Tuesday, November 26, 2024

 🕉️ ఓం నమః శివాయ 🕉️

🙏 శివాయ గురవే నమః 🙏

భగవంతుని మీద ఏమాత్రం భక్తి, విశ్వాసంలేని ఒక పిసినారి............!!
 భాగ్యవంతుడు భార్య పోరు తట్టుకోలేక సత్యనారాయణస్వామివ్రతం చేస్తున్నాడు. 
షోడశోపచార పూజ ప్రారంభమైంది. ధూపానికి అగరొత్తు లేవి? అన్నాడు పురోహితుడు. మర్చిపొయ్యాను అన్నాడు. సరేనని 'ధూపార్థం అక్షతాన్ సమర్పయామి' అన్నాడు పురోహితుడు. ఆ తరువాత వస్త్రం అడిగినా, నైవేద్యం అడిగినా అన్నింటికీ ఒక్కటే సమాధానం - 'తెలియదు - కానివ్వండి' అని. సరేనని వస్త్రార్థాన్ అక్షతాన్ సమర్పయామి; నైవేద్యార్థం అక్షతాన్ సమర్పయామి అంటూ అన్నింటిని అక్షతలతో పూర్తి చేశాడు పూజ. పూజానంతరం పురోహితుణ్ణి పంపించేశాడు. 
 ఇక భోజనానికి కూర్చున్నాడు. భార్య విస్తరి వేసింది. మంచినీళ్ళు పెట్టింది. ఆ తరువాత అక్షతలు తెచ్చి అన్నార్థం అక్షతాన్ సమర్పయామి, శాకార్థం అక్షతాన్ సమర్పయామి, అపూపార్థం అక్షతాన్ సమర్పయామి, దధియార్థం అక్షతాన్ సమర్పయామి అంటూ అక్షతలను వంచింది విస్తరిలో. ఇదేమిటి? వీటితో భోజనం చేయాలా? అని కసురుకున్నాడు భార్యను. ఆమె, "దేవుని పూజకు ఏ ఉపచారం అక్కరలేదు గాని, మీ భోజనానికి అన్నీ కావాలా?" అన్నది. దానితో ఆ ధనికుడు సిగ్గుపడి అప్పటి నుండి శ్రద్ధగా పూజలు చేశాడు.
 
అలాగే *ఏ పనిచేసినా శ్రద్ధ ఉండాలి. శ్రద్ధలేకపోతే సిద్ధిలేదు. కనుక బ్రహ్మజ్ఞానము నందు, బ్రహ్మమునందు, గురువునందు విశ్వాసం (శ్రద్ధ) ఉండాలి. అనంతమయిన భగవంతుని అంశ నీలోనే ఉన్నది అని చెప్పినా నమ్మలేని వాళ్ళు, నమ్మని వాళ్ళు తమలోనే ఉన్న భగవంతుని అందుకొనుటకు, భగవంతునితో ఐక్యమైపోవుటకు ఏ ప్రయత్నమూ చేయరు. అలా భగవంతుని అందుకొని, భగవంతునితో ఐక్యమై, జీవన్ముక్తులు కాకపోతే మళ్ళీ మళ్ళీ మార్పులతోను, మరణాలతోను కూడుకున్న ఈ ప్రపంచానికే తిరిగిరావాలి. అంతకన్న వేరొకదారి లేదు అని స్పష్టం.

🙏 హర హర మహాదేవ శంభో శంకర 🙏

No comments:

Post a Comment