Friday, November 29, 2024

 *🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
  *ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
               *ఆధ్యాత్మిక దీప్తి*

*భగవంతుడి అనుగ్రహాన్ని పొందడమెలా? అష్టోత్తరాలు, సహస్ర నామార్చనలు, పంచామృతాభిషేకాలు, పుష్పాలంకరణలు, షడ్రసోపేతమైన పదార్థాల నివేదనలు- ఇవన్నీ దైవకృప సాధించడానికి ఉపకరిస్తాయని భావిస్తుంటారు. పరమాత్ముడు నిజంగా వీటికే సంతృప్తి చెందుతాడా? దైవభక్తి అంటే ఇదేనా? భక్తుల నుంచి భగవంతుడు ఆశించేదేమిటి, భగవంతుడికి ప్రియమైన భక్తులెవరు? బుద్ధిగతంగా, ఆత్మశుద్ధితో తమను తాము ఉద్ధరించుకుంటూ నిత్య చైతన్య స్వరూపులుగా మసలుకునేవారే దైవానికి ఇష్టమైనవారని గీతాసందేశం. దయగల హృదయమే పూజామందిరం. కరుణ నిండిన మనసే ప్రేమానురాగాల కలువల కొలను. మానవతా పరిమళాలు గుబాళించాలంటే మదిని మల్లెల తోటగా మలచుకోవాలి.*

*‘జీవితంలో మధురిమల్ని ఆస్వాదించాలనుకుంటున్నావా? అయితే నీ దృష్టిని ఆధ్యాత్మికత వైపు మళ్లించు. అద్భుతమైన ఫలితాన్ని గమనించు’ అని వివేకానందుడు సూచించారు. జరుగుతున్న దానిపట్ల ఎరుక కలిగిఉంటూ యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ జీవించడమే ఆధ్యాత్మికత. మనసును దైవంతో, వాక్కును ప్రియ సంభాషణలతో, కర్తవ్యాల్ని ధర్మకార్యాలతో మమేకం చేసిన వ్యక్తులే దేవుడి కొలువు కూటమిలో ముందువరసలో ఉంటారని ఆదిశంకరుల ప్రబోధం. ‘నిన్ను నువ్వు తెలుసుకో... తెలివిగా మసలుకో’ ఇదే నా ఉపదేశసారం అని రమణ మహర్షి ఆధ్యాత్మిక రహస్యాన్ని వెల్లడించారు. హృదయంలో అరిషడ్వర్గాలు, రాగద్వేషాలు, ప్రతికూల ఆలోచనలనే గాఢమైన చీకట్లు ఉంటే పరమాత్మ చూపు మనపై ఎలా ప్రసరిస్తుంది? శరీరాన్ని శుద్ధజలంతో పరిశుభ్రం చేసుకోవచ్ఛు కానీ, అంతరింద్రియమైన మనసును శుభ్రం చేయడమెలా?*

*సత్వగుణాలతో, ఆధ్యాత్మిక చింతనతో, రుజువర్తనతో మనసును నిరంతరం ప్రక్షాళన చేస్తుండాలి. ఆత్మవిద్యలో, సాధుజీవనమనే తపస్సుతో మనసు సదా నిర్మలంగా ఉంటుందని భాగవతం ఈ విషయాన్ని ప్రస్తావించింది. యోగసాధన, ఆత్మశోధన ద్వారా జీవుడు అమృత స్థితిని సాధించవచ్ఛు ‘అసంపూర్ణత్వం నుంచి పూర్ణత్వం, సంకుచితత్వం నుంచి అనంతత్త్వం, మృత్యువు నుంచి అమృతత్వాన్ని అందుకోవడానికి భౌతిక, ప్రాణిక, మానసిక స్వభావాలతో పరివర్తన జరగాలి’ అనేది అరవిందయోగి సూచించిన దివ్యమార్గం. ఏ మనసు నిరంతరం జ్ఞానాన్వేషణలో నిమగ్నమవుతుందో, ఏ హృదయంలో హితకరమైన ఆలోచనలు పరిఢవిల్లుతాయో, అలాంటి వ్యక్తులు ఎల్లప్పుడూ శుభకరమైన సంకల్పాలు చేస్తారు. మనసు చేసే సంకల్పాలన్నీ కల్యాణదాయకంగా ఉండాలని యజుర్వేదం ఆక్షాంక్షించింది. కపటత్వాన్ని కాదు, కల్మషంలేని మంచి పనులనే భగవంతుడు హర్షిస్తాడు. ప్రపంచానికి ఉపయుక్తమైన రీతిలో జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో ఆధ్యాత్మికత నిర్దేశిస్తుంది.*
 
*ధైర్యవంతులు నడిచే రాచబాట ఆధ్యాత్మికత. గడ్డిమొక్క త్వరగా విస్తరించి వేళ్లూనుకుంటుంది. అదే మామిడి మొక్క వృక్షంగా ఎదిగి, మధుర ఫలాల్ని అందించడానికి నియమిత సమయాన్ని తీసుకుంటుంది. సహనమే మన సంస్కృతి. ఆధ్యాత్మికత అభ్యున్నతి సాధించడానికి సహనశీలత అవసరం. నిర్మలభక్తి సాధనకు నిత్యం కృషి చేయాలి. భక్తి, ఆధ్యాత్మికతల వల్ల హృదయ కమలం విస్ఫారితమవుతుంది. ఆ పుష్పాన్ని భగవదర్పితం చేయడమే అసలైన పుష్పార్చన. హృదయంలో ఉప్పొంగే దయామృతాన్ని దీనులపట్ల జాలువార్చడమే దైవానికి అమృతాభిషేకం. సత్కర్మల ద్వారా చేకూరే ఫలితాన్ని దైవానుగ్రహంగా భావించడమే భక్తి నివేదన. జీవితాన్ని వెలుగు తరంగంగా, ఆనందోత్సవంగా మార్చుకోవడానికి ఆధ్యాత్మిక జ్యోతే దారిదీపం!*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*🙏సర్వేజనా సుఖినో భవంతు🙏*
🌴🍃🌴 🍃🌴🍃 🌴🍃🌴

No comments:

Post a Comment