Sunday, September 8, 2024

 *🌹శివానందలహరి  - శ్రీ శంకర భగవత్పాద     విరచితము - 87🌹*

*అశనం గరళం ఫణీ కలాపో*
*వసనం చర్మ చ వాహనం మహోక్షః ।*
*మమ దాస్యసి కిం కిమస్తి శంభో*
*తవ పాదాంబుజభక్తిమేవ దేహి ॥ 87 ॥*

శంకరులు భగవంతుని ఏమి ప్రార్థించవలెనో‌ మనకు నేర్పుతున్నారు.

శంభో! నీవు భుజించునది విషము. నీకు ఆభరణము సర్పము. నీవు ధరించు వస్త్రము గజ చర్మము. నీ‌ వాహనము ఒక ముసలి ఎద్దు. ఇక నాకు నీవు ఏమి ఈయగలవు ? ఈయుటకు నీవద్ద ఏమున్నది ? నీ‌ పాదపద్మములయందు భక్తిని మాత్రము ప్రసాదింపుము.

ఈశ్వరుడు గుణదోషములు లేనివాడు. అట్టి వానిని సాధారణ ప్రాపంచిక కోర్కెలు కాక, భక్తిమాత్రమే కోరదగిన వస్తువు, అనిశంకరులు ఉపదేశిస్తున్నారు.

*వివరణ*
దేన్నైనా ఇవ్వగల సామర్ధ్యం ఉండే దేవుడే ప్రసన్నుడై వరం కోరుకోమంటే,--
సగటు మానవుడు ఇంద్రియ సుఖాలనే కోరుకుంటాడు.
కానీ సాధారణ మానవునికి కావలసిన కనీస అవసరాలు మూడే. అవే -- 
కూడు, గుడ్డ , గూడు అంటే--ఆహారం, వస్త్రం, నివాసం. 
అయితె--ఇవి కాక ఇంకా ఇస్తాను కోరుకోమని ఎవరన్నా అడిగితే -- విలువైన నగలు, వడిగా పోయేందుకు వాహనం లాంటివి కోరుకుంటారనుకుంటే ---
సాక్షాత్తు శివుడే కనుక శంకర భగవత్పాదుల్నే ఆలా అడిగితే, ఆయన ఏం కోరుకుంటారో, ఈ శ్లోకం ద్వారా తెలుపుతున్నారు.
ఎవరైనా తినడానికి పెట్టమని అడిగినా, మనం 
ఏదైనా తింటున్నప్పుడు ఎవరైనా వచ్చినా--మనం ఏది తింటామో, లేదా ఏది తింటున్నామో, అదే రకమైన దాన్ని పెడతాం--అంతే కదా! మరి శివుణ్ణే అడిగితే ఆయన ఏం పెడతాడు--ఆయన తిన్నది 'విషం' కాబట్టి మనకూ అదే పెడతాడు. ఆందుకే శంకరులు నాకు నీ ఆహారం వద్దు అంటున్నారు.
కట్టుకోవడానికి బట్టలు అడిగితే, ఆయన కట్టుకునేది , మనకు ఇచ్చేది గజచర్మం! ఆందుకే వస్త్రం కూడా నాకు వద్దు అంటున్నారు.
ఆశ్రయం అడుగుదామంటే,
ఆయన వుండేది వల్లకాడు
కాబట్టి అక్కడికే వచ్చి తనతో పాటు వుండమంటాడు. అందుకే శంకరులు అది కూడా వద్దంటున్నారు.
పైన చెప్పిన కనీస అవసరాలు కాకుండా ఆభరణాలను బహుమతిగా అడుగుదామనుకుంటే, ఆయన ధరించేవి నాగాభరణాలు. అందుకే అవి కూడా వద్దంటున్నారు.
వాహనం అడుగుదామంటే,
కావలిస్తే తన ఎద్దుని వాహనంగా వాడుకోమంటాడు. లేదా అలాంటి మరో ముసలి ఏద్దునే ఇస్తాడు. దానికంటే నడిచి వెళ్ళడమే సుఖం కదా 
అని, శంకరులు అదీ వద్దన్నారు.
అయితే ఇలా వంకలు పెట్టుకుంటూ ఇచ్చేవేమీ వద్దు వద్దు అంటుంటే మరి ఆ శివుని దగ్గర ఇచ్చేందుకు ఏముంటుంది? అందుకనే శంకరులు అటువంటి వాటిని దేన్నీ కోరకుండా,తనకు కావాల్సింది ఏదో, అదే అడిగారు. అది -- శివుని పాదారవిందాలపై ఎడబాటు లేని భక్తిని తనకు అనుగ్రహించమంటున్నారు.ఈ శ్లోకం లో ,
పైకి ఏదో శివుణ్ణి ఏమీ ఇవ్వలేనివాడిగా కించ పరచి నట్లుగా వుంటుంది. 
కానీ శంకరులు అడిగిoది సామాన్యమైంది కాదు.
శివుని పాదాలపై భక్తి. అది కూడా ఎడబాటు లేని భక్తి.
ఆ పాదాలు సకల సౌభాగ్య నిధులు. 
ఈశ్వర సంబంధమైనదే 'ఐశ్వర్యం'.

