Thursday, November 28, 2024

 శ్లో॥ యః శాస్త్ర విధి ముత్సృజ్య 
వర్తతే కామ కారతః।  
న స సిద్ధి మవాప్నోతి  
న సుఖం న పరాం గతిం॥

తా॥ ఎవరు శాస్త్రవిధిని విడిచిపెట్టి తన కోరికల ప్రకారం ప్రవర్తిస్తాడో అతడు కార్యసిద్ధిని పొందడు, సుఖాన్నీ పొందడు; పరమగతినీ పొందడు.

ఇంతవరకు భగవానుడు ఈ అధ్యాయంలో పట్టుకోవలసిన దైవీసంపదను, విడిచిపెట్టవలసిన ఆసురీ సంపదను గురించి చెప్పి, ఆసురీ సంపన్నుల ఆచారవ్యవహారాలు, వారి ఆలోచనలు, వారి మాటలు, వారి చర్యలు ఎలా ఉంటాయో వివరంగా తెలియజేశారు. చివరకు "ఆసురీ సంపద మొత్తాన్ని సంక్షిప్తం చేసి కామ, క్రోధ, లోభాలనే మూడు గుణాలుగా విభజించి, ఆ మూడింటిని వదలమని, అలా వదిలిన వారికే మోక్షప్రాప్తి అని కూడా తెలియజేశాడు". అయినా ఈ బోధ చాలదనుకున్నాడు భగవానుడు. ఎందువల్ల? మానవ జీవన ప్రయాణం ఎంతో క్లిష్టమైనది. ఎన్నో కర్మలు జరిగిపోతుంటాయి. అలా కర్మలు చేస్తూ ఉండటమే జీవనప్రయాణం. 

అయితే ఎలాంటి కర్మలు చేయాలి? ఎలాంటి కర్మలు చేయకూడదు? అనే సందేహం జీవితంలో అనేకసార్లు కలుగుతూనే ఉంటుంది. ప్రతి కర్మను ఇది చేయదగినదా? కాదా? దీనివల్ల మనం భగవంతుని వైపుకు ఒక అడుగు ముందుకు వేస్తున్నామా? వెనక్కు వేస్తున్నామా? అని ఆలోచించుకోవాలి. బ్రతికి ఉన్నంతకాలం కర్మలు చేస్తుండాలి. కర్మలు చేస్తున్నంతకాలం ఇలా ఆలోచించి చేయాల్సిందే. ఇలా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మనకు ఏదో ఒక ఆధారం కావాలి. అదే శాస్త్రం. కనుక శాస్త్రసహాయం తీసుకొని మనం మన కర్మలను కొనసాగించాలి. శాస్త్ర సహాయం లేకుండా స్వేఛ్చగా ప్రవర్తించేవాడు దీపం లేకుండా చీకటిలో నడిచేవాడే. 

*ఇంతకూ శాస్త్రం అంటే ఏమిటి ?*  

'శాసనాత్ - శంసనాత్ ఇతి శాస్త్రం' శాసించేదీ - శంసనం చేసేదీ శాస్త్రం. స్టేషన్ మాస్టరు చేతిలో పచ్చజెండా, ఎర్రజెండా రెండూ ఉంటాయి. అలాగే శాస్త్రం చేతిలో శాసనం - శంసనం అని రెండూ ఉన్నాయి.  

1) శాసనం...

శాసనం అంటే శాసించి చెప్పటం. విధినిషేధాల గురించి - అంటే ఇది చెయ్యాలి - ఇది చెయ్యకూడదు. ఇలా చెయ్యాలి - అలా చెయ్యకూడదు అని తేల్చిచెప్పటం శాసనం. ఇలా చేస్తే బాగుపడతావు. అలా చేస్తే చెడిపోతావు అని శాసించి చెప్పటం శాసనం.  

2) శంసనం...

శంసనం అంటే అవ్యక్తమైన విషయాలను వ్యక్తం చెయ్యటం. కర్మఫలాలు, వాసనలు, గతజన్మలు, రాబోయే జన్మలు - ఇవన్నీ అవ్యక్తం. అసలు పరమాత్మే అవ్యక్తం. అవ్యక్తమైన విషయాలను మనంతట మనం తెలుసుకోలేం. కనుక వాటిని వ్యక్తం  చేసి తెలియజెప్పేది శాస్త్రం. మనం మరచిపోయిన విషయాలను, మనకు తెలియని విషయాలను తెలియజెప్పటాన్నేశంసనం అన్నారు.
     

No comments:

Post a Comment