కల్లాకపటం తెలియని చిన్ననాటి స్నేహానికి స్వచ్చత, నగ్నత్వం ఎక్కువ....ఆ తర్వాత ఏర్పడే స్నేహాలకు రంగుటద్దాలు, మేలి ముసుగులు ఎక్కువ....బాల్య స్నేహానికి తీపి పునాదులుంటాయి. ఆ స్నేహంలో, ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆప్యాయత అనురాగాలు గాఢంగా ఉంటాయి. గిల్లికజ్జాలు పెట్టుకున్నా మనసులో పెట్టుకోకుండా మళ్లీ మమేకమై పోతూ ఉంటారు... బాల్యం తరువాత కూడా మిత్రులు ఏర్పడతారు. అయితే కొందరు మాత్రమే ప్రాణమిత్రులై నిలుస్తారు.... వయసు పెరిగే కొద్దీ ఒకరినొకరు అర్థం చేసుకునే మానసిక పరిపక్వత ఏర్పడుతుంది. అందువల్ల ఎదిగే వయసులో పరస్పరం అర్థం చేసుకున్న వ్యక్తుల మధ్య ఏర్పడే స్నేహం కడదాకా నిలుస్తుంది. అలాకాకుండా కేవలం "అర్దం" (డబ్బు) మీద ఆధారపడి ముడిపడి ఉండే స్నేహానికి ఆయుష్షు తక్కువ........ దురదృష్టం ఏమిటంటే - మన చుట్టూ ఉన్న ప్రపంచం లో, అర్థం చేసుకునే అర్థవంతమైన స్నేహాల కంటే అవసరాలు తీర్చుకోవడానికి ఏర్పడే స్నేహాలే ఎక్కువ. ..ఆత్మీయతల పునాదుల మీద కాక, అవసరాలు కొలబద్దగా స్నేహాలు పెంచుకుంటున్నారు.... పరిచయస్థులు వేరు, స్నేహితులు వేరు, ప్రాణ స్నేహితులు వేరు. మనం సాధారణంగా మనం చుట్టూ వున్న పరిచయస్థులనే ప్రాణ స్నేహితులుగా కలుపుకుని సాగిపోతున్నాం. ఇలాంటి అర్థాంతర బంధాలు చిన్న మనస్పర్థ వల్ల కానీ లేదా అవసరం తీరగానే, అంతే వేగంగా విడిపోవడం జరుగుతోంది....ఈ విధంగా స్నేహానికి అర్థాలు మారిపోవడం శోచనీయం.... ప్రతి మనిషి కి స్నేహం అవసరమే కానీ అవసరం కోసమే స్నేహం అనే అక్కరకు రాని స్నేహాన్ని వదిలించుకుని, అవసరానికి ఆదుకునే అర్థవంతమైన స్నేహాన్ని పెంపొందించు కోవడం ఉత్తమోత్తమం...... పోలిన రామకృష్ణ భగవాన్... రాజమండ్రి.
No comments:
Post a Comment