*ఏడుకొండలు -1*
⛰️⛰️⛰️⛰️⛰️⛰️⛰️
రచన : జూలకంటి బాలసుబ్రహ్మణ్యం
ఇటు భక్తులకు, అటు తిరుమలేశునకు ఇంతగా పరమానందాన్ని కలిగించే “ఏడుకొండలవాడు!" అనే పేరు ఆ స్వామికి ఎందుకు కలిగింది? ఎలా కలిగింది? ఆ స్వామి అలా పిలవబడ డానికి కారణాలు ఏమైన వున్నాయా? అంటే!
అవునండీ! అద్భుతమైన ఆశ్చర్యకర మైన కారణాలు వున్నాయి. శ్రీనివాస భగవానుడు వేంచేసి వున్న దివ్యస్థలాన్ని బట్టి ఏడుకొండల వాడు! అని పిలువబడుతున్నాడు.
ఏడు కొండలు ఎక్కడో లేవు. ఇదిగో ఈ తిరుమల పర్వత సానువుల్లో చోటు చేసుకున్న పర్వత శిఖరాలే ఏడుకొండలు!
శేషాచలం, వేంకటాచలం, నారాయణాచలం గరుడాచలం, వృషాచలం, వృషభాచలం, అంజనాచలం... ఇవే ఏడుకొండలు. అచలం అంటే కొండ. దాన్నే అద్రి అని కూడ అంటారు.
ఇలా ఈ ఏడుకొండలు చుట్టూరా వుండగా ఏడుకొండల మధ్యలో వక్షఃస్థల శ్రీమహాలక్ష్మితో కూడ అద్భతమైన సాలగ్రామ శిలామూర్తిగా శ్రీనివాసుడు స్వయంవ్యక్తుడై ఆవిర్భవించినందు వల్ల “ఏడుకొండలవాడు!" అని పిలువబడుతున్నాడు.
తిరుమలేశునికి ఇంతగా పేరు తెచ్చి పెట్టిన ఏడుకొండల పేర్లు వాటికి సంబంధించిన ఆసక్తికరమైన కథలను తెలుసుకుందాం.
*శేషాచలం*
⛰️
శేషాచలం మొదటి కొండ! దీన్నే శేషాద్రి అని కూడా అంటారు. దీన్ని గురించి ఒక అందమైన కథను చెప్పుకుందాం.
ఇది చాలకాలం క్రిందట జరిగిన సంగతి!
ఒకప్పుడు వేయిపడగల ఆదిశేషుడు, వాయుదేవుడు ఒకరికొకరు ఎదురు పడ్డారు. పలకరించుకున్నారు. నీవు ఎలాగున్నావు అంటే నీవు ఎలాగున్నావు అని.
నాకేమి తక్కువ? నేను శ్రీమన్నారాయణు నికి అహరహం శయ్యగా, పాదుకగా, గొడుగుగా పాదపీఠంగా సేవచేస్తున్నవాణ్ణి. నా కేమిటి తక్కువ. నేను బాగున్నాను. మరి నీ సంగతేమిటి? వాయుదేవా! నీ వేమో దేశదిమ్మరివి. పైగా చపలచిత్తంతో తిరిగేవాడివి. నీ కేమి తెలుస్తుంది నా గొప్పతనం, అన్నాడు ఆదిశేషుడు.
వెంటనే వాయుదేవుడు కోపిస్తూ, “నీవు ఒక సర్పానివి మాత్రమే. వేయినాలుకలు న్నంత మాత్రాన అలా మాట్లాడ్డం తగదు. నీ వాచాలత్వం తగ్గించుకో! శ్రీమన్నారా యణునికి ఆ మాత్రం సేవ చేస్తున్నందు వల్లే నీకు ఆ కొద్దిగానైనా పేరొచ్చింది. అంతమాత్రం చేత విర్ర వీగకు.
