Sunday, July 6, 2025

 పరిచయం అవసరం లేనటువంటి వ్యక్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. ఆధ్యాత్మిక వేత్తగా ప్రవచన చక్రవర్తిగా వారు అందరికి సుపరిచితమే. బ్రహ్మశ్రీ చాగంటి సుందరశివ రావు గారు (సుందరర్ నాయనార్ అవతారమేమో !), సుశీలమ్మ పుణ్య దంపతుల నోము పంట వీరు. ప్రవచన చక్రవర్తి, శారదా జ్ఞాన పుత్ర, ప్రవచన పరమేష్ఠి, అభినవ సూత మహాముని మొదలైన ఎన్నో బిరుదు సత్కారాలను అందుకున్న వీరి ధారణాశక్తి, గంగా ప్రవాహం వంటి ప్రవచన ధార చెప్పుకోదగినవి. ధర్మం మీద ఆసక్తి తో అష్టాదశ పురాణాలను, ఎన్నో పవిత్ర గ్రంథాలను, ఎందరో మాహానుబావుల చరిత్రలను అధ్యయనం చేసి తన దైన శైలి లో అతి సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతి లో శ్వాస ని మాటగ మార్చి ప్రవచనాలను అందిస్తూ భక్త జన హృదయాలను గెలుచుకుంటున్నారు. వారిలో నేనొకడిని. ఒక్క ముక్కలో చెప్పాలంటే వారు నాకు గురువు. గురువును మించిన దైవం లేదు, గురువును మించిన నామం లేదు, గురువును మించిన మంత్రం లేదు, గురువును మించిన పరమపదం లేదని కదా శ్రీ గురుదత్థ చరిత్ర పేర్కొన్నది. అటువంటి ఈ గురువు గారిని గురించిన ఈ వ్యాసం ద్వారా చంద్రునికో నూలు పోగులా…

“శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు” అని అంటారు. అలాగే గురువు గారు ఏ రోజున రామాయణం ప్రవచనము మొదలు పెట్టారో, ఆ రోజు నుండి ఎన్నో గొప్ప గొప్ప విషయాలను, ధర్మసూక్ష్మాలను వివరించి, ధర్మమును అనుష్టానం ద్వారా ఎలా సాధన చేసుకోవాలో, ప్రతి ఒక్కరూ ఎలా తరించాలో, ప్రతీ ఒక్కరు కూడా ధర్మాచరణ యందు అనురక్తి ఎలా ప్రయత్నపూర్వకంగా అలవాటుచేసుకోవాలో, ప్రతి వ్యక్తి కూడా ఈ సమాజంలో ఎంతటి ముఖ్య పాత్ర పోషిస్తారో తెలియచేసే ఎన్నో విషయాలను ప్రవచనాల ద్వారా అందించిన మరో వాల్మీకి, మరో వ్యాస భగవానుడు మన గురువు గారు.
నేను ఒకప్పుడు సాదారణ మనిషిలా కూడా ఉండేవాడిని కాదు. గురువు గారి అనుగ్రహం చేత మా తోటి స్నేహితుడి ద్వారా గురువు గారి రామాయణం విని నా ప్రవర్తన, నా ఆచరణ, నా భక్తి నన్ను నా కుటుంబాన్ని ఈ సమాజానికి ఒక మంచి వ్యక్తిగా మంచి కుటుంబంగా మార్చిన మన గురువు గారికి నేను ఆచరించే ధర్మాచరణమే గురుదక్షిణగా భావిస్తూ ప్రతి క్షణం సమర్పణ బుద్ధితో బతుకుతున్నాను. ఇలా ఎంతో మంది గురువు గారి ప్రచానాల ద్వారా ఎంతో పరివర్తన చెంది ధర్మము, ధర్మాచరణ, సత్యం, ఇంద్రియనిగ్రహం, శౌచము ఇలా ఎన్నో సనాతన ధర్మంలో నిక్షిప్తమైన సాధనలను పాటిస్తున్నారు.

