“హారి దేవుడా!” అంటూ
కోపంగా ఎలుగెత్తి పిలిచాడు. “వాన,
ఎండ, గాలి అన్నీమోతాదుల్లోనే వాడాను, కాలాను గుణంగా, ఋతువులకి తగ్గట్లుగా.
అయితే పైరు పాడయ్యిందే! ఏం?
ఎందుకు?”

భగవంతుడు నవ్వాడు. “నా
అధీనంలో గాలి బలంగా వీచేది.
అప్పుడు అమ్మను కౌగిలించుకొనే
పిల్లల్లా నారు వేళ్లు భూమిలోకి లోతుగా జొచ్చుకొని గట్టిగా పట్టుకొనేవి. వాన తక్కువైనానీటికోసం  వేళ్లను నాలుగు పక్కలకు పాకించేది. 

పోరాటం అంటూ ఉంటేనే చెట్లు
తమను కాపాడుకోవడం కోసం బలంగా పెరుగుతాయి.
అన్ని వసతులు నువ్వే కల్పించేసరికి నీ పైరు సోమరిదయ్యింది. నవనవలాడుతూపెరిగిందే తప్ప, ఆరోగ్యవంతమైన ధాన్యాన్ని అందించాలని దానికి తెలీదు”.
“నాకు నీ గాలి, వాన, ఎండ వద్దు. నువ్వే ఉంచుకో” అంటూ రైతు దేవుడిచ్చినవాటిని తిరిగిచ్చేశాడు.

జీవితంలో అన్నీ చక్కగా అమరిపోతే, అంతకన్నా విసుగు, శూన్యం వేరే ఉండదు.కష్టాలు మిమ్మల్ని అదిమేసేటప్పుడే మీలో చాకచక్యం మరింత పెరుగుతుంది. సవాళ్లే
మనిషికి పరిపూర్ణతనిస్తాయి.

చీకటి అనే ఒక కష్టం ఉండబట్టే కదా విద్యుద్దీపం అనేది కనిపెట్టబడింది?
ప్రయాణం కష్టతరం కాబట్టే కదా వాహనం యొక్క ఆవశ్యకత తెలిసొచ్చింది. వాటికోరూపం అంటూ ఇవ్వబడింది? ఎక్కడో దూరంగా ఉన్న వాళ్లతో మాట్లాడటం కష్టంకాబట్టేకదా, దూరశ్రవణ యంత్రం (టెలిఫోన్) రూపుదిద్దుకుంది?

మీకు కష్టాలనేవే లేకుండా ఉంటే మీ తెలివితేటల్ని మీరు ఎలా
తెలుసుకోగలుగుతారు?

శంకర్ పిళ్ళై కొత్త ఇల్లు కట్టుకోవాలనుకొన్నాడు. నిపుణుడు ఎన్నో రకాల ప్లాన్లుచూపించారు.
"కాదు, ఇది కాదు. నేను అనుకొంటున్నది 'వేరే లాంటిది’ ” అంటూ ఒక్కొక్కప్లానునూ నిరాకరించాడు.
నిపుణులు విసిగిపోయారు. “మీ మనసులో ఏముందో చెప్పండి?” అని
ప్రశ్నించారు. ఒక పాత ఇత్తడి పిడిని ఒక బక్కెట్టులో నుంచి తీసి, “దీన్ని తలుపుకు సరిగా పట్టేలా పెట్టగలిగేలాంటి ప్లాను మీరు ఏదీ చూపించలేదు కదా!” అన్నాడు.

కష్టాలను ఎదుర్కొనే ధైర్యం లేదు.. అయితే, జీవితం మాత్రం హాయిగా అన్నివసతులతో చక్కగా అమరాలి అనుకొనే వాళ్లు శంకర్ పిళ్ళైలా పిడిపట్టుకుని రాజుగారి
కోటలాంటిది కావాలని ఆశపడతారు.

ఎందుకని అన్నీ మీరనుకొన్నట్లే జరగాలి? ఏదో ఒకటి పెకలించుకొని బయటకు pపోనీయండి. దానిని ధైర్యంగా ఎదుర్కొందాం, ఆసక్తితో మళ్లీ ప్రయత్నిద్దాంప్

ఇంక సవాళ్లు ఎదురైతే వాటిని శపించకండి. వాటిని కూడా సంతోషంగాఎదుర్కోండి.

ఇంతమంది దేవుళ్లుండీ, ఇందరు
మహాత్ములు పుట్టీ ఆకలి, బాధ, రోగాలు అన్నీఇంకా ఎందుకు? ఈ దేశంలోని ఆకలికీ,తిండి దొరక్కపోవడానికీ ఎవరు కారణం?
ఏమాత్రం బాధ్యత లేకుండా జనాభానుపెంచింది మీరా? దేవుడా? లెక్కాపత్రం
లేకుండా పిల్లల్ని కనిపారేసి, 'దేవుడిచ్చాడు'అని సిగ్గులేకుండా చెప్పకండి.

బుద్ధుడు, మహావీరుడు వంటి వాళ్లంతాజ్ఞానాన్ని పంచడానికి వచ్చారు. తిండిపెట్టడానికి కాదు. మరి మీకు కళ్లూ, కాళ్లూ,చేతులూ ఎందుకు? వాటిని సరిగా చక్కగా
తెలివితేటలతో వాడుకుంటారనే కదా! దేవుడుఅవన్నీ అమర్చి మిమ్మల్ని భూమి మీదకు
పంపింది. అంటే తప్పు మీదే కదా!

మీరు మారేదాకా, ఏ భగవద్గీతవల్లా ఫలితంలేదు. ఏ మతమూ మిమ్మల్ని కాపాడలేదు.దేవుడికి దణ్ణం పెడుతూ ఆకాశంకేసిచూస్తూ
నడిస్తే, తెరిచి ఉన్న కాలువ గుంటలోనే వెళ్లిపడాల్సిన పరిస్థితి వస్తుంది.

దయచేసి మీ జీవితాన్ని మీ చేతిలోకి
తీసుకోండి. దేవుడి చేతికి ఇవ్వకండి.

🔴🟢🌕

No comments:

Post a Comment