Sunday, July 6, 2025

 *సంభాషణ* 

సింహానికైనా ఈగల బాధ తప్పదు అన్నట్టుగా ఎంతటివారయినా మాటపడక తప్పదు. 
అతనికీ మనకీ ఎలాంటి సంబంధం ఉండదు. అతనెవరో! మనమెవరో! అయినా అతనెవరో నాలుగు మాటలు విసిరేస్తాడు. మంచిమాటలు విసిరితే పర్వాలేదు, విసరడు. చెడుమాటల్నే విసురుతాడు. విసిరి, మనల్ని బాధిస్తాడు. బాధించడం మానవ నైజం. 
ఎప్పుడయితే వేట మానవ పరిణామానికి ఒకానొక కారణం అయిందో అప్పుడే బాధించడం కూడా మానవుడికి అలవాటయింది. పైగా వేట రాజవినోదం.    రాజులు పోయారు గాని, వేటాడడం అనూచానమయింది. 
ఈటె కంటే పదునైనది మాట. గుండెల్లో మాట నాటితే ఎలా ఉంటుందో...మహాభారతం ఉద్యోగ పర్వంలో విదురుడు చెబుతాడు. 

తనువున విరిగిన యలుగుల
ననువున బుచ్చంగవచ్చు నతి నిష్ఠురతన్
మనమున నాటిన మాటలు
విను మెన్ని
యుపాయములను వెడలునె యధిపా!

ధృతరాష్ట్రునికి చెప్పాడిలా విదురుడు. 
మహారాజా! విను! శరీరంలో నాటుకున్న బాణాలను ఉపాయంగా తీయవచ్చు. అక్కడి గాయాలనూ మాన్పవచ్చు గాని, మనసులో నాటుకున్న మాటలను ఎన్ని ఉపాయాలు ప్రయోగించినా బయటకు తీయడం కష్టం. ఆ గాయాలు మాన్పడం మరింత కష్టం. 

మాటలు నిఘంటువుల్లో మామూలుగా ఉంటాయి. శక్తిహీనంగా కనిపిస్తాయి. వాటిని సరిగా ఉపయోగించి చూడాలి. మారణాయుధాలు కంటే బలంగా ఉంటాయి.  

ఇనుము విరిగెనేని ఇనుమారు, ముమ్మారు
కాచి అతుకవచ్చు కమ్మరీడు
మనసు విరిగెనేని, మరి అతుకగ రాదు, 
విశ్వదాభిరామ వినురవేమ

