🌹గుడ్ మార్నింగ్ 🌹శరీరం బాగుండాలని కోరుకుంటాము. మనసు బాగుండాలని కోరుకుంటాము. కుటుంబం మొత్తం బాగుండాలని కోరుకుంటాము. ఇలా మనకు సంబంధించిన అన్నీ బాగుండటానికి ధనము అవసరమని దాని కొరకు ప్రయత్నిస్తూ ఉంటాము. మనం ఎంత ప్రయత్నించినా శరీరం మార్పులకు లోనవుతూ సాగుతూ ఉంటుంది. మనసు శరీరానికి అనుగుణముగా కదులుతూ ఉంటుంది. మనము మనకు సంబంధించిన అన్నీ ఎంత బాగుండాలని ప్రయత్నించినా - అవన్నీ ప్రకృతిపై ఆధారపడి - ప్రకృతితో కలిసి - ప్రకృతిపై నియంత్రణలో సాగుతూ వున్నాయి. మనం మనను, మన వారిని, మన వాటిని - నేను, నావి, నా వారు అని పరిమితిగా విడిగా భావించుకుంటే అది కేవలం మనం ఏర్పర్చుకున్న స్వీయ భావనే తప్ప - మనం మొత్తము ఏకముగా ఉన్న, ఒక్కదానిపై ఒకటి ఆధారపడి ఉన్న, మొత్తం ప్రకృతి లేక విశ్వము లోని అంశమే. అంటే మనమే మొత్తము ప్రకృతి - మొత్తం విశ్వము. కాని మన శరీర నిర్మాణము - దాని గ్రహణ శక్తులు మనకు నేను అని పరిమిత భావన కలిగేలాగానే వున్నాయి. అయితే ఈ పరిమిత భావన కలిగించే శరీరములోనే - భావన, ఆలోచన, ఊహ, జ్ఞాపకము - ఈ విధముగా పని చేసే జ్ఞానము వున్నది. దానిని ఉపయోగించి కొంచెం పరిశీలిస్తే - మొత్తం మన మనుగడ సృష్టిలో - సృష్టితో ఏర్పడి - ఆ సృష్టిలోనే - ఆ సృష్టితోనే సాగి - ఆ సృష్టిలోనే కలిసిపోతున్నది. ఈ గమనికను ఇంకా కొంచెం లోతుగా తీసుకువెళ్ళగలిగితే - మనుగడకు ముందు నేను సృష్టిలోనే ఉండి ఉండాలి. మనగడకు తరువాత నేను సృష్టిలోనే ఉంటూ ఉండాలి. మధ్యలో మనుగడ అంటే ఈ శరీరం అనే వ్యక్తీకరణ సృష్టి లక్షణమై ఉండాలి. అంటే సృష్టి తనను తాను అనేక రకాలుగా వ్యక్తీకరించుకుంటూ - మార్పు చెందించుకుంటూ - మరల తన సహజ స్థితిలోనికి అంటే అవ్యక్త స్థితికి వెళ్లిపోతున్నది. ఇలా ఎందుకు అన్న ప్రశ్నకు తావే లేదు. ఎందుకంటే అది దాని సహజ స్వభావము కనుక. అలాంటి స్వభావము ఎందుకున్నది అన్న ప్రశ్నకు తావే లేదు. ఎందుకంటే అది శక్తి కనుక. శక్తి యొక్క శక్తులు అనంతము - అపరిమితము. శక్తి అంటేనే చైతన్యము. అంటే కదలిక. నిరంతర కదలిక.సర్వ వ్యాపక చైతన్యము తనలో తాను - తనతో తాను కదులుతున్న కదలికే విశ్వము - ప్రకృతి - సృష్టి - ఇందులోని సమస్తము. ఇది గ్రహించవలసిన విషయము. అర్ధమయితే భేద భావన పోతుంది.అనంత ఏకత్వము అర్ధమై అనుభవమవుతుంది. అప్పటి వరకు పరిమిత భావన రకరకాల గందరగోళాలు కల్పిస్తూనే ఉంటుంది. ఇది అర్ధమవాలంటే నిన్ను నువ్వు - నన్ను నేను - ఎవరిని వారు సంపూర్ణముగా చదువుకోవాలి - తద్వారా తెలుసుకోవాలి. వేరే ఏ మార్గము లేదు.
కాదు వేరే మార్గాలు వున్నాయి అని ప్రయత్నించినా అవి నన్ను నాకు చూపించవు. ఎవరినో దేనినో చూపిస్తూ ఉంటాయి. నేను నాకు తెలియకుండా ఏది తెలుసుకున్నా ఉపయోగము ఏమిటో నాకు నేనే ఆలోచించు కోవాలి. నిజాయితీ కలిగిన ఆలోచనకు సమస్తము అర్ధమవుతాయి. అవసరం వేరు - కోరిక వేరు - నన్ను నేను తెలుసుకోవటం వేరు..🌹god bless you 🌹
No comments:
Post a Comment