Wednesday, September 4, 2024

****ఇతరులలోని మంచిని మాత్రమే చూడండి!*

 *ఇతరులలోని మంచిని మాత్రమే చూడండి!*
               
రామాయణంలో ఒక గొప్ప సంఘటన జరిగింది. అంతకు మునుపే, రాముని జీవితంలో దురదృష్టకరమైన సంఘటనలు చాలా జరిగాయి. అతని రాజ్యం చేజారిపోయింది, అరణ్యవాసం అనుభవించవలసి వచ్చింది, ఇంకా చాలా కఠినమైన జీవితం గడపలసి వచ్చింది.  అతని భార్యను రావణాసురుడు అపహరించాడు. ఆమె  మీద తనకు ఉన్న ప్రేమ, అనురాగాల వల్ల దక్షిణభారతం చివరి వరకూ వచ్చి, ఒక సైన్యంను ఏర్పరచుకుని, సముద్రం దాటి, లంకకు చేరి, యుద్ధం ప్రకటించి, రావణాసురుని ఓడించి, అతనిని వధించాడు.


రావణాసురుడికి పదితలలు ఉండేవని మనకు తెలుసు. రాముడు రావణాసురుడిని చంపటానికి వాటినన్నింటినీ నరకవలసిందే.

యుద్ధం గెలిచిన తరువాత రాముడు “నాకు హిమాలయాలకు పోయి తపస్సు చేయాలని ఉంది, ఎందుకంటే నేను గొప్ప పాపం చేశాను. నేను ఒక పరమ శివ భక్తుడిని, ఒక అసాధారణమైన పండితుని, ఒక గొప్ప రాజుని, ఒక ఉదారస్వభావిని వధించాను” అన్నాడు.

మిగిలిన వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అతని తమ్ముడైనటువంటి లక్ష్మణుడు, “మీరు ఏమంటున్నారు? అతను మీ భార్యను అపహరించాడు”అన్నాడు.

అప్పుడు రాముడు, “అతనికి ఉన్న పదితలలలో చాలా గొప్ప విజ్ఞానం, భక్తి కలది మరియు ఉపాసన చేసినది అయిన ఒకతల ఉంది. దానిని వధించినందుకు నేను చింతిస్తున్నాను” అన్నాడు.

ప్రజలు చేసే తప్పు ఏమిటంటే, ఒక గుణాన్ని గుర్తించే బదులు, వారు ఆ మనిషినే పూర్తిగా ఖండిస్తారు.

అందరికీ పది లేదా అంతకన్నా ఎక్కువ తలలే ఉన్నాయి. ఒక రోజు మీ తల అంతా అత్యాశతో నిండి ఉంటుంది. మరొక రోజు అసూయతో, ద్వేషంతో, ప్రేమతో, మోహంతో, అందంతో లేదా వికారంగా ఉంటుంది. లేదా ఒకే రోజు మీలో ఇవన్నీ ఉండవచ్చు. మీరు ఒకరిని ఒక క్షణం అసూయతో చూసినట్లయితే అతను అసూయాపరుడు అని నిర్ధారణకు వస్తారు. కానీ నిజంగా, అనేక సమయాలలో, అనేక రకాల తలలు ప్రతివారిలో పని చేస్తూ ఉంటాయి. ప్రతివారికీ ప్రేమతో నిండిన తల, అలానే అందంతో, ఉదారస్వభావంతో  లేదా కరుణతో నిండిన తల ఉంటాయి. ప్రజలు చేసే తప్పు ఏమిటంటే, ఒక గుణాన్ని గుర్తించే బదులు, ఆ మనిషినే వారు పూర్తిగా ఖండిస్తారు.

