Saturday, January 7, 2023

****మనో నిగ్రహంతో మహోపకారాలు

 🌻 మనో నిగ్రహంతో మహోపకారాలు 🌻

🍃🌺అన్ని జన్మలలోకి మానవజన్మ ఉత్తమోత్తమమైనది. అటువంటి జన్మను పొందగలిగిన మనం అదృష్టవంతులం. ఈజన్మను సార్థకంచేసుకోవాలి కదా! ప్రతివ్యక్తికి కొన్ని నియమ నిబంధనలు వుంటాయి. ఎటువంటి చికాకులు లేకుండా సక్రమమైన జీవితంగడపాలన్నా, ఆయురారోగ్యాలతో సుఖంగా జీవించాలన్నా కొన్నిధర్మాలను ఆచరించడం తప్పనిసరి. 

🍃🌺అలాగే దైవభక్తి అనేది కూడా మనిషికి అవసరం. ప్రతిరోజూ కొంత సమయం దేవుడిని పూజించడానికి కేటాయిస్తే మంచిది. మనస్సు ప్రశాంతత పొందు తుంది. దైవధ్యానం అనేది ఆరోగ్యరీత్యా కూడా ఉత్తమం. పూర్వకాలం మహర్షులు, మునులు విపరీతమైన ధ్యానం చేసేవారు. వారు ఏవిధమైన చింతలు లేకుండా కోరికలు అనేవి లేకుండా ప్రశాంతంగా జీవించేవారు.

🍃🌺మనిషికి మనోనిగ్రహం అవసరం. దాన్ని పొందాలంటే ప్రతీ రోజూ క్రమం తప్పకుండా ధ్యానం చేయడం అవసరం. కళ్ళు,చెవులు,ముక్కునోరు జ్ఞానేంద్రి యాలు. మానవునికి ప్రపంచం ఏమిటో తెలుసుకోవడానికి ఉపయోగపడే సాధనాలివి. అలాగే కాళ్ళు, చేతులు కర్మేంద్రియాలు. ఇవి మనం కోరుకున్న దాన్ని పొందడానికి పనిచేసే పరికరాలు. ప్రకృతిలో అందమైన దృశ్యాలను చూడడానికి కళ్ళు ఆరాటపడతాయి. 

🍃🌺శుభవార్తలను, మంచిమాటలను, ఇష్టం. అలాగే సువాసనలన్ను స్వచ్ఛమైన గాలిని పీల్చడానికి ముక్కు ఉపయోగపడు తుంది. నాలుకకు రుచులంటే అత్యంత ప్రీతి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మనకు ఎల్లప్పుడూ లోబడి వుండేటట్లుగా చూసుకోవాలి. ఇంద్రియ నిగ్రహం అవసరం. మనం ఇంద్రియాలకి లోబడి వుండకూడదు. ఇంద్రియాలు మన అధీనంలోనే వుండాలంటే మనసును ముందుగా మన అదుపులో వుంచు కోవాలి. మనస్సును నిలకడగా వుంచటం సాధ్యం కాదు. 

🍃🌺అది చూసిన ప్రతి దానినీ పొందాలని తాపత్రయ పడుతుంది. ఇంద్రియాలమీద వత్తిడి తెస్తుంది. దాంతో అనేకరకాల ఇబ్బందులు పడటం మామూలే! అలా కాకుండా మనోనిగ్రహం పొందాలంటే మనస్సును దైవధ్యానం మీద లగ్నం చేయాలి. అర్థంలేని ఆలోచనలు మనసును చుట్టుముడితే ఇష్ట దైవ నామాన్ని జపించాలి. అస్తమాటూ గుడికి వెళ్ళడానికి కుదరకపోయినా బాధపడాల్సిన పనిలేదు. మనసు భగవంతుడి మీద నిమగ్నం చేస్తే చాలు. 

🍃🌺మనస్సు నిర్మలంగా వుంటే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం వల్ల మనోనిగ్రహం వస్తుంది. అంతేకాకుండా బాహ్య ప్రపంచంలో తిరగడం వల్ల, మంచి పుస్తకాలు చదవడం వల్ల, మంచి మాటలు వినడం వల్ల, మంచి వ్యక్తులతో మాట్లాడటం వల్ల మనకు తెలియని అనేక విషయాలు తెలిసి జ్ఞానం వస్తుంది. తెలివైనవాళ్ళు దేనికీ భయపడరు. ఎలాంటి పనైనాసరే దిగ్విజయంగా చేయగలుగుతారు. అంతేకాక ఇతరులతో మాట్లాడేప్పుడు సంయమనం పాటించగలుగుతారు. 