ఇనుము విరిగితే, దానిని వేడి చేసి, రెండు మూడుసార్లు అతకవచ్చు గాని, మనసు విరిగితే అతకడం కష్టం అంటాడు వేమన.
ఇక్కడ ఓ విషయం చెప్పాలి. నిజాలు అనిపించే మాటలెప్పుడూ అందంగా ఉండవు. అందమైన మాటలేవీ నిజాలు కావు. అలాగే మంచి మాటలు ఎవరినీ ఒప్పించవు. ఒప్పించే మాటలేవీ మంచిమాటలు కావు అన్నది కూడా మనం గమనించాలి.   
మాట్లాడడం కంటే రాయడం చాలా సులభం. రాసేటప్పుడు ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలిగే అవకాశం ఉంటుంది. ఓర్పు ఉంటుంది. అదే మాట్లాడేటప్పుడు ఆ అవకాశాలు తక్కువగా ఉంటాయి. కోపం, ఆవేశాలు కట్టలు తెంచుకుంటుంటే మంచిచెడులు తెలుసుకోవడం కష్టం. 
ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి. మాటలే మూటలు, మాటలే కోటలు. మాటకు చాలా విలువ ఉంది. మంచిమాటకు విలువ ఇంకా ఎక్కువ. అయితే ఇది మంచిమాట. ఇది చెడుమాట. ఇది సరయిన మాట. ఇది చేతకాని మాట. ఇది అందమైన మాట. ఇది వికారమైన మాట అని మనుషులు నిర్ణయించరు. పరిస్థితులు నిర్ణయిస్తాయి. పరిస్థితుల్ని అర్థం చేసుకుని, మాట్లాడాలి. 
ఎదుటి వ్యక్తి మనసు తెలుసుకోవాలనుకుంటే... ముందుగా ఆ వ్యక్తి మాటలు వినాలి. విని, మనం జాలిగా, దయగా మాట్లాడాలి. అలా మాట్లాడడానికి ఖర్చేం కాదు. పైగా అనేక లాభాలు పొందవచ్చు. మంచికి సాయం చేసే మాటలు మాట్లాడాలి. చెడును నాశనం చేసే మాటలు మాట్లాడాలి. అంతేగాని ఏది పడితే అది మాట్లాడకూడదు. అలా మాట్లాడితే ఆ మాటలు, మాటల తోటలో కలుపు మొక్కలవుతాయి. 
*అమంత్రం*అక్షరం*నాస్తి* అంటారు పెద్దలు. అంటే...మంత్రం కాని అక్షరం లేదట! అందుకే అక్షరాలు పొదిగిన మాటలను జాగ్రత్తగా ఉపయోగించాలి. మాటలను జాగ్రత్తగా ఉపయోగిస్తే అవి, ఎక్స్ రే కిరణాల్లా దేనిలోంచి అయినా ఇట్టే   దూసుకుపోతాయి. కొండకచో చదివినా గుండెకు గుచ్చుకుంటాయి. అందుకే తగు జాగ్రత్తలు తీసుకుని మాటలను ప్రయోగించాలి. 
ఇంటికప్పు లోని రంధ్రం ఉత్తప్పుడు కనిపించకపోవచ్చు గాని, వానలో దాని బండారం బయటపడినట్టుగా మాట్లాడకుండా కూర్చుంటే...ఆ వ్యక్తి వ్యక్తిత్వం బయటపడదు. అప్పుడు ఆ వ్యక్తిని కదపాలి. కుదపాలి. మాట్లాడించాలి. మాట్లాడించి, వ్యక్తిత్వం ఏమిటో తెలుసుకోవాలి.   
చెప్పుల్లేని కాళ్లతో నడిచేవాడు, దారిలో ముళ్లను నాటకూడదు. మాట్లాడడం చేతగానివాడు, మాట్లాడకూడదు. లేనిపోని ప్రమాదాలు కొనితెచ్చుకోకూడదు. 
మరీ తియ్య (మంచిగా) ఉంటే మింగేస్తారు. మరీ చేదు (చెడుగా) ఉంటే ఉమ్మేస్తారు. రెంటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ మాట్లాడాలి.   
నిన్నూ, నీ మాటతీరూ చూసి భయపడేవాడు.... నీ వెనుక నిన్ను నానా మాటలూ అంటాడు. నీమీద కారుకూతలు కూస్తాడు. అందుకే ముందు వెనుకలు చూసుకుని మరీ మాట్లాడాలి. 
మన మాటలే మన ఉనికి. మాటలాడుతున్నామంటే...చూడచక్కని భవంతిని నిర్మిస్తున్నామా ? చితిమంటలు రేపుతున్నామా ? అన్నది ఎరిగి ఉండాలి. 
