Monday, August 25, 2025

 🙏🙏🙏🌼🌼🌼🌼🙏🙏🙏

*🌼 ఒక యోగి ఆత్మకథ-13 *


*(🖌️రచన :- శ్రీ పరమహంస యోగానంద)*


*🌼4-అధ్యాయం*
*🌼హిమాలయాలకు పారిపోతుంటే ఆటంకం*

“ఏదో ఒక చిన్న వంక పెట్టి నీ తరగతి గదిలోంచి బయటికి వచ్చెయ్యి. ఒక గుర్రబ్బండి కుదుర్చుకో. మా సందులోకి వచ్చేసి, మా ఇంట్లోవాళ్ళెవరి కంటా పడని చోట ఆగు!”

నాతోబాటు హిమాలయాలకి రావాలనుకున్న మా హైస్కూలు స్నేహితుడు– అమర్ మిత్తర్‌కి నే నిచ్చిన చివరి సూచన లివి. మేము పలాయనానికి నిర్ణయించుకున్నది ఆ మరుసటి రోజు. మా అన్నయ్య అనంతుడు నన్నొక కంట కనిపెడుతూ ఉండటం వల్ల ముందు జాగ్రత్తలు అవసరమయాయి.

ఇంటినుంచి పారిపోవాలన్న సంకల్పం నా మనస్సులో ఉన్నట్టు అనుమానించి, ఎలాగయినా సరే నా ప్రయత్నాలు చెడగొట్టాలని అతను గట్టిగా నిశ్చయించుకున్నాడు. రక్షరేకు నన్ను ఆధ్యాత్మికంగా ఉత్తేజపరుస్తూ నాలో గుప్తంగా పనిచేస్తూ ఉంది. దివ్యదర్శనాల్లో తరచు నాకు కనిపిస్తూండే గురుదేవుల ముఖాన్ని హిమాలయ మంచు ప్రదేశాల్లో ఎక్కడో ఒక చోట దర్శించగలనని నా ఆశ.

మా నాన్న గారు కలకత్తాకి శాశ్వతంగా బదిలీ అయిన తరవాత మా కుటుంబం అక్కడే ఉంటోంది. పితృస్వామికమైన భారతీయ ఆచారం ప్రకారం అనంతుడు తన భార్యను ఇంటికి తీసుకువచ్చాడు.

ఆ ఇంట్లో మిద్దెమీది ఒక చిన్న గదిలో నేను ప్రతి రోజూ ధ్యానం చేసుకుంటూ నా ​మనస్సును దైవాన్వేషణకు ఆయత్తం చేసుకుంటూ ఉండేవాణ్ణి. మరపురాని ఆ రోజు, అపశకునంలాంటి వానను వెంటబెట్టుకొని వచ్చింది. రోడ్డు మీద బండిచక్రాల చప్పుడు వినిపించింది.

అమర్ వచ్చేశాడని నేను, గబగబా ఒక దుప్పటీ, చెప్పుల జోడూ, రెండు అంగోస్త్రాలూ, ఒక జపమాలా, లాహిరీ మహాశయుల ఫొటో, భగవద్గీత పుస్తకమూ కలిపి మూటకట్టి మా మూడో అంతస్తు కిటికీలోంచి బయటికి విసిరేశాను. చకచకా మెట్లు దిగేసి మా మామయ్య పక్కనుంచే వెళ్ళిపోయాను. ఆయన గుమ్మం దగ్గర చేపలు కొంటున్నాడు.

“ఏమిటోయ్ సంబరం?” అంటూ నన్ను అనుమానంగా చూశాడు. నేను ఏ మాత్రం తొణక్కుండా ఆయనవేపు ఒక చిరునవ్వు విసిరి సందులోకి నడిచాను. నా మూట తీసుకొని, పన్నాగానికి కావలసినంత జాగ్రత్తా పాటిస్తూ, వెళ్ళి అమర్‌ని కలుసుకొన్నాను.

