*186 - శ్రీ విద్యా - శాశ్వతమైన శక్తి / Sri Vidya – The Eternal Energy*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩
*26. కర్పూర వీటి కామోద సమాకర్ష ద్దిగంతరా!!*
కర్పూరము మొదలైన సుగంధద్రవ్యాలతో కలిసిన తాంబూలము వేసికొనటంవలన
దిగంతములవరకు సువాసనలు వ్యాపించినది.
అసలు తాంబూలంలో ఏం వేస్తారు? కర్పూర వీటిక అంటే ఏమిటి?
ఏలా లవంగ కర్పూర కస్తూరీ కేసరాదిభిః ॥
జాతీఫలదశైః పూగైః లాంగుల్యూషణ నాగరైః
చూర్హెః ఖాదిరసారైశ్చ యుక్తా “కర్పూర వీటికా” ॥
ఏలకులు, లవంగాలు, పచ్చకర్పూరము, కస్తూరి, నాగకేసరము అంటే కుంకుమ
పువ్వు, జాజికాయ, వక్కలు, జాపత్రి, చలువ మిరియాలు, కాచు, తమలపాకులతో
కూడిన దానిని కర్పూర వీటిక అంటారు. ఈ తాంబూలము యొక్క సువాసనను
ఆక్రాణిస్తున్న దిక్పాలకులే వస్త్రముగా గలది.
దేవి ముఖం నుంచి బయటకు వచ్చే తాంబూలకబళము కోరుతున్న దేవతలకు
అది లభించలేదు. కనీసం దాని వాసన అయినా గ్రహిద్దాము అని వారు ఆ సువాసనను
ఆఘ్రాణిస్తున్నారు.
కర్పూర వీటికను వేసుకోవటంవల్ల దేవి ముఖ పరిమళము దిగంతములకు
వ్యాపించినది. దేవి తాంబూలాన్ని దాని పరిమళాన్ని వర్ణిస్తూ శంకర భగవత్సాదులవారు
తమ సౌందర్య లహరిలోని 65వ శ్లోకంలో...
రణే జిత్వా దైత్యా నపహృతశిర స్రైఃకవచిభి
నివృత్తై శ్చండాంశ త్రిపురహర నిర్యాల్యవిముఖైః !
విశాఖ న్రోపేన్రై శృశివిశద కర్పూరశకలాః
విలీయన్తే మాత స్తవ వదన తామ్మూల కబళాః ॥
తల్లీ ! రాక్షసులను జయించి యుద్ధ రంగాన్నుంచి తిరిగివస్తూ శివనిర్మాల్యము
ఒద్దనుకున్న కుమారస్వామి, విష్ణువు, ఇంద్రులచేత, నీ నోటి నుంచి వచ్చిన తాంబూల
కబళములు కాజేయబడుతున్నవి.
అంటే శివ నిర్మాల్యము కన్న శక్తి యొక్క తాంబూల కబళానికే ప్రాముఖ్యత ఉన్నదని
చెబుతున్నారు.
అమ్మవారు ప్రత్యేకమైన సుగంధద్రవ్యాలు కలిపిన తాంబూలాన్ని వేసుకున్నది. ఈ తాంబూలాన్ని కర్పూర వీటికా అంటారు. ఆమోదం అంటే సువాసన.
అమ్మ వారు వేసుకున్న కర్పూర తాంబూలం నుంచి వచ్చే సువాసన దిక్కుల చివర వరకు వ్యాపించింది. ఆ వాసనకు ఆకర్షింపబడి దిగంతాల నుంచి సకల ప్రాణులు అమ్మవారి దగ్గరికి తరలి వస్తున్నాయి.
మానవులు ఎన్నో జన్మల సంస్కారం తర్వాత మానవ జన్మలోకి వచ్చినా, పాత వాసనలు వదలక మరల మరల సంసారంలో పడి కొట్టుమిట్టాడుతున్నారు.
వీటిని తొలగించడానికే భగవంతునికి షోడశోపచారాలను ఉపాసన విధానం లో ఏర్పాటు చేశారు.
కర్పూర వీటిక యనగా యాలకులు, లవంగములు, పచ్చ కర్పూరము, కస్తూరి, నాగకేసరములు, జాజికాయ, వక్కలు మొదలగు వాటి పొడి తమలపాకులతో పాటు కూర్పబడినది. దీనినే తాంబూలము అందురు. అట్టి తాంబూల సువాసన తన పది దిక్కుల యందు వస్త్రముగా గలది అని భావము. దేవి ఆవిర్భావము చెందిన వెనుక ఆమె ముఖము నుండి ప్రసరించు సువాసన పది దిక్కుల యందు దేవతల నేర్పరచెను.
వీరినే వరుసగా ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరఋతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు, ఇంద్రా విష్ణువు, అగ్నా విష్ణువు అందురు. దేవి తాంబూల సువాసన నుండి ఏర్పడిన యీ దిగ్గేవతలు కేవలము ఆ సువాసనల యందు ఆసక్తి కలవారై తమ తమ కార్యములను నిర్వర్తించు చున్నారని కవి భావము.
దేవి తాంబూలపు సువాసన దశదిశలకూ వ్యాపించుటచే ఆమోద' అను పదమును మంత్రమున వాడిరి. ఆ సువాసనా వ్యాపనమునకు దిగంతరము లన్నియూ సమాకర్షణము చెందుచున్నవని భావము.
సాధకుని నోరు కూడా యిట్లు సువాసనలు పొందినచో ఆ నోటి యందు అమ్మవారు నివాసమున్నట్లే! సుశబ్దములు పలుకు నోటి యందు సువాసన యుండును. నోటి దుర్వాసన నోటి వినియోగపు తీరును మార్చు కొనమని సందేశ మిచ్చును. కేవలము ఖరీదైన పండ్లపొడి, పేష్టులతో నోటి దుర్వాసన నరికట్టలేము కదా!
సమ్యగ్భాషణమే నోటి సువాసనా రహస్యము. అట్టి వారికి దిగ్గేవతల సహకారముండునని కూడా తెలియవలెను. వాక్కుయే సమస్త సృష్టినీ ధరించి యున్నది గాన, వాక్కును సరి చూచుకొనువారు సువాసన వలన దిక్కుల రక్షణ కలిగియున్నారు.
కర్పూరము స్వచ్ఛముగా, తెల్లగా, నిర్మలంగా, చల్లగా, తేలికగా ఉంటుంది. తన స్థూల అస్తిత్వాన్ని తక్కువకాలంలో పోగొట్టుకుంటుంది. తనలోని అగ్నిని తక్కువ కాలంలో వ్యక్థం చేస్తుంది. వెలుగును పరిమళాన్ని ఇస్తుంది.
పచ్చకర్పూరము స్థూలస్థితి అయినా ఘనస్థితిలో ఉన్నా - ద్రవస్థితి చెందకుండానే సూక్ష్మస్థితి అయిన వాయుస్థితి లోనికి సూటిగా తక్కువ కాలంలో మారగలదు. అందువల్ల స్థూలలోకంలో ఉండేవారి నుండి వారి సూక్ష్మశరీరం వేరై తక్కువకాలంలోనే సూక్ష్మలోకాల్లో విహరించడానికి వారికి అనుభూతిపరంగా ఈ కర్పూరం దోహదపడుతుంది.
🕉🌞🌏🌙🌟🚩
No comments:
Post a Comment