కాశి నుండి రామేశ్వరం వరకు ఎన్ని క్షేత్రాలు ఉన్నాయో, ఎన్ని తీర్థాలు ఉన్నాయో, ఎందరో మహానిభావుల జీవిత చరిత్రలను అనుసంధానం చేసి నేటి సమాజం లో దేశభక్తి, మంచి అలవాట్లు, స్త్రీల పట్ల గౌరవ మర్యాదలతో కూడిన ప్రవర్తన, మొదలైన విషయాల పట్ల శ్రద్ద, భక్తి, పూజ్య భావన కలిగేటట్లు తన ప్రవచనాల ద్వారా గురువు గారు చేశారు.
మన గురువు గారు ఒక గొప్ప ఆధ్యాత్మిక వేత్త, మరోవైపు ఒక గొప్ప సమాజ సేవకుడు, సంఘ సంస్కర్త. పిల్లల కోసం వ్యక్తిత్వ వికాసం, మనగుడి, భారతీయం, గోసేవ, , చలివెంద్రాల నిర్వహణ ఇలా ఎన్నో కార్యక్రమాలను చేయటం ద్యేయంగా కలవారు. ఆ రోజున "చన్ద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి" (ఒక సన్యాసి రూపం లో ఉన్న పరమేశ్వరుడు) వారు ఎటువంటి కార్యక్రమాలు చేశారో అలాగే ఈ రోజు మన గురువు గారు నిరంతరం సామాజిక సేవ చేస్తున్నారు. ఒకానొక రోజు ఒక ప్రవచనం లో "నా భారతదేశం లో వృద్ధాశ్రమాలు లేకుండా చూడు పరమేశ్వ రా" అని ఒక తల్లి పడ్డ బాధ తానే పొందిన భావనగా ఆర్తితో బాధపడిన క్షణం అది విన్న ఎవ్వరైనా తల్లి తండ్రులను వృద్ధాశ్రమాల జోలికి వెళ్లకుండా చేశాయి. దీనిని బట్టి గురువు గారు తల్లి తండ్రుల పట్ల పిల్లలు ఎంత కర్తవ్య దృష్టి కోణం తో ఉండాలో మనకు తెలియచేశారు. మాతృవందనం ద్వారా తల్లి ప్రేమను, తండ్రి గొప్పతనాన్ని మనకి వివరించి చెప్పి కుటుంబ విలువల ప్రాధాన్యత ఈ సమాజానికి ఎంతో అవసరం అని మనకు గుర్తు చేశారు.

గురువు గారు ఏ రోజు ఏది చెప్పినా కూడా ఈ సమాజం కోసం మనం ఏం చేయగలుగుతాము ఎంత బాగా చేయగలుగుతాము అని ప్రతిక్షణం ఆలోచించి మన చేత చేపిస్తారు. "భారతీయం" అన్న ఒక కార్యక్రమం ద్వారా మరొక అబ్దుల్ కలాం గారిగా పిల్లలకు మంచి విషయాలు, సత్ప్రవర్తన నేర్పేరు. పిల్లలు ఎంత బాగా వృద్ధిలోకి వస్తే సమాజం అంత బాగా వృద్ధి లోకి వస్తుంది అని భావన చేస్తూ ఈ కార్యక్రమం ద్వారా మన తో ప్రత్యక్షంగా పంచుకునేలా ఏర్పాటు చేశారు. అలాగే ఒక సచిన్ టెండూల్కర్ యొక్క శ్రద్ద, విశ్వాసం, పట్టుదల, ఆయన పడ్డ కష్టం శ్రమ గురించి చెపుతూ కష్టం వస్తే ఒక బంతి నేలపై పడితే ఎలా పైకి లేస్తుందో అలా లేవాలి కానీ మట్టి ముద్దలా అంటుకుపోవద్దు అని, ఈ సమాజంలో కష్టానికి బయపడవద్దు అని, ఎన్నో సందర్భాలలో చెప్పారు. అలాగే మహాత్మ గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, బి ఆర్ అంబెడ్కర్, ఎం ఎస్ సుబ్బలక్ష్మి మొదలైన వారు ఈ దేశానికి చేసిన సేవలను మనకు కళ్ళకు కట్టినట్లు చూపించారు. అలాగే దేశం కోసం ప్రాణాలు అర్పించించిన సైనిక కుటుంబాలను మనం సన్మానించి సత్కరించుకోవాలి అని చెప్పి అందరిని సత్కరించిన అద్భుత కార్యక్రమం భారతీయం. అదే రోజు గురువు గారు భరతమాత అమ్మ వారి స్వరూపం అని అష్టోత్తర శత నామాలతో అంగరంగ వైభవంగా పూజ చేసిన కార్యక్రమం భారతదేశం లోని మొదటిది గా చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమం కొన్ని వేల మందిని ఒక మంచి దేశభక్తి దిశగా నడిపించింది. వేసవి కాలం వస్తే చాలు మజ్జిగ కేంద్రాలు, పళ్ళరసాల కేంద్రాలు, చలివేంద్రాలు ఏర్పాటు చేపిస్తారు. దేశ కాల పరిస్థితులు అన్నట్లు ఎప్పుడైనా ఇతరులకు సేవ చేయడమే జీవితమా అన్నట్లు బ్రతుకుతూ మనల్ని బ్రతికిస్తున్నారు మన గురువు గారు. కామాక్షి తల్లిని అవ్యాజకరుణామూర్తి అని లాలితాంబిక సహస్రం లో భావిస్తాం. అలాగే అమ్మ మనందరి మీద దయతో గురువు గారి రూపం లో దిగి వచ్చి, మన కోసం ఇన్ని కార్యక్రమాలు చేయిస్తుందా అని అనిపిస్తుంది.

