*****
*మతిమెరుపు*
============
(హాస్య కధ)
రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్
ఉదయాన్నే మౌర్నింగ్ వాక్ కి వెళ్లి, ఇంటికి తిరిగి వచ్చిన మకతికరావుకి, తాళం వేసి ఉన్న ఇల్లు దర్శనమిచ్చింది.
ఈ సమయంలో, తన భార్య తిమ్మక్క ఎక్కడికి వెళ్లి ఉంటుంది చెప్మా? అనుకుని ఫోన్ చేయడానికి జేబులో చెయ్యి పెట్టిన మకతికరావుకి జేబు ఖాళీగా ఉన్నట్టు తోచింది. వెంటనే ఓ సారి చెవిని ఘాట్టిగా కీ ఇచ్చినట్లు, మెలిపెట్టుకోగానే అతని మతి మరుపు బుర్రకు రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన మెరుపులా జ్ఞాపకం వచ్చింది.
***** ***** ***** *****
నిజానికి మకతికరావు అసలు పేరు మంచికంటి త్రివిక్రమ రావు. ఇతని మతిమరుపు చేష్టలను, తికమక పనులను చూసిన ఇతని మిత్ర బృందం అతని పూర్తి పేరును సింపుల్ గా మకతికరావు అని మార్చేసారు. అదిగో, అప్పటినుండి ఆ పేరుతో చలామణి అయిపోతున్నాడు.
రెండు రోజుల క్రితం..
కూరగాయలు తేవడానికి మార్కెట్ కు వెళ్ళేడు మకతికరావు.
ఈ లోగా, ఇతని పక్కన నిలబడి...
"అంకుల్, నేను ఎవరో గుర్తున్నానా ?"" అని అడిగాడు ఓ కుర్రాడు.
అప్పటికే రెండు సార్లు చెవికి కీ ఇచ్చుకున్నా , ఆ కుర్రాడు ఎవరో గుర్తు రాకపోవడంతో..
"లేదమ్మా, గుర్తు రావడం లేదు."" అన్నాడు.
"నాకు కావలసింది కూడా అదే అంకుల్. అయ్యో, నేను మీ ఫ్రెండ్ అప్పారావు గారి అబ్బాయినండీ. సరే, మా నాన్న గారి ఫోన్ నెంబర్ ఇస్తాను. సేవ్ చేసుకోండి"
"ఔనా? సరే కానీనాకు ఎలా సేవ్ చెయ్యలో తెలియ దయ్యా, ఇదిగో నువ్వే సేవ్ చెయ్యి నా ఫోన్ లో" అంటూ ఫోన్ అందించేడు మకతికరావు.
"అంకుల్, నాన్న నెంబర్ సేవ్ చేసా. తీసుకోండి" అంటూ ఫోన్ తిరిగి ఇచ్చేడు.
"భలేవాడివయ్యా ! మరి నా నెంబర్ నీ ఫోన్లో సేవ్ చేసుకోవా ?" అంటూ తన ఫోన్ మళ్ళీ ఇచ్చాడు మకతికరావు, తన తెలివికి మురిసిపోతూ.
"మరచిపోయాను అంకుల్. సారీ" అంటూ మకతికరావు ఫోన్ ని మళ్లీ తీసుకున్నాడు.
"ఏం బాబూ, నా నెంబర్ సేవ్ చేసు కున్నావా ?" అడిగాడు
"సేవ్ చేసుకున్నా అంకుల్, మీ నెంబరూ, ఫోనూ కూడా !" అంటూ ఆ ఫోన్ తీసుకుని, అక్కడి నుండి ఉడాయించాడు ఆ కుర్రాడు, ఏం జరిగింది అన్న తికమకలో మకతికరావు ఇంకా కొట్టు మిట్లాడుతుండగా !!
***** ***** ***** *****
ఫోన్ పోయిందన్న సంగతి జ్ఞాపకం రాగానే, ఇంక తన భార్య జాడ తెలియాలంటే పోలీసు రిపోర్టు ఇవ్వడమే మంచిది అని నిర్ణయించుకుని, స్టేషన్ వైపు నడవసాగేడు మకతికరావు.