మరి నేనంటావా! దిక్పాలకుణ్ణి. సమస్త లోకాల్లోని జీవరాసులన్నీ నా వల్ల మనుగడ సాగిస్తున్నాయి. అంతెందుకు? గాలినే ఆహారంగా తింటూ నా వల్ల బతుకుతున్న సర్పానివి నువ్వు. నీవా గొప్పవాడివి? చాలు చాలు నీ బడాయి" అంటూ వాయుదేవుడు ఆదిశేషుణ్ణి ఈసడించుకున్నాడు.
ఇద్దరికీ మాటా మాటా పెరిగింది. చివరకు “నేను గొప్పంటే నేను గొప్ప అనీ, కాదు కాదు నీ కంటే నేనే గొప్ప అని వాదులాడుకున్నారు.
ఇంకేమి! నాకంటే బలవంతుడవయితే నన్ను కొంచెం కదుల్చు చాలు, నీ గొప్పదనం బయటపడుతుంది అంటూ ఆదిశేషుడు, వైకుంఠంలోని క్రీడాద్రిని గట్టిగా చుట్టుకున్నాడు.
అంతే వాయుదేవుడు తన బలాన్నంతా సమకూర్చుకొని ఉన్నపళంగా ఒక్కసారి ఉఫ్! అంటూ ఊదాడు. ఇంకేముంది! ఆ క్రీడాద్రితో పాటు దానికి చుట్టుకొన్న ఆదిశేషుడు ఇదిగో ఈ భూలోకంలో ఎగిరి వచ్చి పడ్డాడు. దీంతో ఆదిశేషునికి గర్వభంగం అయింది.
ఎంతటివారికైనా అహంకారం పతనహేతువు కదా!
పాపం! ఆదిశేషుడు తనకు జరిగిన అవమానభారంతో కుంగిపోయాడు. ఎంతైనా ఆదిశేషుడు భక్తుడు కదా! మీదుమిక్కిలి సేవకుడు కూడా. అందు వల్ల శ్రీనివాసుడు ఆదిశేషుణ్ణి ఓదారుస్తూ “శేషుడా! నీవు ఎంతమాత్రం చింతించ వద్దయ్యా! నిన్ను నా బాహువులకు ఆభరణంగా ధరించి నాగాభరణునిగా దర్శనమిస్తాను. అంతేకాదు. ఈనాటి నుండి ఈ క్రీడాద్రి “శేషాచలం" గా ప్రసిద్ధి పొందుతుంది" అందువల్ల కూడా భక్తులు నన్ను 'శేషాచలపతి' గా పిలుస్తారు. అని వరం ఇచ్చాడు. ఆదిశేషుడు ఇది ఒకందుకు మేలే జరిగింది కదా అని ఆనందించాడు.
“శేషాద్రి" గా పేరొందిన ఈ కొండను
శ్లో॥ యోజనత్రయవిస్తారం త్రింశద్యోజనమాయతమ్ శేషాకారం హరేశ్శేషం శేషికాం సర్వదేవానామ్,
- వరాహపురాణం. 34 అధ్యా 17-18 .
అంటూ వరాహపురాణం పేర్కొంటోంది. ముప్ఫై యోజనాల పొడవుతో మూడు యోజనాల విస్తీర్ణంతో సాక్షాత్తు శేష సర్పాకృతితోనే ప్రకాశిస్తోందట ఈ శేషాచలం కొండ!
అన్నమాచార్యులు కూడ తాను తొట్ట తొలిగా దర్శించిన వేంకటాచల పర్వతాన్ని,
అదివో! అల్లదివో! హరివాసము పదివేల శేషుల పడగలమయము,
చెంగట నల్లదివో శేషాచలము నింగి నున్న దేవతల నిజవాసము,
ముంగిట నల్లదివో మూలనున్న ధనము బంగారు శిఖరాల బహుబ్రహ్మమయము
అంటూ ఇది శేషాచలపర్వతంగా, ఆదిశేషుని పడగలమయంగా వర్ణిస్తాడు.
అంతేకాక ఇంకో చోట అన్నమయ్య.