గురువు గారు ఏ ప్రవచనం మొదలు పెడితే ఆ పాత్ర రూపం లో భగవంతుడు ఆవాహన అయి మనందరిని అనుగ్రహిస్తారు. ఒక రోజున పేద గర్భిణీ స్త్రీలు శ్రీమంతం (సీమంతోన్నయనం) చేసుకుంటారో చేసుకోరో అని వారందరిని ప్రేమతో వైద్యుల సూచనల ద్వారా అందరికి ఎంతో అద్భుతమైన ఆశీర్వాదం చేపించి వారికి ఎన్ని రకాలుగా సంతోషంగా ఉండగలుగుతారో అన్ని రకాలుగా సంతోషంగా ఉంచి వైద్య సేవలు అందించిన మరో వైద్య నారాయణుడు మన గురువు గారు. ఏ రోజు కూడా ఎవ్వరినీ కూడా కులము, గోత్రము అని ఎన్నడూ వేరు భావన లేకుండా. ఆ రోజున శంకరుల అద్వైత సంప్రదాయాన్ని ఎలా ఒక చండాలుడికి కూడా అర్థమయ్యేలా చేసారో, వారిలా అంతా ఒక్క పరబ్రహ్మమే అని ఆచరించి మనకు చూపించిన అపర శంకరులు మన గురువు గారు. ఎప్పుడు ఈ సమాజం మంచి కార్యక్రమాలతో ధర్మబద్ధంగా ఉండాలంటే రుక్మిణి కల్యాణం చదువుకోవాలి. ఎందుకంటే వివాహ వైభవం లో భాగంగా మంచి వరుడు, వధువు రావాలి అని గొప్ప సంకల్పం చేస్తుంటారు. అలాగే మన సంప్రదాయం లో భార్య భర్త ల దాంపత్యం ఒక గొప్ప బందంగా ఏ రోజు కూడా విడాకులు అన్న పదం మనకు తెలియదు అన్నట్లుగా సమాజానికి ఎప్పుడు చెప్తుంటారు. అలాగే మంచి సంతానం కోసం గంగావిర్భావఘట్టం, షణ్ముకోత్పత్తి రామాయణం నుండి చదువుకోవా లనీ, మన దేశ సంస్కృతి వైభవాల గురించి ఎవ్వరూ పడని ఆర్ద్రత మన గురువు గారిది. ఈ సమాజంలో అందరూ సంతోషంగా ఉండాలి ఎవ్వరూ బాధపడకూడదు అని నిరంతరం సర్వేజనా సుఖినోభవంతు అని ఆఖరుకు మూగ జీవులు కూడా మనతో సంతోషంగా ఉండాలని కోరుకునే అత్యంత ప్రేమైక మూర్తి మన గురువు గారు. గురువు గారి ప్రవచనాలు విని కొంతమంది తమ ఇంటి ముందు మూగ జీవులకు నీటి తొట్టెలు కడుతున్నారు. కుక్కలు, పందులు, పిల్లులు, పక్షులు అన్నీ కూడా అమ్మ వారి స్వరూపం కదా అని బావింపచేసి చెప్పిన గురువు గారి మాటలు. దీనిని బట్టి గురువు గారి మాటలు ఈ సమాజానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఒకప్పుడు "భరద్వాజ మహర్షి" వేదరాసిని నేర్చుకోవాలని బ్రహ్మ కోసం గొప్ప తపస్సు చేశారు. అప్పుడు బ్రహ్మ చెప్పిన సమాధానం - వేదములు పెద్ద కొండల రూపం లో కనిపించాయి ఒక పిడికెడు ఇసుక తీసుకొని నీవు చదివింది ఇంత అని చెప్పి పరమాత్మ ని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానము అని చెప్పి వెళ్లిపోయారు. అలా గురువు గారు మానసికంగా పరమాత్మ దర్శనాన్ని చూపిస్తూ అందరిని జ్ఞానము వైపు తీసుకెళ్తారు. పరోపకారమే నిజమైన సమాజ సేవ అని ఒక హనుమ లా నిరంతరం సమాజం కోసం పరితపించిపోతారు.