స్టేషన్లో ప్రవేశించగానే, ఎదురుపడ్డ ఓ ప్లీడరు గారితో,
"సార్, మా ఆవిడ కనబడటం లేదు" అన్నాడు కంట నీళ్ళు పెట్టుకుంటూ.
"అయ్యో, అలాగా ! పోనీ ఎవరైనా కళ్ల డాక్టరు కి చూపించుకోలేక పోయారా ?"
"కనబడటం లేదు అంటున్నది కంటి పవర్ గురించి కాదు సార్, ఇంటి పవర్ గురించి."
"ఔనా ? సరే ఏ ఊర్లో మిస్ అయ్యింది ? ఎప్పుడు అయ్యింది ?"
"ఇక్కడే... ఈ ఉదయం" చెవి కీ ఇచ్చు కుంటూ చెప్పేడు మకతికరావు.
"సరే, లోపలికి వెళ్లి, కంప్లైంట్ ఇచ్చి రండి." అని చెప్పి పంపించాడు.
కొంచెం లోపలికి వెళ్ళగానే..
"దయచేసి వినండి. తిరుపతి వెళ్ళవలసిన గోవిందా ఎక్స్ ప్రెస్ మరికొద్ది *రోజుల్లో*,..
*ఏదో* ప్లాట్ ఫారం మీదకి వచ్చే అవకాశం కలదు"
ఆ ప్రకటన విన్న మకతికరావు, వెంటనే ఎంక్వయిరీ వద్దకు వచ్చి,
"ఏంటండీ, మరీ ధారుణం. ఆ అనౌన్సర్ ఎవరో నాకంటే మతిమరుపు వారిలా ఉన్నారు. లేకపోతే, మరి కొద్ది రోజుల్లో అంటారేమిటి ? ఎన్ని రోజుల్లో వస్తుందో స్పష్టంగా చెప్పకుండా ?" అడిగాడు.
"సారీ సార్.. మా వాడు లెక్కల్లో కొద్దిగా వీక్. గంటల్లో అనబోయి రోజుల్లో అన్నాడు." చెప్పాడు ఎంక్వయిరీ క్లర్క్.
"కొద్దిగా ఏంటండీ బాబూ ! చాలా వీక్. అంతే కాదు, పాపం కొంచెం నత్తి కూడా ఉందేమో ? ఏడో అనబోయి ఏదో అంటున్నాడు"
"అది మటుకు కరెక్టే నండోయ్. ఏ ప్లాట్ ఫారం మీదకు వస్తుందో తెలియదు కాబట్టి అలా అన్నాడు. సరే ఇంతకీ మీకు ఏ సమాచారం కావాలి ?"
"ఆ !! జ్ఞాపకం వచ్చింది. మా ఆవిడ కనబడటం లేదు" అన్నాడు చెవికి కీ ఇచ్చుకుంటూ.
"ఔనా ? మీరు అదృష్టవంతులు. ఇంతకీ ఎప్పటినుంచి కనబడటం లేదు ?" అడిగాడు ఎంక్వయిరీ క్లర్క్.
మొత్తం జరిగిన సంఘటన అంతా చెప్పాడు మకతికరావు చెవి మెలిపెట్టుకుంటూ.
***** ***** ***** *****
స్టేషన్ బయటికి రాబోతున్న మకతికరావుకి, ముందు కనబడిన ప్లీడరు గారు కనబడి,
"ఏంటి సార్ ? కంప్లైంట్ ఇచ్చారా ?" అని అడిగాడు.
"తీసుకోలేదు సార్. ఇది రైల్వే స్టేషన్ ట కదా ! పోలీసు స్టేషన్ కు వెళ్ళమంటున్నారు. ప్లీడరు గారూ, మీరు కూడా కొంచెం నాతో రండి సార్, పోలీసు స్టేషన్ కు" బతిమాలేడు.
"భలేవారండి బాబూ ! నేను ప్లీడరు ను కాను. ఇక్కడ టీసీ ని"
"ఔనా ??మరి, ఆ తెల్లబట్టలు , నల్లకోటూ....??"
