Tuesday, May 21, 2024

"కౌపీన సంరక్షణార్థమ్ అయం పటాటోపః"

 "కౌపీన సంరక్షణార్థమ్ అయం పటాటోపః"


ఒక సాధువు సంసారం మీద విరక్తితో ఊరి బయట ఒక పాక వేసుకొని ధ్యానం చేసుకుంటూ ఊరి ప్రజలు తనకు సమర్పించే పళ్ళు, తిని పాలు మాత్రం తాగి జీవిస్తూ వుండేవాడు. అతనికి రెండు కౌపీనాలు (గోచీ) మాత్రమె ఉండేవి. స్నానం చేసి ఒకటి ఆరేసుకునేవాడు, ఒకటి కట్టుకునేవాడు. 

కొన్నాళ్ళకు ఒక ఎలుక ఆ కౌపీనాన్ని రోజూ కోరికివెయసాగింది. ఎన్ని కౌపీనాలు మార్చినా అలాగే కోరికేస్తూండేది. గ్రామస్తుడొకడు ఆ సాధువుకు ఒక పిల్లిని ఇచ్చి దీని వలన మీకు ఎలుక బాధ ఉండదు స్వామీ అని చెప్పాడు. మరి ఆ పిల్లికి పాలు పొయ్యాలి కదా!గ్రామస్తులంతా కలిసి అతనికి ఒక ఆవును కొని దానంగా ఇచ్చారు. ఆ ఆవుకి పాలు పితికేందుకు, దాన్ని అడవికి తీసుకొనిపోయి మేపుకొని వచ్చేందుకు మనిషి కావాలి కదా!ఎవరినైనా పెట్టుకుంటే వాడికి జీతమివ్వాలి. అందుకని గ్రామస్తులు సాధువును పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారు. ఒక అమ్మాయి ని చూపిస్తే సాధువు పెళ్లి కూడా చేసుకున్నాడు. 

భార్య గోచీ బాగా లేదు పంచె కట్టుకోండి అని అన్నది. సరే పంచెలు కొన్నాడు. బిడ్డలు పుట్టారు వాళ్ళను పోషించేందుకు డబ్బు కావలిసి వచ్చింది. గ్రామస్తులతో మాట్లాడి ఒకరి పొలాన్ని కౌలుకు తీసుకొని సేద్యం  చేయసాగాడు. తర్వాత పెద్ద ఇల్లు కట్టుకున్నా డు. సొంతంగా పొలం కొనుక్కున్నాడు. ఎద్దులు కొన్నాడు. 

సంసారం పెరిగిపోయింది. ధ్యానం, తపస్సు వెనకబడిపోయాయి. డబ్బు యావ పెరిగి పోయింది. ధ్యానం బదులు ధనం, ధాన్యమే ముఖ్యమైంది. శాంతి కరువైంది. ఇది ఇలా ఉండగా ఒకసారి అతని గురువు అతన్ని చూడటానికి వచ్చాడు. ఆయన ఇదంతా చూసి ఆశ్చర్యపోయి ఇదేమిటిరా నేను చెప్పిందేమిటి? నీవు చేసిందేమిటి? అని అడిగాడు. 

అప్పుడు ఆ సాధువు గురుదేవా! "కౌపీన సంరక్షణార్థమ్ అయం పటాటోపః" అన్నాడు. గురుదేవా! నా గోచిని కాపాడుకోవడానికి ఇంత పటాటోపం పెట్టుకోవాల్సి వచ్చింది అని చెప్పి, నాకు బుద్ధి వచ్చింది అని లెంపలు వేసుకొని, ఆ సంపదనంతా భార్యను చూసుకోమని చెప్పి అడవికి వెళ్లిపోయి హాయిగా కంద మూలాదులు తింటూ తపస్సు చేసుకుంటూ శాంతిగా గడిపాడట.

అప్పటి నుండి లోకంలో "కౌపీన సంరక్షణార్థమ్ అయం పటాటోపః" అనే సామెత వచ్చింది. ఈ కాలంలో ఒకదాని కోసం ఒకటి ఏర్పరుచుకొనే వాళ్ళను చూసి ఈ సామెత చెప్తూ వుంటారు పెద్దవాళ్ళు.
👌


*సమాప్తం* 

No comments:

Post a Comment