Thursday, May 9, 2024

అర్థానికి అర్థం

 *అర్థానికి అర్థం*
              ➖➖➖

ఎవరి జీవితంలోనైనా డబ్బు సంపాదన అనేది అతి ముఖ్యమైనది. డబ్బు వ్యవహారాల చర్చలు కుటుంబాలలోను, బయట ప్రపంచంలోనూ సర్వసాధారణం. కొందరికి తిండికి సరిపోయే డబ్బు సంపాదించడమే ఒక సవాలైతే, డబ్బును ఎన్నో రెట్లు పెంచుతూ కోట్లకు కోట్లు కూడబెట్టడమే మరికొందరు చేసే ముఖ్యమైన పని. 

సంపన్నుల ప్రవర్తన కారణంగానో, వారికి ఎదురైన పరిస్థితులవల్లో ఏ కొందరికో డబ్బంటే ద్వేషభావం ఏర్పడుతుంది.

డబ్బు అనేక విధాలుగా ఉపయోగపడుతుందనేది కాదనలేని సత్యం. మనిషికి స్వేచ్ఛను కలిగిస్తుంది. గౌరవాన్ని, భద్రతను ఇస్తుంది. సంపన్నులు అవసరకాలంలో తమ డబ్బుతో లేనివారిని ఆదుకుంటే పుణ్యమంటారు. అది సత్కర్మ అవుతుంది. తగినంత ద్రవ్య పొదుపుగలవారు ధ్యానం, ఆధ్యాత్మిక తపనలాంటి ఉన్నత లక్ష్యాల సాధన కోసం కాలాన్ని వినియోగించగలుగుతారు. పనిచేయాల్సిన అవసరం పెద్దగా ఉండదు కనుక. ఇన్ని అనుకూల అంశాలే ఉన్నందువల్ల డబ్బును, సంపదను ద్వేషించాల్సిన పనిలేదు.

హిందూగ్రంథాల ప్రకారం, మానవ ప్రయత్నాలకు సంబంధించిన నాలుగు ప్రయత్నాలను పురుషార్థాలంటారు- ధర్మార్థ కామమోక్షాలు. 

మనిషి ప్రవర్తన ధర్మబద్ధంగా ఉండాలి. ధర్మబద్ధమైన సంపదతో కోరిక తీర్చుకుని సంతృప్తిచెందడం సమర్థించదగిన లక్ష్యం.

*డబ్బు ఆహారాన్ని కొనివ్వగలదు కానీ ఆకలిని కాదు. 
సౌకర్యవంతమైన మంచం, *పట్టుపరుపులు ఏర్పాటు చేసుకోవచ్చు కాని- నిద్రను కాదు. 
*క్లుప్తంగా చెప్పాలంటే- డబ్బు సంతోషానికి హామీ ఇవ్వలేదు. *ఆనందం పొందాలంటే డబ్బును మించినవి ఎన్నో ఉన్నాయి. సానుకూల వైఖరి, ప్రేమ, మంచి స్నేహితులు, చక్కని సమయపాలన, ప్రశాంతమైన మనసు... ఇవన్నీ సత్కర్మల ద్వారానే సాధ్యం. 

చాలామంది తమ యౌవనమంతా ధనార్జనతోను, దాన్ని నిర్వహించుకోవడంలోను మునిగిపోయి ఉంటారు. ఒకస్థాయి దాటాక డబ్బు ప్రయోజనం నామమాత్రమైపోతుంది.

వేదకాలంలో ఋషులు సమగ్ర సంపదకోసం మహాలక్ష్మిని శ్రీగా ఆరాధించేవారు. జీవితాంతం సంపదకోసం, సంతానం కోసం, అందం కోసం ప్రార్ధించేవారు ఎంతోమంది. 

శ్రీ- నశించని శబ్దం. 
భగవద్గీతలో కృష్ణుణ్ని శ్రీ భగవాన్ గా పిలుస్తారు. లక్ష్మీదేవి ధరించే బంగారు, వెండి ఆభరణాలు తేజస్సు, తపస్సుల స్వచ్ఛతకు ప్రతీకలు. 

భక్తులు సంపదను నైపుణ్యంతో ఆర్జించి కుటుంబం, సమాజంతో పంచుకోవాలి.```

*సమాజంలో సంపద సృష్టిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఉపాధికి, పురోగతికి తోడ్పడుతుంది. సంపద సృష్టికర్తలు ధర్మకర్తల విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది. దోపిడి, అన్యాయాలతో సంపద సృష్టించడం అనర్ధానికి దారితీస్తుంది. సంపద దైవశక్తి. దాన్ని నైపుణ్యం, శ్రద్ధతో సంపాదించడం అందరికీ శ్రేయస్సు కలిగిస్తుంది.* 

*ఆర్జన జీవితంలో అందాన్ని పవిత్రతను నిలబెట్టే విధంగా ఉండాలి.*

మంత్రవాది మహేశ్వర్.

No comments:

Post a Comment