#అయ్యప్పస్వామి కాల్పనిక దైవమా.?
లేక నిజంగానే హిందూధర్మంలోని దైవమా.??
హిందూ ధర్మంలో అయ్యప్పస్వామి ఉనికి గురించి చర్చించడానికి ఇది సరైన సమయమనిపించింది.!!
మన హిందూ వాజ్ఞ్మయం మొత్తం వేదాలు, వేదాంగాలు, పురాణాలు, ఆగమాల మీద ఆధారపడి ఉంది.! గ్రామదేవతలనుంచి నిరాకార నిర్గుణ పరబ్రహ్మ వరకు
ఏ దేవతలను ఏయే మంత్రాలతో ఏవిధంగా ఏసమయంలో ఎలాంటి ద్రవ్యాలతో పూజలు, హోమాలు చేయాలో వీటిలో వివరంగా ఉంటుంది.!!
దేవతలను మంత్రాలను వేదోక్తం, పురాణోక్తం అని రెండు రకాలుగా విభజన చేయాలి. అగ్ని, విశ్వకర్మ, త్వష్ట, వాచస్పతి, గణపతి, సుబ్రమణ్యం, సూర్యుడు, విష్ణువు, శివుడు, లక్ష్మీ, దుర్గ, రుద్ర, గౌరీ, సరస్వతి, బ్రహ్మ, ఇంద్రాది దిక్పాలకులు, నవగ్రహాలు, నక్షత్ర దేవతలు, పితృ దేవతలు, వాస్తు, భూమి, సర్ప, గరుడ, గోవు లాంటి ప్రధాన దేవతల గురించి వేదమంత్రాలు ఉంటాయి. శ్రీ విద్య లాంటి కొన్ని పురాణోక్త మహావిద్యల గురించి కూడా వేదోపనిషత్తులలో వివరణ ఉంది.!!
పురాణోక్త దేవతలను గురించి చెప్పబడిన మంత్రోపాసనలకు పురాణాలతోపాటు విడిగా తంత్రాలు, కల్పాలు ఉన్నాయి. ఇలాంటి మంత్రాలు సప్తకోటి అంటే ఏడుకోట్లు ఉన్నాయని దాదాపుగా ప్రతి పురాణంలో వేదవ్యాసులు చెప్పారు. ఈ ఏడుకోట్ల మంత్రాలు పరమశివుని పంచముఖాలనుంచి వ్యక్తం కాగా కొన్నింటికి దక్షణామూర్తి ఋషిగా, కొన్నింటికి హయగ్రీవస్వామి ఋషిగా, మిగిలిన వాటిని ఆనందభైరవుడు ఋషిగా ఉండి దర్శించారు.!!
దక్షిణామూర్తి, హయగ్రీవస్వామి బోధించిన మార్గం దక్షిణాచారం, సమయాచారం అని, ఆనందభైరవుడు బోధించిన మార్గం వామాచారం అని ప్రసిద్ధి పొందాయి.! వామాచారం బ్రాహ్మణులకు నిషేధం అని వాటిలో చెప్పారు. అలాగే వామాచారం పాటించేవారు తులసి, గంగలను వదిలేయాలని చెప్పారు. ఇక అందరికీ ఆమోదయోగ్యమైన దక్షిణాచారం లేదా సమయాచారాన్ని ఆరు ఆమ్నాయాలుగా విభజించారు. వీటిని షడామ్నాయ మంత్రాలు అంటారు. వేదంలో చెప్పిన మృత్యుంజయ, గాయత్రీ లాంటి సమస్త దేవతలకు తాంత్రిక బీజాక్షరమంత్రాలు వీటిలో చెప్పారు. వాసుదేవ ద్వాదశాక్షరి, శివపంచాక్షరి, నారాయణ అష్టాక్షరి, కాళీ, తార , శ్రీ విద్య లాంటి మహామంత్రాలు, దశమహావిద్యలు ఈషడామ్నాయాలలో భాగమే.!!