"ఏం ఆ బట్టలు వేసుకున్న వాళ్ళంతా ప్లీడరు లేనా ??"
"సరే కానీ, పోలీసు స్టేషన్ కి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలో, పోనీ అదైనా చెప్పండి."
""హసింపుల్. స్టేషన్ బయటికి వెళ్లి, ఎవరి జేబు అయినా కొట్టేయండీ. వాళ్ళే తీసుకుని పోతారు స్టేషన్ కి."
"అలా కాదు సార్, కొంచెం అడ్రసు చెప్పి పుణ్యం కట్టుకోండి ?"
"ఓ పని చెయ్యండి. బయటికి వెళ్లి, ఆగ్నేయం వైపుగా వంద మీటర్లు వెళ్లి, అక్కడ నుండి ఈశాన్యంగా పది అడుగులు వేసి, తిరిగి తూర్పు వైపు ......"
"అర్ధమైంది సార్. "" అని చెవికి కీ ఇచ్చుకుంటూ బయటికి నడిచాడు మకతికరావు.
***** ***** ***** *****
ఆయన ఇచ్చిన దిక్కు(మాలిన)లెక్కల ప్రకారం స్టేషన్ కు చేరుకున్నాడు మకతికరావు. అక్కడ ఉన్న అధికారితో
"సార్, మా ఆవిడ కనబడటం లేదు." అన్నాడు కొంచెం బాధగా .
"ఔనా ? మరి ఆ వార్తను అలా ఏడుస్తూ చెబుతావేం ?" తన భార్యను తలచు కుంటూ అడిగాడు అధికారి.
చెవి కీ ఇచ్చుకుంటూ, పొద్దుటినుంచీ జరిగిన విషయాలన్నీ చెప్పి,
"సార్, ఎలాగైనా మీరే మా కొంప నిలబెట్టాలి" బతిమాలుతూ అడిగాడు.
"చూడండీ, మంటలంటుకున్న కొంపలార్పే ఉద్యోగం మాది అంతే కానీ నిలబెట్టే ఉద్యోగం కాదు. మీ బాధ నాకు అర్ధమ య్యింది. ఇది ఫైర్ స్టేషన్. మీరు వెళ్ళవలసింది పోలీసు స్టేషన్ కి"
"అవునా ? మరి ఆ ఖాకీ డ్రెస్, టోపీలు..."
"భలేవారండీ మీరు" అని నవ్వుతూ ఆ అధికారి, పక్కనే ఉన్న కానిస్టేబుల్ తో
"ఇదిగో ఈయన మతిమరుపులో మళ్లీ ఏ ఎక్సైజ్ స్టేషన్ కో వెళ్లి పోయేలా ఉన్నారు. కొంచెం దగ్గరుండి పోలీసు స్టేషన్ కి తీసుకుని వెళ్ళు." అని పురమాయించారు.
***** ***** ***** *****
అప్పటికే, పొద్దుటినుంచీ మకతికరావు కోసం వెతికి వేసారిపోయిన తిమ్మక్క, ఇంక వేరే గతిలేక పోలీసు స్టేషన్ కు వచ్చి, అక్కడి రైటర్ గారితో చెబుతోంది, తన భర్త తప్పి పోయిన సంగతి.
అదే సమయంలో స్టేషన్ లో అడుగు పెట్టాడు మకతికరావు.
వెనక్కి తిరిగి చూసిన తిమ్మక్క, అప్పుడే వచ్చిన మకతికరావును గుర్తుపట్టి,
"పొద్దుటినుంచీ ఎక్కడ తిరుగుతున్నావ్. ఛస్తున్నా ! వెతకలేక. మార్నింగ్ వాక్ కి ఆ సుబ్బు అన్నయ్యతో తప్పించి, ఒక్కడివీ వెళ్ళొద్దని చెప్పానా ?" అంటూ ఒక్క ఉదుటున లేచి అతని కాలర్ పట్టుకుంది.
"వదలవమ్మా ! మా ఆవిడ కనపడక నేను ఏడుస్తూంటేనూ ? ఇంతకీ ఎవరు నువ్వు ?"