మాటకంటే మౌనం మహా భయంకరం. మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నవాణ్ణి ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదు. 
మనిషికి *నాలుక* ఒకటే! *చెవులు* రెండు. అంటే దీని అర్థం తక్కువగా మాట్లాడు. ఎక్కువగా విను అని. 
ఇటీవల కాలంలో *మాట* ’ గురించి నేను తెలుసుకున్నదిది. దీనిని మనసులో దాచుకోలేక  నీ ముందుంచాను. 
మల్లెపూలకీ, మంచి గంధానికీ ప్రచారం అక్కరలేదు. వాటి వాసనే వాటిని పదిమందీ కొనేట్టుగా చేస్తాయి. అలాగే మంచివాడికీ, మనస్వికీ మాటల ఊసే అక్కరలేదు. 
- అని నవ్వింది సునీత. 
 ఆమెకూ, నాకూ అరవై ఏళ్లు పైబడ్డాయి. ఇద్దరం పిల్లల పంచనే ఉంటున్నాం. సునీతకూ, ఆమె భర్తకూ గొడవలు వచ్చాయి. విడాకులు తీసుకునే వయసు కాదిది. అయినా విడాకులు తీసుకున్నది. 
ఏమైంది ? అనడిగితే...
మాటామాటా పెరిగి అని పగలబడి నవ్వింది. సలహా ఆముదం లాంటిది. ఇవ్వడం సులభం. తీసుకోవడమే కష్టం అని మరింత నవ్వింది. 
కొడుకు దగ్గరకు అప్పుడప్పుడూ వస్తుంది. అయితే కొడుకు కోసం కాదు, మనవల్ని చూడడానికి. 
భరణం బాగానే ముట్టింది. దానిని బ్యాంకులో వేసుకున్నది. వచ్చే వడ్డీమీద బతికేస్తున్నది. ఆమె ఆంధ్రలో ఉంటున్నది. కొడుకు తెలంగాణలో ఉంటున్నాడు. కొడుకు దగ్గరే తండ్రి కూడా ఉంటాడు. అయినా అతనితో సునీత మాట్లాడదట!
పార్కులో ఇటీవలే సునీత పరిచయం అయింది. పరిచయం అయి, కొద్దిరోజులే అయినా ఇద్దరం ఒకరిని ఒకరు ‘నువ్వు నువ్వు’ అనుకునేంతగా దగ్గరయ్యాం. ఆ దగ్గరితనంతోనే నా ఇష్టాలూ, నా కష్టాలూ ఆమెకు చెబుతూ బడాబడా వాగుతోంటే...వారం పదిరోజులుగా నన్ను గమనించి, నన్ను అర్థం చేసుకుని...మాటలు గురించి ఇంత పెద్ద లెక్చిరిచ్చింది సునీత. 
ఈరోజు నేను చెప్పిందంతా ఇవాళ నువ్వు గుండెల్లోకి తీసుకో! రేపు నీ బుద్ధి అర్థం చేసుకుంటుంది అన్నది. 
మాట్లాడడం దగ్గరనుంచి ఏ అలవాటయినా, అది మనం ఉపయోగించే చేతికర్రలా ఉండాలిగాని, ఆధారపడే ఊతకర్రలా ఉండకూడదు అన్నది. 
ఇన్ని విషయాలు తెలిసిన నువ్వు ఎందుకు విడాకులదాకా వెళ్లావు ? విడాకులు తీసుకున్న నువ్వు గెలిచినట్టా ? ఓడినట్టా ? అని అడిగితే సునీత ఏమన్నదో తెలుసా?
గెలుపు అంద విహీనతను మరుగున పరిచే అందమైన రంగు, అంతే! అన్నది. కళ్లు చెమర్చుకున్నది. చీకటి పడలేదు. వెళ్లాల్సిన టైం కాలేదు. అయినా బెంచీమీద నుంచి లేచి, పరుగు పరుగున నా దగ్గరనుంచీ, పార్కునుంచీ వెళ్లిపోయిందామె.  

ఒంటరిగా కూర్చున్నాన్నేను. ఒంటరివాణ్ణయిపోయాను. 
ఒంటరితనం మనకి మనం కలిగించుకుంటే...పర్వాలేదు. అందంగా ఉంటుంది. అదే ఇతరులు మనకి కలిగిస్తే...దానంత అంద వికారమైనదీ, అసహ్యకరమైనదీ మరొకటి ఉండదు. 

 - జగన్నాథశర్మ

(రవళి మాసపత్రిక సౌజన్యంతో)

No comments:

Post a Comment