Saturday, August 23, 2025

 *అవతార్ మెహర్ బాబా - 57*
🪷

రచన: బి. రామకృష్ణయ్య


*ప్రధమాంధ్ర దేశ పర్యటన*


“మనం భగవంతుని నిజాయితీతో ప్రేమిస్తే ఆయనలో ఐక్యం అవుతాము. అక్రమం, మోసం, కపటం నేడు ప్రబలినట్లు ప్రపంచం లో ఇదివరకెప్పుడూ ప్రబలి యుండలేదు. మన ఆలోచనలలోను, మాటలలోను, చేతలలోను లేశమాత్రమైనా కపటం ప్రవేశిస్తే మనలోని పరమాత్మ మరుగున పడతాడు. కపటం వేయి పడగలు గల ఒక విషసర్పం వంటిది. ఈ రోజున సాధువుల ని పిలువబడే వారు అనేకులు ప్రజలను నిజాయితీగా ఉండమని చెప్తూనే పచ్చి మోసగాళ్ళుగా ప్రవర్తిస్తున్నారు. నా దివ్యా ధికారంతో చెప్తున్నాను. నేను మీఅందరిలో ఉన్నాను. భగవంతుని నిజాయితీగా ప్రేమిస్తే ఆయనని అన్ని చోట్ల చూడగలరు. భగవంతుని ప్రేమించలేక సాధుజీవితం గడపలేకపోతే పోనీయండి గాని అలాంటి జీవితం గడుపుతున్నట్లు నటించవద్దు. అలాంటి కపట సాధువుల కంటె నిజాయితీ పరులైన నిరీశ్వర వాదులే మేలు"

27.01.53 తేదీ రాత్రి సహచరులందరు బాబా ఆజ్ఞ ప్రకారం జాగరణ చేసారు.

28.01.53 తేదీ మండలి వారి నుండి ప్రేమికుల నుండి 56 మందిని ఎన్నుకొని ఎప్పుడూ ఉండే 56 మంది జీవన్ముక్తులకు (మజ్జూబ్ లకు) వారిని ప్రతినిధులుగా చేసి వారి పాదములంటి ప్రణమిల్లారు. ఈ క్రింది సందేశం ఇచ్చారు.

"మనమందరం ఒక్కటే. మనమందరం సమానమే. హెచ్చుతగ్గులు లేవు. అనంతమైన ఆ ఏక పదార్థమే అందరిలో ను అవిభాజ్యంగా ఉంది. అవికారము, అవినాశము, అనంతము, సత్యము ఐన ఆ ఏకైక పదార్థమునకు ప్రతినిధులుగా తలంచి మీకందరకు సామూహికంగాను వ్యక్తిగతంగాను ప్రణమిల్లుతున్నాను"

తర్వాత పశ్చాత్తాప ప్రార్థన చేయించి బాబా అందరినీ ఆశీర్వదించారు. బాబా ధర్మాజీ గూడెం, గుండు గొలుసు గ్రామాలు దర్శించి బెజవాడకు వెళ్ళి అక్కడి నుండి 28.01.53 తేదీన తిరుగు ప్రయాణమై వెళ్ళిపోయారు.

ఏలూరులో కట్టా సుబ్బారావు తోటలో వచ్చిన మొదటి రోజు ఒక చెట్టు క్రింద కొంతసేపు కూర్చున్నారు. ఆ స్థలంలోనే నేడు మెహెర్ నిలయం అనే బాబా ఆలయం నిర్మించారు. బాబా బస చేసిన కుటీరం కూడా నేటికీ అలాగే ఉంది.  

బాబా వాడిన వస్తువులను కూడా ఆ కుటీరంలో ప్రజల దర్శనార్ధం భద్రపర్చి ఉంచారు. ఈ ఆలయ స్థలంలో కూర్చున్న సందర్భంగా బాబా ఆ స్థలాన్ని 'మక్కా ఆఫ్ ది ఈస్ట్' అనగా ప్రాగ్దేశాలకు మక్కా వంటిద ని సూచించారు. ఈ ఆలయాన్ని25.12.88 తేదీన క్రిస్మస్ రోజున ప్రారంభించారు. బాబా ఆంధ్ర దేశ పర్యటనలో తనతో వచ్చిన ప్రేమికులను కార్యకర్తలను ప్రత్యేకంగా సమావేశపరచి ఆంధ్రాలో జరిగే కార్యక్రమాలపై వారి వారి అభిప్రాయాలను నిస్సందేహంగా వెలిబుచ్చమని అందరినీ కోరారు. అందరూ ఇతరులతో కలిసి సమైక్యతా భావంతో పనిచేయడానికి కృషి చేయాలని సూచించారు. 

బాబా కార్యక్రమాలను రాబోయే ఆంధ్ర పర్యటనలో నిర్వహించడానికి కె.డి.ఆర్. యమ్ (KDRM) గ్రూపును అనగా కుటుంబ శాస్త్రి, ధనపతిరావు నాయుడు, రంగారావు, మల్లికార్జునరావు అనబడే నలుగుర్ని నియమించారు.
📖

1953వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో బాబా డెహ్రాడూన్ మరియు ఋషీకేశ్ లకు వెళ్ళారు. మార్చి 23వ తేదీన డెహ్రాడూన్ లో కిషన్ సింగ్ ఇంటి వద్ద అనేకమందికి దర్శనమిచ్చారు. సిక్కులు చాలామంది బాబా దర్శనానికి వచ్చారు. వారిలో ఒకరితో గురునానక్ గీతాన్ని పాడించుకొని దానిలోని అంతరార్థాన్ని విశదీకరించారు. ఆ రోజు శ్రీరామనవమి. ఆ రోజు బాబా దర్శనం చేసుకున్నవారు బాబాయే రాముడుగా గతావతారంలో వచ్చారనే అనుభూతి పొంది విశ్వసించారు. బాబా కటాక్ష వీక్షణాల నుండి వెలువడే కాంతి పుంజాలకు ఆయన నుండి ప్రసరించే దివ్య ప్రేమ ప్రభావానికి ముగ్ధులై చలించి కన్నీటి ధారలతో ఆనందానుభూతిని పొంది తన్మయులైనారు. బాబా ఈ క్రింది సందేశం ఇచ్చారు.