అంటూ విసుక్కున్నాడు.
"నేనెవరినా ??" అంటూ చొక్కా వదిలేసి, చెవి పట్టుకుని ఊడివచ్చేలా ఒక్క తిప్పు తిప్పింది.
వెంటనే, తేరుకున్న మకతికరావు, ..
"ఏయ్, తిమ్మూ ! నువ్వేమిటి ఇక్కడ ?" ఆశ్చర్యంగా అడిగాడు.
"మిమ్మల్ని తగలెయ్య ! ఆయన గురించి తిరుగుతున్నాను అని నువ్వు అంటు న్నావు. నీ గురించి వెతుకుతున్నానని ఆయన అంటున్నాడు. ఆశ్చర్యాలు తర్వాత పోదురుగానీ, అసలు ఏం జరిగిందో చెప్పి చావండి" విసుక్కుంటూ అన్నారు రైటర్.
"ఏమీ లేదు సార్, ఈయనకు మతిమరుపు జబ్బు ఈ మద్య కాలంలో ఎక్కువయ్యింది. అందుకే ఒక్కడినీ బయటికి పంపడం లేదు. ఈ రోజు వాకింగ్ కి ఒక్కడే వెళ్ళాడు. ఇంటికి రావడంలో కొంచెం తికమక పడ్డాడు అంతే."
"మరి ఇల్లు తాళం వేసేసి, నువ్వు ఎక్కడికో పోయావంటున్నాడు ?" సందేహం వెల్లబుచ్చాడు తోడు వచ్చిన ఫైరాయన.
"అబ్బే, ఆ తాళం వేసిన ఇల్లు మేము ఇంతకు ముందున్నది. ఆ ఇల్లు మారి అప్పుడే మూడు నెలలవుతోంది. ఈయన మర్చిపోయి అక్కడికి వెళ్లి ఉంటాడు" అసలు విషయం చెప్పింది తిమ్మక్క.
"వార్నీ, భలే ఉందమ్మా ! ఈయన మతిమరుపు వ్యవహారం. అవునూ.. నాకు అర్థం కాని విషయం ఏమిటంటే పాపం ఆయన చెవిని ఎందుకమ్మా, అలా మెలిపెట్టేస్తున్నావ్ ?" అడిగారు రైటర్ గారు.
"అదా ! అది నాకు ఈ కిటుకు ఓ డాక్టర్ గారు చెప్పారండీ. ఎలాగంటే, మనం అలారం కానీ గడియారం కానీ ఆగిపోతే ఏం చేస్తాం ? వెంటనే వెనకాల కీ ని బలంగా నాలుగైదు సార్లు తిప్పుతాం. వెంటనే అది అక్కడి నుండి తిరగడం మొదలు అవుతుంది. అలాగే , ఈయనకు కూడా ఏదైనా విషయం మరచిపోతే, దానిని ఓ సారి గుర్తు చేసి, చెవికి ఓ సారి కీ ఇచ్చేస్తే చాలు, తళుక్కున మెరిసే మెరుపులా ఆ విషయాలు అన్నీ వెంటనే గుర్తుకు వచ్చేస్తాయి" వివరంగా చెప్పింది తిమ్మక్క.
"అర్ధమయ్యింది అమ్మా ! పొద్దున్నే ఈయన ఆ తాళం ఉన్న ఇంటికి వచ్చినప్పుడే, తన చెవికి ఓసారి కీ ఇచ్చుకుంటే హాయిగా మీ ఇంటికి వచ్చేసేవాడన్న మాట. ఇంత హడావిడి లేకుండా !" అన్నారు రైటర్ గారు, తన చెవిని ఓ సారి మెలిపెట్టుకుంటూ.
"అంతేగా.. అంతేగా..""అంటూ మకతిక రావుతో పాటు బయటకు నడిచింది తిమ్మక్క.
***** ***** శుభం *** *****
(నేను రాసిన ఈ హాస్య కథ గోతెలుగు అనే అంతర్జాల పత్రికలో మార్చి 2021లో ప్రచురితమైనది)
No comments:
Post a Comment