Wednesday, November 27, 2024

 ☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️

27. సమానానాం ఉత్తమ శ్లోకో స్తు

సాటివారిలో ఉత్తముడిగా కీర్తి పొందు(వేద స్వస్తి)

ఏ రంగంలోనైనా ప్రథమస్థానాన్ని పొందాలని, విజయం సాధించాలని అందరికీఅనిపిస్తుంది. ఒక గాయకుడు మిగిలిన తోటిగాయకులందరిలోకి గొప్పవాడు కావాలనీ,ఒక ఇంజనీర్ ఆ రంగంలో 'నంబర్ వన్' అనిపించుకోవాలనీ... ఇలా ప్రతివారూ
భావిస్తారు. అందుకే వేదం- అలా 'ఉత్తమత్వాన్ని' పొందమనేదీవిస్తోంది.

అయితే - వైదికహృదయం వేరు.

మనం ఉన్న రంగంలో అగ్రస్థానం కావాలని ఎత్తులూ జిత్తులూ ప్రదర్శిస్తూ,అవసరమైతే అక్రమ పంథాలోనైనా పురోగమించాలనే వెంపర్లాటని మన సంస్కృతి
అంగీకరించదు.

గొప్పవానిగా కనిపించాలనే తాపత్రయమే తప్ప, అలా జీవించాలనే సాధన లేకపోతే
దోషమే. 'కీర్తి కాముకత' పనికిరాదని మన ధర్మమే చెప్తోంది. అంటే కేవలం
కీర్తికాంక్షతో నానా అగచాట్లు పడరాదని దాని భావం.

ఉత్తమమైన ఆలోచనా విధానం, ప్రవర్తనా సరళి అలవరచుకుని తద్వారా -'ఉత్తముడు' అనిపించుకోవాలని వేదభావన.

ధార్మికంగా ఉత్తమత్వంసాధించడానికి పోటీ పడాలి. 'అందరిలోకీ ధార్మికంగా
ఉత్తమ లక్షణాలను సాధిస్తాను' అనే తపన ప్రధానం. అటువంటి తపనకు
ఆశీస్సులందిస్తోంది వేదజనని.

మన ప్రాచీన గ్రంథాలన్నిటిలో ఇటువంటి ఉత్తమశ్లోకులనే నాయకులుగా, ఆదర్శాలుగా ప్రతిష్ఠించారు.

ప్రపంచానికి మన మంచిని మాత్రమే చూపిస్తూ, దోషాల్ని మనలోనే దాచుకోవడం 'ఉత్తమ శ్లోకత్వం' అనిపించుకోదు. మనల్ని మనం పరిశీలించుకొని ధార్మికతను
పోషించుకోవడం ప్రధానం.

భౌతికంగా ఒక వ్యాపారంలోనో, ఒక ప్రతిభలోనో గొప్పవారనిపించుకోవడం
అవసరమే. మనమెక్కడుంటామో అక్కడ అలా కీర్తి పొందాలనుకోవడం సహజమే.అంతకన్నా ముఖ్యం - మనమున్నచోట మనం ధార్మికంగా 'ఉత్తమం' అని పించుకోవడం. గొప్పవాడికన్నా 'మంచివాడు' ఇంకా గొప్పవాడు.

'సరివారిలోన చౌకజేయకు' - అని త్యాగరాజస్వామి వారు కూడా పేర్కొన్నారు.

ప్రస్తుతం అన్నివైపులా పోటీ మనస్తత్వం భయంకరంగా పెరుగుతోంది. 'సర్వాధిక్యత'
కోసం విద్యార్థిదశ మొదలుకొని, జీవిత చరమదశ వరకు వివిధ ప్రణాళికలు, పరుగులతోనే సాగిపోతోంది. ఆ పోటీ మనస్తత్వం అనే బలహీనతను వినియోగించుకోవడానికి సంస్థలు చాలా వెలిశాయి. ఇంకా కొత్తవీ వస్తున్నాయి.మళ్లీ వాటిలో పోటీలు.

ఈ 'నంబర్ వన్' పరుగులో తలలు మార్చడాలు, మాయలు పన్నడాలు ఎన్నెన్నో! అవసరమైతే ప్రశ్నపత్రాల చౌర్యం. దానికి సహకరించే అధికారుల అవినీతి! ఇటువంటి తరహావే - విద్యారంగంలోనే కాక ఇతర రంగాల్లోనూ తలెత్తుతున్నాయి.

బాధాకరమైన విషయమేమిటంటే - ఆధ్యాత్మికరంగంలోనూ ఈ 'పోటీ - వ్యాపార విషసంస్కృతి' అలముకుంటోంది. 'ఉత్తమశ్లోకత్వాన్ని సాధించడానికి బదులు అగ్రస్థానంలో ఉండాలనే తాపత్రయంతో - మానవుల బలహీనతల్ని తెలివిగా వాడుకొని, వారి భక్తి భావాన్ని దుర్వినియోగం చేస్తున్న ఆధ్యాత్మిక వ్యాపారవేత్తలు
అడుగడుగునా సాక్షాత్కరిస్తున్నారు.

భౌతిక ప్రలోభాలు ఏమాత్రమూ పనికిరాని ఆధ్యాత్మిక క్షేత్రంలోనే,
'సర్వసంగపరిత్యాగమే' పెంచుకొనే దృఢప్రయత్నాలు చేసే గొప్ప వ్యాపారమౌతోందంటే - ఇంక భౌతిక రంగాల గురించి వేరే చెప్పనవసరముందా!

ధార్మికమైన కీర్తిని మాత్రమే సాధించే ప్రయత్నాన్ని వేదమాత ప్రోత్సహించింది.సత్కర్మాచరణకోసం, తద్వారా లభించే ధార్మిక యశస్సుకోసం ద్వేషభావం లేని 'పోటీ'
అవసరమే.

అన్నిచోట్లా 'పోటీ' అనేది మనలో నిక్షిప్తమైన గొప్పశక్తుల్ని వెలికితియ్యడానికే
సహకరించాలి తప్ప క్షుద్రమైన ఆలోచనల్నీ, వ్యూహాల్ని పన్నడానికి పనికిరాకూడదు.

పోటీ యొక్క సవ్యమైన పద్ధతి ఇది. మన తోటివారితో మనం 'ఉత్తమ కీర్తి'
సాధించడానికి పోటీపడి ‘ధర్మాచరణ' చేయాలి. ఈ పోటీ అందరిలో పెరిగిన నాడు అందరూ ఉత్తమశ్లోకులే అవుతారు. ఒక ఆరోగ్యకరమైన వ్యవస్థ ఆవిర్భవిస్తుంది.  

No comments:

Post a Comment