*తొలి_ఏకాదశి*
వ్యాసకర్త -
ఎర్రాప్రగడ రామకృష్ణగారు
సృష్టి విషయంలో బ్రహ్మదేవుడికి భూలోకంలోని అమ్మలు సాయం చేస్తారు. అయితే ఒకప్పుడు రాక్షస సంహారం విషయంలో విష్ణువుకు ఓ అమ్మాయి సహాయం చేసిన వైనాన్ని భవిష్యోత్తర పురాణం వివరించింది. ఆ అమ్మాయి పేరే ఏకాదశి!
అది కృతయుగం నాటి మాట. తాళజంఘుడి కొడుకు మురాసురుడు చాలా బలవంతుడు. దేవతలతో సహా జీవులందరినీ నిరంతరం వేధించడమే వాడి పని. దిక్కు తోచని పీడితులంతా చేరి, విష్ణువుకు మొరపెట్టుకున్నారు. విష్ణువు మురాసురుడితో యుద్ధానికి దిగాడు. ఏళ్ల తరబడి పోరాడినా... మహా వరబల సంపన్నుడైన మురుణ్ని ఆయన జయించలేక పోయాడు. అలసటతో సింహవతి అనే గుహలో దాగిన సమయంలో విష్ణువు సంకల్పంలోంచి ఏకాదశి అనే స్త్రీ ఆవిర్భవించింది. పుడుతూనే వీరావేశంతో దానవుడిపై దండెత్తి వాణ్ణి తుదముట్టించింది. మురాసుర సంహారంలో ఏకాదశి ప్రదర్శించిన సాహసానికి పరవశుడైన శ్రీహరి వరం కోరుకోమన్నాడు. 'ఎల్ల కాలం నీకు ప్రియమైనదానిగా ఉండాలి' అని కోరింది ఏకాదశి. విష్ణువు అంగీకరించాడు. అందుకే ఏకాదశికి 'హరిప్రియ' అనే పేరొచ్చింది. తన పేరుతో ఒక పుణ్యతిథి ఏర్పడాలని, ఆనాడు హరి సంకీర్తనంలో మునిగి, ఉపవాసం ఉండే భక్తులకు పుణ్యగతులు సిద్ధించాలన్న ఆమె కోరికనూ విష్ణువు మన్నించాడు. అది మనకు వరమైంది. ఏకాదశి రోజున ఉపవాస, హరి ఉపాసనాది ప్రత్యేక విధులు ఆచారాలుగా స్థిరపడ్డాయి
నిజానికి మురాసురుడు- మనలోని హింసాత్మక ప్రవృత్తికి, దురాచార ప్రీతికి, దుర్మార్గపు ఆలోచనలకు ప్రతీక. వాటిని అంతమొందించడానికే ఉపవాసాది విధులు నిర్వర్తించి ఏకాదశిని మనలోకి ఆవాహన చేసుకుంటాం. అరిని (మనలోని శత్రువులను) జయించేందుకు హరిని ఆశ్రయించేలా చేస్తోంది కాబట్టే - ఏకాదశిని హరివాసరం అన్నారు. ఏకాదశి వ్రత విధానాలను, ద్వాదశి పారణలను ఎందరో పాటిస్తున్నారు. అనారోగ్యం, వృద్ధాప్యం లేదా విధి విధానాలపట్ల అవగాహన లేకపోవడం... వంటి కారణాలతో దూరంగా ఉన్నవారూ కనీసం ఆనాడు శ్రీహరికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయాలి.
ఏకాదశి పూట ఓ చిన్నారి గుళ్ళో దేవుడి దగ్గర కూర్చొని ఏవేవో మాటలు వల్లించడం విని, 'నీకు మంత్రాలొచ్చా' అని అడిగాడు పూజారి. దానికా పాప 'నాకు అ ఆ ల నుంచి య ర ల వ ల దాకా వచ్చు అంది. ఏకాదశి అంటే 11 కదా! కాబట్టి నాకు వచ్చినవాటినే 11 సార్లు చెబుతూ - నీకిష్టమైన మంత్రాలో, శ్లోకాలో పద్యాలో నువ్వే రాసుకోమని దేవుడికి చెబుతున్నాను. ఆయనకు అన్నీ వచ్చంట! మా తాతయ్య చెప్పారు' అంది. ఉపవాసమనే మాటకు అదీ అర్థం. దైవానికి సమీపంగా ఉండటమే ఉపవాసం. ఆ పాప చేసిందదే. కాబట్టి ఆ పాప తప్పక 'హరిప్రియ' అవుతుందనేది ఏకాదశి సందేశం.