అక్కణ్ణించి మేము చాందినీ చౌక్ అనే బజారుకు వెళ్ళాం. ఇంగ్లీషువాళ్ళు వేసుకొనే బట్టలు కొనుక్కోడం కోసమని మేము, మావాళ్ళు సాదరు ఖర్చుల కిచ్చిన డబ్బులు కొన్ని నెలలపాటు కూడబెట్టుకొంటూ వచ్చాం. మా అన్నయ్య తెలివయినవాడు; చాలా సులువుగా, మా మీద డిటెక్టివ్ పని చెయ్యగలడు. ఈ సంగతి తెలిసి మేము, యూరోపియన్ వేషాలు వేసుకొని అతని కన్ను కప్పాలని అనుకొన్నాం.

స్టేషనకు వెళ్ళే దారిలో మేము, మా చుట్టం- జ్యోతిస్ ఘోష్ కోసం ఆగాం; అతన్ని నేను జతీన్‌దా అనే పిలిచేవాణ్ణి. అతను కొత్తగా ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినవాడు; హిమాలయాల్లో ఒక గురువును సంపాదించాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. మేము సిద్ధంగా ఉంచిన కొత్త సూటు సింగారించుకొన్నాడు అతను. మా ఎత్తు బాగా పారిందని మురిసి పోయాం! గాఢమైన ఒక ఉత్సాహం మా గుండెల్ని ఆవరించింది.

 ​“మనకింక కావలసినవల్లా కేన్వాసు బూట్లు,” అని అంటూ, అడుగున రబ్బరు వేసిన బూట్లు అమ్మకానికి పెట్టిన దుకాణానికి మా స్నేహితుల్ని తీసుకువెళ్ళాను. “తోలుతో చేసినవన్నీ జంతువుల్ని చంపగా తయారయినవే కనక, ఈ పవిత్ర యాత్రలో మన దగ్గర అలాటివి ఉండకూడదు.” అన్నాను, నా భగవద్గీతకున్న తోలు అట్టా, ఇంగ్లండులో తయారైన నా సోలా టోపీ (హెల్మెట్) కి ఉన్న తోలుపట్టీలు తీసి పారెయ్యడానికి నేను వీధిలో ఆగాను.

స్టేషనులో మేము బర్ధ్వాన్‌కు టిక్కెట్లు కొన్నాం. హిమాలయాల దిగువ కొండల్లో ఉన్న హరిద్వారం చేరడానికి అక్కడ రైలు మారాలని నిర్ణయించుకొన్నాం. మాలాగే ఆ రైలుబండి కూడా ఉరకడం మొదలు పెట్టగానే, నాలో ఉన్న ఆశాభావాలను స్నేహితులకు వెల్లడించాను.

“ఒక్కసారి ఊహించుకోండి! గురువులు మనకి దీక్ష ఇస్తారు. మనం సమాధిస్థితి అనుభవం పొందుతాం. అప్పుడు మన శరీరాలకు వచ్చే దివ్యమైన ఆకర్షణ శక్తి వల్ల హిమాలయాల్లో ఉండే క్రూర మృగాలు మన దగ్గిరికి సాధుజంతువుల్లా వస్తాయి. మన లాలింపుకోసం ఎదురుచూస్తూ పులులు, పెంపుడు పిల్లుల్లా ఉంటాయి!”

ఆలాంకారికంగానూ అక్షరాలా కూడా- రెండు విధాలా సమ్మోహ పరిచే విధంగా భావిస్తూ భవిష్యత్తును చిత్రిస్తూ నేనన్న ఈ మాటలకు, అమర్ పెదవులమీద ఉత్సాహంగా చిరునవ్వు విరిసింది. కాని జతీన్‌దా చూపు తప్పించాడు; వెనక్కి పరుగులు తీస్తున్న నేలవేపు, కిటికీలోంచి చూపు సారించాడు.

‘‘ఉన్న డబ్బు మూడు వాటాలు చెయ్యాలి.” చాలాసేపు మౌనంగా ఉన్న తరవాత జతీన్‌దా చేసిన సూచన ఇది. “బర్ద్వాన్‌కు మనం ఎవరి ​టిక్కెట్టు వాళ్ళే కొనుక్కోవాలి. అలాగయితే, మనమందరం కలిసి పారి పోతున్నామన్న సంగతి స్టేషనులో ఎవరూ కనిపెట్టలేరు,” అన్నాడు.



సశేషం:-

No comments:

Post a Comment