*ఈశ్వర తత్త్వము.. బ్రహ్మమొక్కటె...*
సకల చరాచర సృష్టికీ కారణం సత్యరూపుడు ఈశ్వరుడు అన్నది నిర్వివాదాంశం.
ఆ సృష్టి ఈశ్వరుడు కంటే వేరని అనడం అజ్ఞానం. అద్వైత జ్ఞానం ప్రకారమైనా, మన అనుభవం ప్రకారమైనా ఈ దృశ్యమాన ప్రపంచమే.
దీని వెనక ఉన్న పరబ్రహ్మమే అద్వితీయుడు, శాశ్వతుడు. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు అర్జునుడికి తన విభూతులను గురించి వివరించాడు.
సమస్త ప్రాణుల హృదయంలో ఉన్న ప్రత్యగాత్మను తానేనని ప్రాణుల ఆద్యంతాలు (సృష్టి, స్థితి, లయలు) తానేనని చెప్పాడు.
ప్రతి జీవిలోనూ దేహేంద్రియ మనో బుద్ధులకు సాక్షి ఆ ప్రత్యగాత్మ. దానినే జీవాత్మ అంటారు.
జీవాత్మే పరమాత్మ అన్నది అద్వైత బోధ. జీవుడు పరమాత్మ స్థానాన్ని పొందాలంటే జీవాత్మ స్థానాన్ని చేరితే చాలు. అంటే పంచ కోశాల నుంచి తనను వేరుచేసుకొని దేహేంద్రియ మనోబుద్ధి మొదలైన వాటికి సాక్షిగా ఉన్న ప్రత్యగాత్మను సాక్షాత్కరించుకోవాలి.
ఆ ప్రత్యగాత్మే పరమాత్మ. ఉపనిషత్తులన్నీ ఈ సత్యాన్నే బోధిస్తున్నాయి.
ప్రతి జీవిలోనూ ఈశ్వరుడు పరబ్రహ్మ రూపంలో నివసిస్తున్నాడు. కనుక ఏ జీవినీ అల్పుడనడానికి వీల్లేదు. ప్రతి ప్రాణిలోనూ ఈశ్వరుడు ఉన్నాడు అని దృఢ విశ్వాసంతో ఏ జీవినీ హింసించక పరోపకార పరాయణుడై ప్రవర్తించాలి.
పర ప్రాణి సేవను ఈశ్వరుని సేవగా భావించాలి. సర్వత్రా భగవత్ సన్నిధానంగా భావిస్తూ ఎటువంటి పాప కార్యం చేయకుండా ఉండాలి.
శంకర భగవత్పాదులు వివేక చూడామణిలో పరబ్రహ్మం గురించి విపులంగా వచించారు. వివేకి అయిన సాధకుడు బాహ్య వస్తు స్మరణ మాని ప్రత్యగాత్మను స్మరించాలి.
బాహ్య ప్రపంచం గురించి ఆలోచనలను తిరస్కరించడం ద్వారా మనసు ప్రసన్నతను పొందుతుంది.
ఈ ప్రసన్నత పరమాత్మ దర్శనానికి దారి చూపుతుంది. పరమాత్మ సాక్షాత్కారం జనన మరణ శ్రేణిని ఛేదిస్తుంది. ఎవరైతే అఖండ పరిపూర్ణ పరబ్రహ్మంలో లీనమై ఉంటాడో, అతడే ముక్తుడు అని అంటారు.
పరమాత్మ తత్వం అతి సూక్ష్మమైనది. స్థూల దృష్టితో, తర్కం, వాదోపవాదాలతో దాన్ని గ్రహించలేం. మహనీయులు చిత్త, వృత్తులను నిరోధించి మిక్కిలి నిర్మలం, సూక్ష్మం అయిన మనః స్థితిని పొంది పరమాత్మ తత్వానికి చేరువవుతారు.
భ్రాంతివల్ల తాడును పాము అనుకొంటాం. అదే రజ్జు సర్ప భ్రాంతి. వివేకం అనే దీపం వెలుగులో ఆ భ్రాంతి తొలగినప్పుడు రజ్జు నిజరూపం గోచరిస్తుంది.
అదేవిధంగా ఈ జగత్తు నిజస్వరూపం పరబ్రహ్మమేనని, వివేకం వల్ల తెలుసుకుంటాం.
మనకు కనిపించేది అద్వితీయ పరబ్రహ్మ తప్ప మరేదీ కాదు.
సత్తు (సత్యం), చిత్ (జ్ఞానం), ఆనందం... వీటికి సారభూతమైన పరబ్రహ్మం ఒక్కటే.
సర్వాంతర్యామి సర్వతోముఖం, అంటే సర్వత్రా సమంగా వ్యాపించినది. అది అనంతం. అన్ని విధాలా సమగ్రమైన పరబ్రహ్మమొక్కటే. అంటే ఈశ్వర తత్త్వమే..
ఆనంద మకరందంతో నిండిన ఈశ్వర తత్వాన్ని మాటల్లో చెప్పలేం. మనసుకు కూడా అందదు. సముద్రంలో కలిసిన వడగళ్లు సముద్రంలోనే కరిగిపోతాయి.
ఈశ్వర అంశ అయిన తన మనసు ఈశ్వరడులోనే లీనమై పోయిందంటారు శంకరులు.
No comments:
Post a Comment