చదవాలి…!
*పరబ్రహ్మ స్వరూపం*
➖➖➖✍️
*లోకంలో సాధారణంగా తప్పు చేయనివాడు ఉండడు. తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించక తప్పదు.*
*మనకు శత్రుత్వమనేది అనేక కారణాల వల్ల ఏర్పడుతుంది. ఒకరిని మనం స్నేహితుడిగాను, మరొకరిని శత్రువుగాను చూస్తున్నామంటే, చూసేవారి దృష్టిలో భేదం ఉందని చెప్పక తప్పదు. ఆ భేదానికి కారణం ఎదుటి వ్యక్తి చేసే పనులే కానీ, ఆ వ్యక్తి కాదు.*
*కానీ, అందరూ సమానులే అయితే శత్రుత్వం ఉండకూడదు. లోకంలో మనకు కీడు చేసినవాడు శత్రువు అవుతాడు. మేలు చేసినవాడు మిత్రుడవుతాడు. కానీ, ఇద్దరినీ మిత్రులుగా చూసే అలవాటు సాధారణంగా అందరికీ ఉండదు. అది యోగుల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది.*
*మన శరీరంలో జీవుడనే వాడు ఒకడున్నాడు అనడానికి ఏమిటి కారణం? దీన్ని తెలుసుకుంటే ఎవరు శత్రువులో, ఎవరు మిత్రులో అవగతమవుతుంది.*
*పరమాత్మ జీవుడికి కనీస జ్ఞానాన్ని (కామన్‌సెన్స్) ఇచ్చాడు. ఎప్పుడైతే ఈ కనీస జ్ఞానం వికటిస్తుందో అప్పుడే మార్పు ఏర్పడుతుంది. సర్వజ్ఞుడైన పరబ్రహ్మలో మనం ఉన్నాం. ఇది కనీస జ్ఞానమే! అంతా పరమేశ్వరుడే అని చెప్పుకొంటాం. కానీ, మనం పరమేశ్వరుడితో ఉన్నామన్న విషయం మరచిపోతుంటాం. అయితే, మనం పరబ్రహ్మ స్వరూపులమని, పరబ్రహ్మను మాయ ఆవహించడం వల్ల జీవులమయ్యామని, మాయ తొలగిపోతే మళ్లీ పరబ్రహ్మలో కలిసిపోతామని, మనకూ, పరబ్రహ్మకూ తేడా లేదని భావించేవారు కూడా ఉన్నారు. కానీ, వేదజ్ఞానం కలిగినవారు పరబ్రహ్మకూ, జీవుడికి భేదం లేదని చెప్పరు. పరబ్రహ్మ స్వరూపం తెలిస్తే ఎవరూ ‘మేం పరబ్రహ్మలం’ అని అనరు. పరబ్రహ్మ సచ్చిదానంద స్వరూపుడు. సత్ అంటే ఎప్పుడూ ఉండేవాడు. చిత్ అంటే పూర్ణజ్ఞానం కలిగినవాడు. ఆనంద స్వరూపుడు అంటే, ఏ మాత్రం దుఃఖం లేనివాడని అర్థం. అంతేకాదు పరబ్రహ్మ నిత్య శుద్ధబుద్ధముక్త స్వభావుడు. అంటే ఎల్లవేళలా అవిద్య అంటక పవిత్రంగా ఉండేవాడు.*
*మరి జీవుని విషయానికి వస్తే పరబ్రహ్మలా ఎల్లవేళలా ఉనికి కలవాడైనప్పటికీ పరబ్రహ్మ అంతటి జ్ఞానం అతనికి లేదు. పరబ్రహ్మ సర్వజ్ఞుడు, సర్వ శక్తిమంతుడు. సర్వవ్యాపకుడు. జీవుడు అల్పజ్ఞుడు, అల్పశక్తిమంతుడు, ఎక్కడో ఒకచోట ఉంటాడు గానీ, పరబ్రహ్మలా బ్రహ్మాండమంతటా ఉండడు. జీవుడు అవిద్యచే శరీరధారి అవుతున్నాడు. అంటే జన్మలెత్తుతున్నాడు. బంధాల్లో చిక్కుకుంటున్నాడు. ముక్తికోసం పరితపిస్తున్నాడు.*
*జీవించి ఉండగానే ముక్తికి అర్హత గలవారు జీవన్ముక్తులు. మరణించిన తర్వాత ముక్తిని పొందినవారు ముక్తజీవులు. ముక్త జీవులుండే చోటునే ‘తృతీయ ధామం’ అంటారు. పాపం చేసినవారు భూలోకంలో పుడుతూ, చస్తూ ఉంటారు. పుణ్యం చేసినవారు పితృలోకాన్ని చేరి మళ్లీ మనుషులుగా జన్మిస్తారు. కానీ, భవబంధాల నుంచి బయటపడినవారు దేవలోకాన్ని చేరుకుంటారు. ఈ దేవలోకమే ‘తృతీయ ధామం’. అదే ‘బ్రహ్మలోకం’- పరబ్రహ్మ సన్నిధానం. పరబ్రహ్మ సాలోక్యాన్ని, సాయుజ్యాన్ని, సామీప్యాన్ని, సారూప్యాన్ని పొందేవాడు జీవుడే. పరబ్రహ్మలో ఉండి ఆనందాన్ని అనుభవిస్తే అదే ‘సాలోక్యం’. పరబ్రహ్మతో కలిసి ఉండటం ‘సాయుజ్యం’. యోగంతో పరబ్రహ్మను సమీపించడం ‘సామీప్యం’. పరబ్రహ్మ సామ్యాన్ని పొందడమే ‘సారూప్యం’.*
*ఇష్టపడటం, ద్వేషించడం, ఏదైనా సాధించడానికి ప్రయత్నించడం, సుఖదుఃఖాలను అనుభవించడం, జ్ఞానం కలిగి ఉండటం శరీరధారి అయిన జీవుడి లక్షణాలు. కష్టాలను కలిగించే అవిద్య, అస్మిత, రాగం, ద్వేషం, అభినివేశం పరబ్రహ్మలో లేవు. పరబ్రహ్మ ధర్మాధర్మ ప్రవృత్తులకు దూరంగా ఉంటాడు. వాటి ఫలాలు అతనికి అంటవు. అతను విశేష పురుషుడు (సామాన్యుడైన జీవుడి వంటి వాడు కాడు). శరీరధారులం కావడం వల్లనే మనం ఇచ్ఛాద్వేషాలకు లోనవుతున్నాం. అజ్ఞానంలో పడిపోతున్నాం. సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాం. మన ఇచ్ఛాద్వేషాల వల్ల ఒకరు మిత్రులు, ఒకరు శత్రువులవుతున్నారు. పరబ్రహ్మ స్వరూపం తెలిస్తే మనకు శత్రువులు అంటూ ఎవరూ ఉండరు. అందరూ మిత్రులే!*✍️
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
No comments:
Post a Comment