🍃🌺నోరు మంచిదైతే ఊరు మంచిదనే సామెత కూడా వుంది. దీన్ని అర్ధం చేసుకొని ఆచరణలో పెట్టేవారు చాలా తక్కువగా ఉంటారు. ఇంటికి వచ్చిన అతిథులను, స్నేహితులను ఆదరించి వారితో ఏవిధమైన పరుష వాక్యాలు పలకకుండా మంచిగా మాట్లాడాలి. అంతేగాని చీటికిమాటికి అబద్ధాలు, లేనిపోని గొప్పలు మాట్లాడ కూడదు. మనం ఆత్మీయంగా మాట్లాడితే అందరూ మనమంటే ఇష్టపడతారు. గౌరవిస్తారు మనమాటకు విలువిస్తారు. 

🍃🌺అలాగే కోరికలు అనంతాలు. ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి. కొన్ని కోర్కెలు తీర్చుకోవచ్చు. మరికొన్ని తీర్చుకోవడానికి వీలుకాదు. ఆ కోర్కెలు ఎలా తీర్చుకోవాలా అని ఆలోచిస్తే పరిష్కారం లభించకపోగా కుటుంబంలో లేనిపోని గొడవలు రావచ్చు. భార్యాభర్తలు, పిల్లలతో ఆనందాన్ని పంచుకోలేం. స్నేహితులతో మాట్లాడలేం. ఏపనీ చేయబుద్ధికాదు. ఆకలి వేయదు. నిద్రపట్టదు. ఇన్ని బాధలు పడుతూ కోర్కెలను పెంచుకోవడం అనేది అవివేకం. 

🍃🌺అధికమైన, తీరని కోర్కెలు కలగకుండా మనసును అదుపులో వుంచుకోవాలి. అందుకు దైవధ్యానమే సరైన మార్గం. జపం ఎంత ఎక్కువగా చేస్తే మనసులోని కోర్కెలు అంత త్వరగా తొలగిపోతాయి. మనసు ప్రశాంతంగా, బుద్ధి నిలకడగా వుంటుంది. బ్లడ్ ప్రెషర్, మధుమేహం, గుండెజబ్బులు, తలనొప్పులు మొదలైన రోగాలు కూడా దరిచేరవు.

🍃🌺నేటి యాంత్రిక జీవితాలలో రాత్రి చాలా పొద్దుపోయేవరకు మెలకువగా వుండటం, తెల్లవారాక ఎంత ఆలస్యంగా నిద్రలేస్తే అంత శ్రమపడ్డాం, అంత గొప్పవారం అనుకునేవారు చాలామంది వున్నారు. ఆలస్యంగా నిద్రలేస్తే ఎంత నష్టమో గమనించాలి. పిల్లలైనా, పెద్దవారైనా ఎవరైనా సరే తెల్లవారు జామునే నిద్రలేవడం ఆరోగ్యదాయకం. తెల్లవారు జామునే నిద్రలేచి బయట తిరుగుతూ పనులు చేసుకోవడం వల్ల నక్షత్రాల కాంతి శరీరానికి మెరుపునిస్తుంది. 

🍃🌺వీచే చల్లని గాలి శ్వాసకోశాలని శుభ్రపర్చడమేకాక రోజంతా ఆహ్లాదాన్నిచ్చే మానసిక ఆనందాన్ని కలగచేస్తుంది. ఉదయించే సూర్యకిరణాలు శరీరంపై పడటంతో ఎటువంటి చర్మవ్యాధులు రావు. తెల్లవారుజామునే లేవలేం, పనిచేయలేం అంటుంటారు చాలామంది. కానీ మనిషికి సాధ్యం కానిది ఏదీ లేదు కదా! మనసుంటే మార్గం ప్రతీదానికీ వుంటుంది. వారం రోజులు క్రమం తప్పకుండా తెల్లవారుజామునే నిద్రలేస్తే అదే అలవాటవుతుంది. 

🍃🌺చీకటితోనే లేస్తే దైవధ్యానం చేసుకోవచ్చు. పనులు చేసుకొని, పిల్లలను చదివించవచ్చు, హడావుడి లేకుండా స్కూళ్ళకు పంపించి ఆరాముగా ఆఫీసులకు వెళ్ళవచ్చు.

No comments:

Post a Comment