హరి సంకీర్తనలో నిమగ్నమై ఆకలిని మరచిపోవడమే అసలైన ఉపవాసంగా పెద్దలు నిర్దేశించారు, ఆచరించారు. ఏకాదశి విధానాన్ని లోకానికి ఉపదేశించారు. ఆ విధి విధానాలను అనుసరిస్తూ హరిచింతనలో నిమగ్నమయ్యే తిథి కాబట్టి ఏకాదశిని 'హరివాసరం'గా వ్యవహరించారు. వాస్తవానికి ఏకాదశినాటి ధ్యాన ఉపవాస ఉపాసనాదులు కేవలం ఆధ్యాత్మిక పరమైనవే కావు- అవి ఆరోగ్య శాస్త్రనిర్దేశాలు, పురాణాల్లోని మురాసురుడు మనలోని దురాచారాలకు ప్రతీక. అహంకారం రూపంలో, అరిషడ్వర్గాల ప్రేరణతో అఘాయిత్యాలకు తెగించేలా మనల్ని పురిగొల్పేది మనలోని మురాసురుడి అంశే. మనలోని ఆ రాక్షసుణ్ని సంహరించే ఆయుధాలే ఏకాదశి వ్రత నియమాలు. కృత త్రేత ద్వాపర యుగాల్లో బయట తిరిగిన రాక్షసులు కలియుగం నాటికి మనిషి మనసులో స్థిర నివాసం ఏర్పరచుకొన్నారు. ఏకాదశి పర్వదినాన మనం వర్ణింపవలసింది ఆహారాన్ని, నిర్జింపవలసింది అసురీ ప్రవృత్తిని. అందుకోసమే నెలకు రెండు చొప్పున ఏడాది పొడవునా ఇరవై నాలుగు పుణ్య ఏకాదశి తిథులు ఏర్పాటయ్యాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి_ఏకాదశిగా పిలుస్తారు. ఇది ఆధ్యాత్మిక గురువులు చాతుర్మాస్య ఆరంభ దినం. సూర్యున్ని శ్రీమహావిష్ణువుగా పూజించడం భారతీయ సంప్రదాయం. అంతవరకు ఉత్తర దిక్కున ఉండే సూర్యభగవానుడు దక్షిణ దిశగా పయనం ప్రారంభిస్తాడు కాబట్టి దీన్ని దక్షిణాయనంగా పరిగణిస్తారు. దక్షిణం వైపు వాలడాన్ని విష్ణువు నిద్రకు ఉపక్రమిస్తున్నట్లుగా సంకేతిస్తారు. అందుకే తొలి ఏకాదశికి *శయన_ఏకాదశి* గా పేరొచ్చింది. విష్ణువు శయన ఏకాదశినాడు శేషపాన్పుపై పవళించి, కార్తిక శుద్ధ ఏకాదశికి మేలుకొంటాడని పురాణ వచనం. ఈ కథను అనుసరించి పురాణాలు ప్రథమ ఏకాదశిని 'దేవశయని'గా పేర్కొన్నాయి. గదాధర విధానం దీన్ని 'హరిశయనం' అంది. పురాణ కథల్లోని ప్రతీకలను, అంతరార్థములను అర్థము చేసుకొని ఆచరించేవారందరికీ ఏకాదశి పరమ పుణ్యదినం.
తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు చెబుతారు. పేలాలు పితృ దేవతలకు ఎంతో ఇష్టమైనవి. అంతే కాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండగ రోజున గుర్తు చేసుకోవడం మన బాధ్యత. వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం ఆరోగ్యపరంగా అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది. అందువల్ల ఈ రోజున ఆలయాలలో, ఇళ్ళల్లో పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తోంది.
నీటిలో మునిగితే- అది స్నానం. నీలో మునిగితే - అది *ధ్యానం* ! ఆకలిదప్పులు తోచనంతగా హరినామ స్మరణంలో, ధ్యానంలో మునిగిపోవడమే తొలి ఏకాదశి నాటి కర్తవ్యం. అప్పుడది నిజమైన హరివాసరం!
తొలి *ఏకాదశి* పర్వదిన శుభాకాంక్షలు!
No comments:
Post a Comment