ఇనుము కొలిమిని చేరినప్పుడు దాని బలం పెరుగుతుంది. కాలుతూ, సుత్తి దెబ్బలు తింటూ, సాగుతూ మనకు కావాల్సిన వస్తువుగా రూపాంతరం చెందుతుంది. అదే ఇనుము నీరు తగిలితే తుప్పుపడుతుంది. బలహీనమవుతుంది. దాన్నే సహవాస దోషం అన్నారు. మన ఆలోచనల విధానాన్ని, నడతను నిర్ణయించేది మన సాంగత్యం. అది గొప్పవారిదైనా కావచ్చు, మంచి పుస్తకాలదైనా కావచ్చు. ఇక్కడ మన వివేకమే మనకు గొప్ప మార్గదర్శి.
సీతాన్వేషణలో ఉన్న శ్రీరాముడికి హనుమంతుడితో స్నేహం, ఆయన వల్ల సుగ్రీవాది వానర ప్రముఖులతో పరిచయం కలిగాయి. వారి కలయిక ఏవిధంగా లోకకల్యాణానికి దారితీసిందో మనకు తెలియంది కాదు. ఉప్పు వంటకాలతో చేరినప్పుడు వాటికొక సాంద్రత, అమోఘమైన రుచి వస్తాయి. ఉప్పులేని కూర ఒప్పదు రుచులకు... అన్నారు కదా అదే ఉప్పు పాలతోనూ, పరమాన్నంతోనూ కలిస్తే అంతా వికటిస్తుంది. ఆ పదార్థాలే పాడైపోతాయి.
ఇక్కడ కావాల్సింది విచక్షణ. క్షాత్రపరీక్ష వేళ అవమాన భారంతో దుఃఖితుడైన కర్ణుడు అవసరార్థం దుర్యోధనుడితో చేయికలిపాడు. ఆ స్నేహం కర్ణుడికి తాత్కాలిక హోదా, గౌరవాలనిచ్చినా, దానికి కృతజ్ఞతగా అతడు అధర్మపక్షాన నిలిచి యుద్ధం చేయక తప్పలేదు...🕉️🙏
No comments:
Post a Comment