భాగవతం ప్రారంభం చేసిన తరువాత ఒకరోజు కుండపోత వర్షం కురిస్తే ఒక పెద్దాయన అడిగారు ఇలా వర్షం పడితే ఎవరు రారేమో అని, ఇటువంటి పరిస్థితుల్లో ప్రవచనం చేస్తారా అని. అప్పుడు గురువు గారి సమాధానం - ఆ రోజున శుకబ్రహ్మ పరీక్షిత్తు కి ఒక్కడికే 7 రాత్రులు 7 పగళ్లు చెప్పాడు. ఈ రోజున వర్షం కుండపోతగా పడనివ్వండి, పిడుగులే అడ్డురానివ్వండి, ఎవరు వచ్చినా రాకపోయినా అవసరమైతే నా భార్య కి ఒక్కదానికైన కూర్చోబెట్టి చెప్పేస్తా అన్నారు. అంటే ఆ మాట వెనుక ఎవరు ఏ కష్టం తో వస్తారో వారిని పరమాత్మ రక్షించి అందరిని సంతోషంగా చూడాలనే ఆర్తి గురువు గారిది. ఏ పండుగ వచ్చినా అందరితో కలిసి ఉత్సాహం తో కూడిన ఆటలతో అందరితో సరదా సరదాగా గడుపుతారు.

గురువు గారు అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం అందరిచేత శారదా నవరాత్రులను, వెంకటేశ్వర వైభవోత్సవాలను, గురుపౌర్ణమి, శంకర జయంతి, హనుమ జయంతి, వినాయక వైభవము, గోశాల సంరక్షణ ఇలా మొదలైన కార్యక్రమాలను చేపిస్తూ, ఎంతో మందిని చైతన్యపరుస్తూ, ఒక గొప్ప సమాజ నిర్మాణ కోసమే తన జీవితం అన్నట్లు ప్రయాణిస్తున్న మహోన్నత వ్యక్తి. ఈ రోజు ఒక శక్తిగా మారి అందరిని తనతో ప్రయానింపచేస్తూ ఏ ఒక్క రోజు కూడా స్వార్థం అన్న మాటకు తావు లేకుండా ఒక్క పైసా కానీ, బిరుదులు కానీ, సన్మానాలు కానీ ఏమి ఆశించకుండా తన శ్వాస ని మాట గ మార్చి ఇది భగవంతుడి ప్రసాదంగా భావన చేస్తూ మనందిరిని ధర్మ మార్గం లో తన వంతు కర్తవ్యంగా నడిపిస్తున్న మన గురువు గారికి నమస్కారం తప్ప ఇంకేమి చేయగలం మనం. ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు ఇంకా గురువు గారు మనతో చేయించాలని, గురువు గారి ధర్మప్రచారం ప్రవచనాల ద్వారా ప్రపంచం లో ఏ మూలన ఉన్నా కూడా అందరికి చేరేలా అందరూ ధర్మ మార్గం లో నడిపించేలా నిరంతరాయంగా నిర్విఘ్నంగా కొనసాగాలని, పరమేశ్వర స్వరూపులైన గురువు గారి పాదముల జంటకు నా శిరస్సు తాటిస్తూ నిరంతరం మన అందరి మనస్సులు గురువు గారి పాదముల వద్ద ఒక పుష్పము వలె ఉండిపోవాలని ప్రార్ధన చేస్తూ సమర్పిస్తున్న గురుదక్షిణ.

గురువు గారి మాటలను, ప్రచానాలను వినడం, ఆచరించడం తప్ప మిగతా విషయాలు ఏవీ కూడా తెలియని వాడిని. అచ్చు తప్పులు, అక్షరదోషాలు, వాక్య నిర్మాణ లోపాలు ఉండవచ్చుగాక. అయినా కూడా ఇది మీ పై నా కున్న పరమ భక్తితో రాసినది. తపులన్నీ నావి, ఒప్పులన్నీ మీవి. మీ చల్లని కరుణా కటాక్ష వీక్షణాలు సదా మాపై ప్రసారించాలని కోరుకుంటూ…

facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage 

instagram.com/pravachana_chakravarthy

No comments:

Post a Comment