Sunday, July 6, 2025

 తీరిన ఋణం...

అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన కూతురిని చూస్తుంటే ఏంటో బాధగా ఉంటుంది నిర్మలకు. తను కూడా ఉద్యోగం చేసింది. కాని కూతురు అలా ఎండలో బైక్ మీద వెళ్ళి పని చేయడం తల్లి మనసుకు బాధ కలిగిస్తుంది.

“మమ్మీ! ఈరోజే సాలరీ వచ్చింది. నీకు ఇష్టమైనది కొనుక్కో” అంటూ పదివేల రూపాయలు తల్లి చేతిలో పెట్టబోయింది విద్య.

అదేంటో ఒక్కసారిగా ఉలిక్కిపడి దూరం జరిగింది. “నాకేమీ వద్దు. నీ అకౌంట్ లో ఉంచాల్సింది. ఎందుకు డ్రా చేసావు ?” మందలిస్తున్నట్లుగా అడిగింది.

“మొదటి నెల మొదటి జీతం మీరిద్దరూ బట్టలు కొనుక్కోండి. నా మాట కాదన వద్దు” అంటూ తల్లి చేతిలో పెట్టబోయింది.

ఇంక మాట వినదని “నా చేతికి ఇవ్వొద్దు పక్కన పెట్టు” అంటూ సోఫాలో పక్కన చూపించింది.

“అబ్బా! నీ చాదస్తం మొదలు పెట్టావా ? ఇంతలోకే నా ఋణం తీరదు. నువ్వు ఇంకా ఎంత బాకీ ఉన్నావో!” అంటూ నవ్వుతూ డబ్బులు తల్లి పక్కనే పెట్టి లోపలికి వెళ్ళింది.

పిల్లల చేతి నుండి డబ్బులు తీసుకోకూడదు అనే సిద్ధాంతం తనది. అంతలోనే ఋణం తీరదు. అంతా భగవంతుడి నిర్ణయం. మన చేతిలో ఏమీ ఉండదు. అన్నీ తెలుసు కాని ఇది మాత్రం బాగా పాటిస్తుంది.

నిర్మల, కాశీనాథ్ ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగాలు చేసి ఈ మధ్యనే రిటైర్ అయ్యారు.  కొడుకు వినయ్ ఎమ్ ఎస్ చెయ్యడానికి అమెరికా వెళ్ళి అక్కడే సెటిల్ అయ్యాడు.  అక్కడ అమెరికా అమ్మాయిని పెళ్ళిచేసుకుని ఫోటోలు మాత్రం పంపించాడు. 

ఈ మధ్య కొంతమంది అమెరికా వెళ్ళి సిటిజన్ షిప్ కోసం అక్కడి వాళ్ళనే పెళ్ళి చేసుకుంటున్నారు. అందులో తమ కొడుకు కూడా ఉండటం వారికి బాధగా ఉంది. మనం నేర్పిన విలువలు ఇవేనా ? లోపం ఎక్కడ ఉంది ? అదొక అంతు చిక్కని సమస్య.

ఇంజనీరింగ్ పూర్తి కాగానే కూతురు నీలిమకు మంచి ఉద్యోగం పూనేలో వచ్చింది.  కాని తల్లితండ్రులను ఒంటరిగా వదలలేక తాను వెళ్ళలేదు. ఆ తరువాత ఎన్నో ఉద్యోగాలకు దరఖాస్తులు పెట్టింది.  కాని రాలేదు.  అలా ఉద్యోగాల వేటలో ఉంటూ తల్లిదండ్రులను చూసుకుంటూ వారి దగ్గరే ఉంది.

చివరికి హైదరాబాద్ లోనే ఒక ఎమ్ ఎన్ సి లో ఉద్యోగం వచ్చింది.  ప్రతిరోజూ స్కూటీ మీద హైటెక్ సిటీకి వెళ్ళి రావడం.  కొంచెం కష్టమే అయినా తల్లితండ్రులను చూసుకుంటున్నాననే ఆనందం ఆమెను అన్నీ మరపించింది.