వేదంలో చెప్పబడని చండీ, కాళీ, తార లాంటి దేవతామంత్రాలు కూడా షడామ్నాయాలలో కనబడతాయి. వీటిలో భాగంగా శాస్తా మంత్రం కూడా కనబడుతోంది. ఈ మంత్ర అంగన్యాస కరన్యాసాలలో శాస్తా, హరిహరపుత్ర, మహాశాస్తా, ధర్మశాస్తా, మహాశాస్త్రీ అనే పేర్లతో అయ్యప్పస్వామి మంత్రోపాసన గురించి ఉంది. ఈ మంత్రానికి బ్రహ్మ ఋషి అని చెప్పారు.!!
దీనితో పాటు ప్రసిద్ధ లలితా సమస్రనామం చెప్పిన బ్రహ్మాండపురాణం, లలితోపాఖ్యానంలో హయగ్రీవస్వామి అగస్త్య మహర్షికి ప్రాయశ్చిత్తకర్మల గురించి చెబుతూ...
"లక్ష్మీః సరస్వతీ గౌరీ చండికా త్రిపురాంబికా, భైరవో భైరవీ కాళీ మహాశాస్త్రీచ మాతరః" అంటూ లక్ష్మీ, సరస్వతి, గౌరి, చండిక, త్రిపురాంబిక, భైరవ, భైరవి, కాళీలతో పాటు మహాశాస్త్రీ అంటూ అయ్యప్పస్వామిని కూడా పూజించాలంటారు. ఈ లలితోపాఖ్యానంలోనే మహామాయ గురించి చెబుతూ మన్మథుడిని సైతం భస్మం చేసిన పరమశివుడు మహామాయ ప్రభావం వల్ల జగన్మోహిని అవతారం చూసి మోహానికి గురైన కారణంగా హరిహరపుత్ర జననం జరిగిందని స్పష్టంగా ఉంది.!
హరి - హరులు అంటే ఇద్దరు కదా.! అంటే ద్వైతభావం.!
ద్వైతభావము పోనిదే అద్వైత భావన అలవడదు.!!
మాయను దాటనిదే పరమాత్మ దర్శనము కాదు.!!
నిత్యం వైరాగ్యంతో నిత్యం తపః సమాధిలో ఉండే శివుడు మన్మథున్ని భస్మం చేసాడు.! ఈశ్వరుడు కూడా ఒక్కొక్క సారి మాయలో పడతాడు.!!
భాగవత కథానుసారం:- క్షీర సాగర మధనంలో మొదట హాలాహలం పుట్టింది.! దేవతలు ప్రార్థించగా పరమశివుడు ఆ విషాన్ని మింగి తన కంఠంలో దాచుకున్నాడు.! తరువాత అమృతం లభించింది.! అమృతభాంఢాన్ని తీసుకుని దానవులు పారిపోయారు.! దేవతలు శ్రీహరిని ప్రార్థించారు.! అపుడు జగన్నాటక సూత్రధారి అయిన జగన్మోహనాకారుడు అయిన జగన్నాథుడు జగన్మోహిని గా మారాడు దానవుల చెంతకు చేరాడు.! ఆమె అందానికి దాసులైన దానవులు ఈమె నాకే దక్కాలి, నాకే దక్కాలి అని వారిలో వారే తగవులాడుతా కామ,క్రోధ,మోహంలతో అమృత భాంఢాన్ని మరిచారు.! జగన్మోహిని తన వంపుసొంపులతో వయ్యారాలు ఒలుక బోస్తూ అమృతాన్ని దేవతలకి పంచి మాయమయ్యింది.!!
తరువాత దేవదానవులకు యుద్ధం జరింగింది.! అధర్మాత్ములైన దానవులు ఓడిపోయి పారిపోయారు.! ధర్మాత్ములైన దేవతలు గెలిచారు.!!
విషపానము చేసి మంచుకొండల్లో సేదతీరిన పరమశివుడు
శ్రీ మహా విష్ణువు దుష్ట శిక్షణకై ఎన్నో అవతారాలు ఎత్తాడు
కానీ ఇపుడు జగన్మోహినీ అవతారం దాల్చాడట, ఆ రూపాన్ని చూడాలనుకుని పార్వతీ దేవితో చెప్పి శ్రీహరిని
మనసులో స్మరించుకున్నాడు.! అంతే సీన్ మారిపోయింది
" ముందు పూపొదలతో, సెలయేళ్లతో రమణీయమైన ఉద్యానవనం, అందచందాలతో వయ్యారాలు ఒలుక బోస్తూ రా రమ్మని శివుడికి కనుసైగ జేసింది అందాలరాశి అయిన జగన్మోహిని.! శివుడు తన్మయత్వంతో తనను తాను మరచి, పార్వతీదేవి చేయి విడచి ముందుకు సాగాడు.! మాయలో పడి మాయాస్వరూపిణి వెంటపడి
పరుగులెత్తాడు.! అలసిపోయాడు.! ఆమె కనికరించింది.!చివరికి జగన్మోహినిని ఆళింగనము చేసుకున్నాడు.! తను ఆళింగనము చేసుకున్నది జగన్మోహినినికాదు, జగన్నాథుడిని అని నిజం తెలుసుకున్నాడు శివుడు.!!