రాముడు చెప్పేది ఏమిటంటే రావణాసురుడు ఎంత ఘోరమైన పనులు చేసినా, అతని యందు  బ్రహ్మాండమైన సంభావ్యత కలిగిన ఒక అంశం ఉంది. ఈ ప్రాథమిక సూత్రాన్ని ఆచరించండి- ‘మీరు ఎవరిలోనైనా ఏదైనా తప్పు చూసినట్లైతే ఆ తప్పును ఖండించండి, కానీ ఆ మనిషిని కాదు. మీరు ఈ జ్ఞానాన్ని మీ జీవితంలోకి తీసుకొచ్చినప్పుడు, మీరు అనవసరమైనటువంటి  వాటినుంచి విముక్తులవుతారు. మీరు ఇతరులకు ఇలా చేస్తే, మీకూ అదే జరుగుతుంది.’

రాముడు తన భార్యను అపహరించి, ఇంకా ఎన్నో ఘోరమైన పాపాలు చేసిన వానిని వధించినందుకు తపస్సు చేస్తానన్నాడు. ఇంత జరిగినా, రాముడు అతని యందున్న ఒక అందమైన తలను చూడగలిగాడు. అతను  ఒక్క గొప్ప జ్ఞానం కలవాడు. అందుకే రాముడిని అందరూ ఆరాధిస్తారు, పూజిస్తారు. అతను జీవితంలో ఎన్నో వాటిలో ఓడినప్పటికీ, అతని ఓటమి ఎన్నడూ అతని గుణాలను,జ్ఞానాన్ని మార్చలేకపోయింది. జీవితం అతనికి ఏమి చేసినా వాటికి అతను లొంగలేదు.

దయచేసి మీ చుట్టూ ఉన్నవారందరితో ఈ పని చేయండి.  భరించలేనివారు అనుకునే వారిలోనూ మీరు ఒక  రవ్వంతైనా తియ్యదనాన్ని గుర్తించండి.

మీరు రాముని ఈ గుణాన్ని సంవత్సరమంతా గుర్తుంచుకోవాలని 
నా కోరిక.  మీరు ఈ చిన్ని జ్ఞానాన్ని గ్రహించినట్లైతే, మనిషిని ఖండించే బదులు ఆ గుణాన్ని గుర్తించగలిగితే గురు పౌర్ణిమ వచ్చి దక్షిణాయానికి వెళ్ళకముందే మీరు మంచి పంట పండించుకోగలరు. ఒక గులాబి మొక్కలో గులాబి పూలకన్నా ముళ్ళు ఎక్కువుగా ఉంటాయి, అయినా మనం దానిని రోజా మొక్కే అంటాము, ఎందుకంటే మనం దానిలోని అందాన్ని గుర్తించాం కాబట్టి.   ఒక మామిడి చెట్టులో పండ్లకన్నా ఆకులే ఎక్కువ ఉంటాయి, అయినా మనం దానిని మామిడి చెట్టే అంటాము, ఎందుకంటే మనం ఆ పండ్లలోని మాధుర్యాన్ని గుర్తించాం కాబట్టి.

ప్రతి మనిషిలోను కనీసం ఒకటైనా తియ్యని అంశం ఉంటుంది. మనం దానిని ఎందుకు చూడకూడదు? దయచేసి ఈ పని చేయండి – మీరు భయంకరమైన వారిగా భావించే వారిలోనూ ఒక  రవ్వంతైనా తియ్యదనాన్ని గుర్తించండి. మీరు ఇతరులలో అది ఎప్పుడు గుర్తిస్తారో అప్పుడు మీలో కూడా అది గుర్తించబడుతుంది. అదేవిధంగా, మీరు ఇతరులలో భయంకరమైనవి చూస్తున్నట్లైతే, మీ విషయంలోనూ అదే జరుగుతుంది. దీని అర్ధం మీరు అన్నింటికీ అంధులు కావాల్సిన అవసరం లేదు. మీరు మామిడి చెట్టుకు ఉన్న ఆకులను చూస్తారు, గులాబి మొక్కకు ఉన్న ముళ్ళను చూస్తారు కానీ ఆ మామిడి పళ్ళను, గులాబి పూలను మాత్రమే గుర్తిస్తారు. మీరు చేయవలసినది అంతే. పదండి, ఈ  ఆశయాన్ని సాధిద్దాం.       

No comments:

Post a Comment