ఒకరోజు అమెరికా నుండి కొడుకు ఫోన్ చేసాడు. ఎంతైనా పేగు బంధం తెంచుకో లేక పోయింది “అమ్మా! నామీద కోపం వచ్చిందా ?” అని అడుగుతుంటే తల్లి మనసు కరిగిపోయింది.

“లేదు నాన్నా కోపం ఎందుకు. మీరు ఆనందంగా ఉండటమే మేము కోరుకునేది” అంటూ నవ్వుతూ చెప్పింది. అమెరికా వెళ్ళిన తరువాత ‘మమ్మీ’ కాస్త ‘అమ్మగా’ మారింది. ఇది కూడా మంచికే అనుకుంది.

“నీ కోడలు నెల తప్పింది అమ్మా. నువ్వూ నాన్నా, చెల్లి రావాలి.  చెల్లికి ఇక్కడ మ్యాచ్ కూడా చూసాను” తన బాధ్యత మర్చిపోలేదని గుర్తు చేసాడా అనుకుంది నిర్మల.

“కంగ్రాట్స్ వినయ్. అమ్మాయి ఆరోగ్యం ఎలా ఉంది ? విద్య ఉద్యోగంలో చేరింది. మేము డెలివరీ తరువాత వస్తాము” అన్నది.

“తనకు మన పద్ధతులు తెలియాలి. మీరు దగ్గరుండి చూసుకోవాలి. విద్య రిజైన్ చేస్తుంది నేను మాట్లాడుతాను. నాన్నగారికి నువ్వే చెప్పాలి” అంటూ ఇంకో మాట కూడా లేకుండా ఫోన్ పెట్టేసాడు.

ఆరోజే ఆవిషయం భర్తకు చెప్పి ఒప్పించింది. కూతురికి చెప్పలేదు. వినయ్ చెబుతాడని అనుకుంది.

కూతురు ఇంకా ఆఫీసునుండి రాలేదు. మెసేజ్ కూడా పెట్టలేదు. తలుపు తీసుకుని బాల్కనీలో కూర్చొని చూస్తోంది. తనకోసం అమ్మ కూడా ఇలాగే ఆలోచించేదా. ఏమో! అప్పుడు ఇవన్నీ ఆలోచించలేదు. ఆ రోజులు ఎంతో ఫాస్ట్ గా గడిచి పోయాయి. కొన్నింటికి సమాధానం తెలుసుకో కుండానే అమ్మ వదిలేసి వెళ్ళిపోయింది.

ఇంతలో కంగారుగా వస్తున్న భర్తను చూసింది “నిర్మలా! విద్య స్కూటీకి యాక్సిడెంట్ అయిందట.  తలకు దెబ్బ తగిలింది. హాస్పిటల్ లో చేర్చామని ఫోను చేసారు.  పద వెళ్దాము” అంటూ నిర్మలను తీసుకుని హాస్పిటల్ కు వెళ్ళాడు.

వీళ్ళకోసమే ఎదురు చూస్తున్న ఒకతను “నా పేరు విజయ్ అండీ. మీరేనా విద్య తల్లిదండ్రులు. నేనే హాస్పిటల్ లో చేర్చాను. తన ఫోన్ లో మీ నెంబరు చూసి ఫోన్ చేసాను. అప్పటికే తను మరణించింది.
తలకు గట్టిగా తగిలింది” అంటూ నిర్మలను గట్టిగా పట్టుకున్నాడు. అప్పటికే నిర్మలకు కళ్ళు తిరిగి పడిపోతుంటే పట్టుకున్నాడు.

కాసిని నీళ్ళు తీసుకుని ఆమె మొహంపై చల్లారు… కళ్ళు తెరిచి చూస్తూ కాశీనాథ్ ని గట్టిగా పట్టుకుని "ఋణం తీరిపోయిందండీ" అంటూ ఏడ్వసాగింది. 

ఇది నా స్వీయ రచన... ఎక్కడా ప్రచురించలేదు...

షామీర్ జానకీదేవి

No comments:

Post a Comment