“వేదములే శిలలై వెలసినదీ కొండ! యేదెస పుణ్యరాసులే యేరులైనదీ కొండ! గాదిలి బ్రహ్మాది లోకములకొనల కొండ! శ్రీదేవుడుండేటి శేషాద్రి ఈ కొండ!!
అంటూ శేషాద్రి క్షేత్రమహిమను కీర్తిస్తాడు.
శ్రీ ‘శేషాద్రిగా' పిలువబడుతున్న ఈ సర్పాకార పర్వత శ్రేణిలో తల భాగాన శ్రీవేంకటేశ్వరుడు (తిరుమల), నడుము భాగాన శ్రీనృసింహుడు (అహోబలం), తోక భాగాన శ్రీమల్లికార్జునుడు (శ్రీశైలం) వెలసివున్నారని పురాణ ప్రసిద్ధి!
ఓం శేషాచలపతి గోవిందా! అంటూ శేషాచలాన్ని స్మరిస్తూ యాత్ర చేస్తే చాలు. సమస్త నాగదోషాలు పరిహారమవుతా యి. వివాహప్రాప్తి, సంతానప్రాప్తి కలుగుతుంది.
*వేంకటాచలం*
⛰️
రెండవ కొండ వేంకటాచలం! అదే వేంకటాద్రి! వేంకటాద్రి మహిమను భవిష్యోత్తరపురాణం చాల గొప్పగా ఇలా పేర్కొంటున్నది.
శ్లో ॥ సర్వపాపాని వేం ప్రాహుః కటః తద్దాహ ఉచ్యతే తస్మాద్వేంకటశైలో యం లోకే విఖ్యాతకీర్తిమాన్.
భవిష్యోత్తరపురాణం. అధ్యా -1 శ్లో.-221-222
'వేం' అంటే పాపాలు. అవి ఎలాంటి పాపాలైనా సరే. కటః అంటే దహించేది. అనగా తెలిసీ తెలియక చేసిన ఎలాంటి పాపాలైనా ఈ వేంకటాద్రిపర్వతం దహింపజేస్తుందట! ఎలా అంటే భయంక రమైన దావాగ్నిలో ఒకే ఒక పిడచడంత దూదిపింజ పడితే దాని దరికి పోకుండానే ఆ వేడికి కాలి బూడిద అయి ఎగిరిపోయి నట్లుగా, వేంకటాచల పర్వతం పాపాల్ని నశింపజేస్తుంది.
అందుకే అన్నమాచార్యులు కూడా ఇలా కీర్తించాడు.
కైవల్యపదము వేంకటనగ మదివో ! శ్రీవేంకటపతికి సిరులైనది.
భావింప సకలసంపదరూపమదివో ! పావనముల కెల్ల బావనమయము !!
అంటూ వేంకటాద్రిమహిమను కీర్తించాడు.
ఇంత గొప్పగా వర్ణింపబడిన ఈ వేంకటపు కొండ ఎవరికైన పాపాలు పోగొట్టిందా? మరెవరికైనా ఐశ్వర్యాల్ని ప్రసాదించిందా? అంటే!
ఔను! ఔనౌను! అంటూ ఈ క్రింద పేర్కొన్న రెండు గాథలు తెలియజేస్తున్నాయి.
*శంఖణుడి కథ*
శంఖణుడనే రాజు కాంభోజ రాజ్యాన్ని పాలించేవాడు. భోళా మనిషి. అందరినీ నమ్మేవాడు. అందువల్లే మోసగింపబడ్డా డు. ప్రారబ్ధకర్మ వల్ల రాజ్యం మొత్తం పోగొట్టుకొన్నాడు. అక్కడా ఇక్కడా తిరుగుతూ వేంకటాచల క్షేత్రానికి వచ్చాడు. అంతే! ఆ క్షేత్ర స్పర్శ వల్ల అతని పూర్వజన్మ పాపాలన్నీ సులువుగా నశించాయి. వేంకటాచలపతిని కూడ దర్శించాడు. ఇంకేముంది! పర్వతం స్పర్శ వల్ల పాపాలు పోయి పవిత్రుడైనాడు. శ్రీ శ్రీనివాసప్రభువు దయవల్ల పోయిన రాజ్యం దక్కింది. చివరకు మోక్షాన్ని కూడా పొందాడు.