శివ, కేశవులు ఇద్దరు కాదు.! ఒక్కరే అనే అద్వైత ఆనందాన్ని పొందారు.! మాయను కల్పించిన
వాడు, మాయలో పడి మాయను దాటిన వాడు ఇద్దరు
ఏకమయ్యారు.! అద్వైతమూర్తిగా అయ్యప్ప ఆవిర్భవించాడు.!!అని ఈ కథనం తెలియ జేస్తుంది.!!
జగన్మోహిని మాయలో పడిన మహాదేవుడు కొన్ని క్షణాలు
నిగ్రహం కోల్పోయినా, వెంటనే తేరుకుని తాను చూసింది
జగన్మోహినిని కాదు జగన్మోహనుడే యని తెలుసుకుని మాయను దాటాడు.! శివుడికి, కేశవుడికి మధ్య భేదము లేదు.! అభేద దర్శనం అయింది.! అద్వైతం సిద్ధించింది.!!
అయ్యప్ప అంటే అద్వైతం.!! పరమాత్మస్వరూపం.!!
శబరిమల అయ్యప్ప దేవాలయంలో ప్రధాన ద్వారానికి పైన
#తత్త్వమసి అనే మహావాక్యం వ్రాసి ఉంటుంది.!!
"తత్+త్వం+అసి" అంటే ఏమిటి అర్థం.? ఆ పరమాత్మయే
నీవు.! అయ్యప్పస్వామివే నీవు.! పరమాత్మస్వరూపానివి.!
అందుకే అయ్యప్పస్వాములు దీక్షలో ఉన్నప్పుడు అందరినీ అయ్యప్పస్వాములుగా భావించి స్వామీ.! సంబోధిస్తారు.!!
సహ్యాద్రి నుంచి కన్యాకుమారి వరకు పశ్చిమ కనుమలలో అనేక ప్రాచీన దేవాలయాలను పరశురాముడు ప్రతిష్ట చేశారు. పోర్చుగీస్, టిప్పుసుల్తాన్, బ్రిటీష్ వాళ్ల దాడుల్లో వీటిలో ఎక్కువ శాతం ధ్వంసమై దోపిడీకి గురై దశాబ్దాల తరబడి ఆదరణ లేకుండా పోయాయి. స్వాతంత్ర్యం తరువాత ఈపరిస్థితి కొంత మారిన కారణంగా తిరిగి అయ్యప్పస్వామి దేవస్థానం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ స్వామి మీద ఒక సినిమాకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటలు తోడు కావడంతో దక్షిణాదిలో స్వామిమాల ధారులు విపరీతంగా పెరిగారు. షిర్డీసాయి సినిమా కూడా దాదాపు ఇదే సమయంలో రావడం వల్ల కొంతమంది సనాతన వాదులు సాయిబాబాలాగా అయ్యప్పస్వామి కూడా ఈమధ్య కాలంలో పుట్టించిన దేవుడని అపోహ పడుతున్నారు.!!
దీనికి సినిమా వాళ్ళు సృష్టించిన వావరు స్వామి, మకరజ్యోతి గురించి కల్పనలే కారణం. వావరు స్వామి సెక్యులర్ రైటర్స్ సృష్టించిన కథ. అరుణాచలంలో ఏటా కొండమీద వెలిగించే అఖండ దీపం లాంటిదే మకరజ్యోతి. దీన్ని అర్థం చేసుకుంటే అయ్యప్పస్వామి గురించి ఎలాంటి అనుమానాలు అపోహలు ఉండవు.!!
- స్వామియే శరణం అయ్యప్ప.!!
Tsunami Hindhu
No comments:
Post a Comment