'ఆరుద్ర' ఆరోగ్యాన్ని హరించిన 'సమగ్ర ఆంధ్ర సాహిత్యం'
సమగ్ర ఆంధ్ర సాహిత్యం కోసం
ఆరుద్ర తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా శ్రమించారు.
మనకు తెలియని మన తెలుగు సాహిత్య చరిత్రను ఇదిగో ఇట్లా మన చేతుల్లో అపురూపంగా పెట్టి తన దారిన తాను వెళ్లి పోయిన దార్శనికుడు ఆరుద్ర.
తాను విపరీతంగా సేకరించిన కట్టల కట్టల, గుట్టల గుట్టల పాత పుస్తకాలు, సంచికలు, రాసుకున్న నోటు పుస్తకాలు, తదితర సరంజామా... అంతా కలిసి 'డస్ట్ ఎలర్జీ 'గా మారి ఆరుద్ర ప్రాణానికి ప్రమాదం గా మారాయి. కంటి చూపు కూడా దాదాపు సన్నగిల్లింది .ఇదే విషయాన్ని వారు సమగ్ర ఆంధ్ర సాహిత్యం మొదటి సంపుటికి రాసిన ముందు మాట లో స్పష్టంగా రాశారు.
'1965 జనవరి నెల నుండి సమగ్ర ఆంధ్ర సాహిత్యం సంపుటాల రచనకు ఉపక్రమించాను. సమగ్రత దెబ్బ తినకూడదని సంపుటాల సంఖ్యను పెంచి అదనపు యుగాలను, ఉపయుగాలను, చేర్చవలసి వచ్చింది. 1965 ఏప్రిల్ నెల నుండి నవంబర్ నెల దాకా ఎనిమిది నెలలు క్రమం తప్పకుండా ఆసాంతం రచన చేసి సమగ్ర ఆంధ్ర సాహిత్యం సంపుటాలను అచ్చు ఇవ్వడంతో నా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది. టెన్షన్ వల్ల రావలసిన రుగ్మతలు వచ్చాయి. గత సంవత్సరం నా రెండు కళ్ళ ఆపరేషన్ జరగడం వల్ల గ్రంథరచన కార్యక్రమానికి వీలు కలిగింది'
నిజానికి,సమగ్ర ఆంధ్ర సాహిత్యం అనేది ఏదైనా ఒక పెద్ద యూనివర్సిటీ పూనుకొని చిత్తశుద్ధితో చేయవలసిన పని. కానీ దాన్ని ఒక వ్యక్తి శక్తిగా మారి తయారుచేయడం అంటే మాటలు కాదు.సమగ్ర సాహిత్య చరిత్రను ఒక చోటికి చేర్చడానికి పగలూ రాత్రీ కష్టపడ్డారు.ఒక సాహితీ యజ్ఞమ్ చేసారు.ఈ రోజుకు కూడా మనకు ఎవరో ఒక తెలుగు సాహిత్య కారుడి గురించి తెలుసుకోవాలంటే కూడా మనం ముందు చేతికి 'సమగ్ర ఆంధ్ర సాహిత్య చరిత్ర' అందుకోక తప్పదు.నిజమైన పరిశోధన అంటే అదే.దటీజ్ ఆరుద్ర !
తెలుగు ఒక సబ్జెక్టుగా స్వీకరించి పోటీ పరీక్షలు రాసి ఉద్యోగాలు పొందిన వారు కావచ్చు, ఇప్పుడు ఇంకా ప్రిపేర్ అవుతున్న వారు కావచ్చు, తెలుగు అధ్యాపక, ఉపాధ్యాయ ఉద్యోగాల్లో ఉన్నవారు కావచ్చు... అందరి మొదటి చూపు 'సమగ్ర ఆంధ్ర సాహిత్యం' పైనే ఉంటుంది. అది ఒక అక్షయ పాత్ర.
సమగ్ర ఆంధ్ర సాహిత్యం- సంపుటాలు;
పూర్వ యుగము, చాళుక్య చోళ కాలము - (800-1200)
కాకతీయుల కాలము (1200-1290)
పద్మనాయకుల కాలము (1337-1399)
రెడ్డిరాజుల కాలము (1400 - 1450)
రాయల ప్రాంభ కాలము (1450 - 1500)
రాయల అనంతర కాలము (1500 - 1550)
నవాబుల కాలము (1550 - 1600)
నాయకుల కాలము (1600 - 1670)
అనంతర నాయకుల కాలము (1670 - 1750)
కంపెనీ కాలము (1750-1850)
జమీందారుల కాలము (1850 - 1900)
ఆధునిక కాలము (1900 తరువాత)
#మనమప్పుడు ఏమి చెయ్యాలి ? మన తెలుగు సాహిత్య చరిత్రను భావితరాల వారికి, మన పిల్లలకు చెప్పడానికి , గుర్తు చెయ్యడానికి తప్పనిసరిగా 'సమగ్ర ఆంధ్ర సాహిత్య చరిత్ర'
ను మీ ఇంట్లో ఉండేలా చూసుకోండి. అది తెలుగు వారి సాహిత్య సంపద. తెలుగు సాహిత్య బంగారు కలశం. మన తెలుగు అక్షర సారధుల సామ్రాజ్యం.
ఈ తెలుగు నేల పైన తెలుగు అక్షరం ప్రసాదించిన వెలుగు.
'సమగ్ర ఆంధ్ర సాహిత్య చరిత్ర'.
ఒక సాహిత్య కారుడు తన ఆరోగ్యాన్ని అర్పించి ఒక తపస్సులా తెలుగు సాహిత్య సేకరణ ఎలా చేసాడో ఆ సంపుటాలను చూస్తే మీకు మన 'తెలుగు సాహిత్య వైభవం' కళ్ళముందు కదలాడుతుంది.
ఈ సంపుటాలు ఉన్నంతకాలం తెలుగువారి సాహిత్య విజయ బావుటా లోకానికి చాటి చెప్తూనే ఉంటుంది. మనం నడిచివచ్చిన కాలాన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది. మన తెలుగు మూలాలు, వేర్లు ఎంత శక్తివంతమైన, బలమైన , దృఢమైన నేపథ్యాన్ని పటిష్టంగా కలిగిఉన్నాయో, అట్లా దేదీప్యమానంగా గుర్తు చేస్తూనే ఉంటుంది.
ఏమి ఆశించి చేస్తారు మహానుభావులు ఇంతటి గొప్ప పనులు? అందుకే వారు చరిత్ర పేజీల్లో నిలిచిపోయిన సాహిత్య నిర్మాతలు!
తెలుగు వారి సాహిత్య చరిత్రను సమగ్రంగా సేకరించి, సంస్కరించి, పరిష్కరించి భద్రపరిచి ఇలా మనకు కానుకగా అందించిన మహనీయుడు, నిజమైన సాహిత్యకారుడు ఆరుద్ర. వారికి అక్షర నివాళి.
No comments:
Post a Comment