Sunday, July 6, 2025

 *రామబాణం*
రచన: రాయపెద్ది అప్పాశేషశాస్త్రి, రిటైర్డ్ ప్రిన్సిపాల్, ఆదోని.

▪️రామబాణం అన్న పదబంధం మనమందరమూ తరచుగా ప్రయోగించే మాట. "తిరుగులేనిది, తప్పనిసరిగా విజయం సాధించేది" అన్న అర్థంతో ఈ మాట వాడుతూ ఉంటాము. పైగా ఒకటే బాణం, ఒకటే మాట అన్న ప్రయోగం కూడా తరచూ వాడబడే ఇంకొక ప్రయోగం. ఒకే మాట అన్న మాటను అర్థం చేసుకోవడం సులభమే. అరణ్యవాసానికి వెళ్లమని తండ్రి ఆజ్ఞగా వినిపించిన  కైకేయి మాట విన్న రాముడు ఆమెతో మాట్లాడుతూ
 "తత్ బ్రూహి వచనం దేవి రాజ్ఞో యద్ అభికాంక్షితం |
కరిష్యే ప్రతిజానే చ రామః ద్విర్ న అభిభాషతే ||
"అమ్మా! రాముడికి రెండు మాటలు చేతకావమ్మా, రాముడు ఎప్పుడూ ఒకే మాట చెప్తాడు. నువ్వు అడిగినది కష్టమైనా సుఖమైనా 
చేసేస్తాను " అనిఅంటాడు. కనుక రామునిది ఒకే మాట అన్న భావం సముచితమే. 
▪️కానీ  రాముడు ఒకటే బాణం ప్రయోగించాడా అని ఆలోచించితే "లేదు" అన్న సమాధానమే వస్తుంది.
▪️మేఘాలనుంచి కురిసే వర్షపు చినుకులలాగా, రాముడు అసంఖ్యాకంగా శరపరంపర కురిపించిన సందర్భాలు అనేకం కనిపిస్తాయి. జనస్థానంలో ఖరదూషణాదుల సంహారం సందర్భంగా కానీ, వేలాదిమంది రాక్షసులను సంహరించినప్పుడు కానీ రావణ లంకలో యుద్ధం చేసినప్పుడుగానీ రాముడు శరపరంపరగా బాణవర్షం కురిపించినట్లే వాల్మీకి మహర్షి వర్ణిస్తారు. అమ్ములపొదిలోనుంచి బాణాలు తీయడంకానీ, ఎక్కుపెట్టడం కానీ ఎప్పుడు జరిగిపోయాయో తెలియనంత వేగంగా వర్తులాకారంగా ధనుస్సంచాలనం చేస్తూ దశదిశలకూ బాణాలను కురిపిస్తాడు రాముడు. వర్షపు చినుకులనైనా లెక్క పెట్టగలమేమో గానీ, రాముడు శరపరంపరగా ప్రయోగించిన బాణాలను లెక్కపెట్టలేము.
▪️ *మరి అలాంటప్పుడు ఒకే బాణము అన్న పదప్రయోగాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పోనీ, అస్త్రాల జాబితాలో రామబాణం అన్నది ఏదైనా ఉన్నదా అంటే అదీ కనిపించదు*.
▪️ బ్రహ్మాస్త్రం, వైష్ణవాస్త్రం, పాశుపతాస్త్రం, ఐంద్రాస్త్రం, అగ్ని,నాగ, గరుడ, వాయు, వరుణ,సమ్మోహన, మానుష ఇలా అనేక అస్త్రాల పేర్లు కనిపిస్తాయిగానీ *రామబాణము అన్న పేరుగల అస్త్రము ఏదీ మనకు కనిపించదు*. మరి రామబాణము, లేక రామునిది ఒకే బాణము అన్న భావాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? 
▪️రామబాణము అంటే రాముడి పేరట ప్రయోగించ బడిన బాణము అన్న అర్థంతో పరిశీలిస్తే ఏమైనా పరిష్కారం లభిస్తుందేమో చూద్దాము.
▪️ఈ దృష్టితో చూస్తే మనకు రామాయణంలోని యుద్ధకాండము లో ఇంద్రజిత్ వధ సందర్భంలో చక్కని పరిష్కారం వెంటనే కనిపిస్తుంది.
▪️ ఇంద్రజిత్ వధ సందర్భంలో రామాయణం ఏమి చెబుతున్నదో చూద్దాం:
▪️లక్ష్మణుడు ఎన్ని అస్త్రాలని వేసినా ఇంద్రజిత్ సంహరింప బడకపోయేసరికి విభీషణుడు అన్నాడు " ఆ ఇంద్రజిత్ పౌరుషం పెరిగిపోతుంది. ఏదో ఒకటి చేసి ఆ ఇంద్రజిత్ ని సంహరించు " అన్నాడు.
▪️అప్పుడు లక్ష్మణుడు రెండు కోరలు కలిగిన సర్పంలాంటి ఒక బాణాన్ని తీసి, వింటినారికి తొడిగి ఈ మాట అంటాడు.
▪️"ధర్మాత్మా సత్య సంధశ్చ రామో దాశరథిర్యది
పౌరుషే చా అప్రతిద్వంద్వః తదైనం జహి రావణిమ్"

▪️"మా అన్న రాముడు ధర్మాత్ము డైతే, సత్యసంధుడైతే, దశరథుడి కొడుకే అయితే, పౌరుషంలో సాటి లేని వాడే అయితేనా ఎదురుగా నిలబడిన ప్రతిద్వంద్వి అయిన ఇంద్రజిత్తును ఈ బాణం వధించు గాక " అని బాణ ప్రయోగం చేశాడు. ▪️ఆ బాణం వెళ్ళి ఇంద్రజిత్ కంఠానికి తగలగానే ఆయన శిరస్సు శరీరం నుండి విడిపోయి కింద పడిపోయింది. ఇంద్రజిత్ మరణించాడు.
▪️ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే రాముని మీద ఆన పెట్టి ప్రయోగించిన బాణం రామబాణం.
▪️అది ఇంద్రుని కూడా జయించిన ఇంద్రజిత్తు లాంటి అజేయుడైన వీరాధివీరుణ్ణి క్షణంలో సంహరించింది. అదీ రామబాణ మహిమ. *అందుకే రామబాణము అన్న మాట వచ్చింది.*
 ఇంకో విషయం ఏమంటే, సాక్షాత్తు శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీత (10-31) శ్లోకం లోయిలా 👇అన్నాడు :

"పవనః పవతామస్మి *రామః శస్త్రభృతామహమ్*|
ఝషాణాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవీ"|| 10-31 ||

*భావం* :

"నేను పావనం చేసేవాళ్ళల్లో వాయువుని *శస్త్రధారులలో రాముడిని*, జలచరాలలో మొసలిని, నదులలో గంగని."
 ఇది గమనించగలరు.

హరిః ఓమ్.

No comments:

Post a Comment