'ఐశ్వర్యం' అంటే--
డబ్బు, నగలు, వాహనాలు , వస్త్రాలే కాదు. 

*ఏది వుంటే ఇంక మరేదీ అడగాల్సిన అవసరం వుండదో అది 'ఐశ్వర్యం'*--

దాన్నే *ఈశ్వరానుగ్రహం* అంటారు. 
అందుకే ఎవరినైనా దీవించినప్పుడు, సాధారణంగా, 
'ఆయురారోగ్య ఐశ్వర్యమస్తు' అనే దీవిస్తారు కానీ, వట్టి 
'ధన కనక ప్రాప్తిరస్తు' అని దీవించరు. 
శివుణ్ణి మనం ఏదయినా అడిగితే, మనం అడిగినది మాత్రమే వస్తుంది. 
తీరా ఆ వచ్చింది మనకు కలిసి వచ్చేది కావచ్చు , కాకపోవచ్చు. 
ఎందుకంటే అది మన
జీవితంలో ఇలా 
జరుగుతుందని, లేక ఉపయోగ పడుతుందని గాని, మనకు తెలియక కోరినది. 
అలా గాక శివుని అనుగ్రహమే వుంటే, మనకు ఏవి అవసరమో , ఏవి శుభమో , అవే మనకు సంప్రాప్తమౌతాయి.
కాబట్టి, మనం కూడా శివుణ్ణి ,ఆలాంటి అనుగ్రహాన్ని పొందగలిగే ,
శివ పాద పరమైన భక్తినే కోరుకోవాలని శంకరులు సూచిస్తున్నారు.
అయినా నిజమైన భక్తులు ,
ముక్తులు , యోగులు , ప్రాపంచిక సంబంధమైనవేమీ ఎప్పుడూ కోరుకోరు, అని కూడా ఈ శ్లోకం బట్టి తెలుసుకోవాలి.
అసలైన మరొక విషయం 
ఈ శ్లోకం లో అంతరార్థంగా ఇమిడి వుంది.
మనం ఏది తింటే మరణిస్తామో, దాన్ని ఆయన మనకు దూరం చేసి, తాను మ్రింగి, తనవద్దనే, కంఠంలో,
వుంచుకున్నాడు.
అంటే అది ఇంక బయటకు వచ్చి మన ప్రాణాలు తీయలేదు. 
ఆయనే కనుక, ఆ సాగర మధన వేళలో,  పుట్టిన గరళాన్ని స్వీకరించకుండా వుంటే , మనమే కాదు,
ఇంద్ర బ్రహ్మాది దేవతలు , యక్ష రాక్షస కిన్నెరాది జాతులతో వున్న, ఈ సమస్త విశ్వం, దాని మహోగ్రజ్వాలలకు,
మాడి, బూడిదైపోయి వుండేది.
మనం వేటిని చూడగానే భయకంపితులమౌతామో, 
అటువంటి పాముల్ని తనకు ఆభరణాలుగా చేసుకుని, మనకు అభయాన్ని ప్రసాదించాడు. అంటే ఆయన వద్ద వున్న నాగుపాము మనకు అభయానికి గుర్తు.
మనకు జుగుప్సగా , అసహ్యంగా కనబడే ఏనుగు చర్మాన్ని ఆయన తనకు వస్త్రంగా చేసుకున్నాడు. అంటే ప్రపంచంలోని జుగుప్సను,అసహ్యాన్ని తానుంచుకుని, మనకు చీనీ చీనాంబరాలను ఇచ్చి అనుభవించమన్నాడు.

 మనం ఎక్కడకు వెళ్ళడానికి ఇష్టపడమో, అలాంటి వల్లకాటి వద్ద తాను నివసిస్తూ, మనల్ని గ్రామాల్లో , నగరాల్లో బ్రతకమన్నాడు
                             
   
ఆ పార్వతీపరమేశ్వర పాదారవిందాలకు ప్రణమిల్లుతూ...🙏🏻🙏🏻

*🕉️ఓం నమఃశివాయ 🕉️*

No comments:

Post a Comment