*మాధవుడు అనే విప్రుని కథ*
ఇది ఇంకొక కథ!
మాధవుడు అనే సద్బ్రాహ్మణుడు దక్షిణ కాశి అని పిలువబడే శ్రీకాళహస్తి క్షేత్రంలో వుండేవాడు. సదాచార సంపన్నుడు యువకుడయిన మాధవునికి అప్సరస లాంటి అందమైన, సుగుణాలరాశి అయిన “చంద్రలేఖ” అనే బ్రాహ్మణ కన్య తో వివాహం అయింది. కొంతకాలం సంసారం సక్రమంగా సాగింది. కాని ఏ పాపగ్రహ ఫలితమో కాని ఒకనాడు 'కుంతలా' అనే వేశ్య అతని కంటపడింది. అంతే! ఆమెకు వశుడయ్యాడు.
తల్లిదండ్రుల్ని, భార్యను ఇల్లు వాకిలి విడిచిపెట్టాడు. రాత్రింబవళ్లు ఆమెతోనే తిరిగాడు. భ్రష్టుడయ్యాడు. తల్లీదండ్రీ గతించారు. భార్య ఏమయిందో తెలియదు. చివరకు వేశ్య కూడా గతించింది. దీంతో మతి చలించిన భ్రష్ట బ్రాహ్మణుడు తెగిన గాలిపటంలాగా అక్కడా ఇక్కడా తిరుగుతూ వేంకటాచల పర్వతం మొదట్లో వుండే కపిలతీర్థ క్షేత్రానికి చేరుకొన్నాడు.
అక్కడ ఆ క్షేత్రంలో కొందరు తమ పెద్దలకు శ్రాద్ధం పెట్టడం చూచాడు. అయ్యో! గతించిన తన తల్లిదండ్రులకు ఏమీ చేయలేకపోయానే అని పశ్చాత్తాపంతో మట్టితో శ్రాద్ధాన్ని నిర్వహించాడు. తర్వాత వేంకటాచల పర్వతారోహణం చేశాడు. అతను వేస్తున్న ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క పాపం నశిస్తూ తేజో వంతుడయ్యాడు. ఆ తర్వాత కొండ పైన వేంకటేశ్వరుణ్ణి దర్శించాడు.
స్వామి ప్రత్యక్షమై అనేక వరాలిచ్చాడు. మాధవశర్మ చేసిన పాపరాశులన్నీ ఈ వేంకటపు కొండ స్పర్శ వల్ల పూర్తిగా నశించాయి. మరుజన్మలో 'ఆకాశరాజు' గా పుట్టాడు. సాక్షాత్తు లక్ష్మీదేవిని 'పద్మావతి' పేరుతో పుత్రికగా పొంది, వేంకటేశ్వరునికి కన్యాదానం చేశాడు. జన్మాంతంలో కైవల్యాన్ని పొందాడు. సాక్షాత్తు శ్రీస్వామి దర్శనమిస్తున్న శ్రీవారి ఆలయ ప్రాంతమే వేంకటపు కొండ!
అందువల్ల ఇది ఘనమైన వేంకటాద్రి! దీని మహత్తు అమోఘం! అద్భుతం! అనంతం!
“శ్రీవేంకటాచలపతి గోవిందా!
శ్రీ వేంకటాద్రీశ గోవిందా! అంటూ ఈ సప్తగిరులను ఎక్కితే చాలు. సమస్త పాపాలు నశిస్తాయి. కోరిన కోరికలన్నీ సిద్ధిస్తాయి.
⛰️
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆
No comments:
Post a Comment