"పెరిగి పెద్దవారమైన తర్వాత కూడా పసిపిల్లలవలె కాగలిగితే భగవంతుని 
ప్రేమించగలుగుతాము. ఎందుకంటే భగవంతుని ప్రేమించుటచే భగవంతునితో ఏకమైపోవాలన్న కోరిక తప్ప వేరే కోరిక లుండగూడదు. అందువలన మనం చిన్న పిల్లల వలె కాగలిగితే నిజాయితీతో భగవంతుని ప్రేమించగలం. భగవంతుని అన్ని చోట్ల చూడగలుగుతాము". 

జీవితమంటే ఏమిటని ఒక ప్రేమికుడు అడుగగా బాబా ఇలా చెప్పారు "జీవితం ఒక పెద్ద తమాషా. ఇది తెలుసుకొన్న వానిని ఇతరులు తెలుసుకోలేరు. వారి భ్రాంతిలో పడి ఉంటారు. ఈ సమస్య గురించి రాత్రింబవళ్ళు ఆలోచించినా ఆవగింజంత అయినా పరిష్కారం దొరకదు. ఎందుచేతనంటే ప్రజలు జీవితాన్ని గంభీరంగా తీసుకుంటారు. దేవుణ్ణి తేలికగా తీసుకుంటారు. కాని మనం దేవుణ్ణి గంభీరంగాను, జీవితాన్ని తేలికగా తీసుకోవాలి. అప్పుడు మనం ఎప్పుడూ ఒక్కలాగే ఉన్నామని, ఉంటామని తెలుసుకుంటాము. అసలు ఈ తమాషా సృష్టించింది మనమే ననే జ్ఞానం హేతువాదం వల్ల పొందలేము, అనుభవం మీదనే వస్తుంది"
📖

1953, జులై 10వ తేదీన బాబా మౌనం ప్రారంభించి 28 సంవత్సరాలు నిండాయి. ఆ రోజు ఉదయం 4 గంటల నుండి 5 గంటల వరకు హృదయపూర్వకంగా ముస్లింలు 'అల్లా హో అక్బర్' అని, హిందువులు 'పరబ్రహ్మ పరమాత్మ' అని, పార్శీలు 'అహురమజ్దా' అని, ఇరానీలు 'యజ్ దాన్' అని, క్రైస్తవులు 'గాడ్ ఆల్ మైటీ' అని వినబడేలాగా ఉచ్ఛరించాలని ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు మంచినీరు మాత్రం తీసుకొని 12 గంటల ఉపవాసం చేయాలని ఆదేశించారు. డెహ్రాడూన్ లో బాబా రాజ్ పూర్ రోడ్డులోని నెంబర్ 101 ఇంటిలో మకాము చేసారు. ఆ దగ్గరలోనే నేడు మెహెర్ ధామ్ గా పిలువబడే బాబా కేంద్రాన్ని నిర్మించారు. ప్రతి సంవత్సరం మార్చి 22, 23 తేదీలలో ఇక్కడ ప్రేమిక సహవాసం జరుగుతుంది.

ఆ రోజుల్లో బాబా డెహ్రాడూన్ లో నుండగా అక్టోబర్ మొదటి వారంలో అసాధారణ రీతిలో హిందువులు, మహమ్మదీయులు, క్రిస్టియన్లు, సిక్కులు, పార్శీలకు చెందిన ఆలయాల్లో రాత్రి 12 గంటలు ఒంటి గంట మధ్య కాలంలో వాటి అధికారుల నుండి అనుమతి పొంది దర్శించేవారు. 'అన్ని మతాలను ఒక దారంలోని పూసలవలె సన్నిహితం చేయడమే తన పని'' అని చెప్పిన బాబా తన పనిలోని భాగంగానే ఈ కార్యక్రమాలు నిర్వహించారని తోస్తుంది. 

18.11.53 తేదీన బాబా డెహ్రాడూన్ నుండి ఢిల్లీ వెళ్ళారు. ఆ మరునాడు ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆధ్వర్యంలో ఆడిన క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్ళారు. ఆట ప్రారంభమైన తర్వాత బాబా నెహ్రూ గురించి చెప్పుతూ 'అతడు చాలా ఉదాత్తమైన వ్యక్తి' యని క్రికెట్ ఆటగాని వలె తన పాత్రను చక్కగా పోషిస్తున్నా' డని చెప్పారు. బాబా తలపై హేట్, కళ్ళకు నల్లని అద్దాలు పెట్టుకొనియున్నా నెహ్రూ ఆయన వైపు పదేపదే చూడడం కన్పించింది. బాబా కూడా నెహ్రూ వైపే తన దృష్టి కేంద్రీకరించారు. తర్వాత ఆటలో అందరూ మునిగియుండగా 'నా పని అయిపోయింది, పదండి వెళదాము' అని బాబా బయలుదేరారు. బాబాతో పాటు అనుచరులందరూ లేచి ఆయనను అనుసరించారు. నెహ్రూ మరణానంతరం 27.05.64 తేదీన బాబా నెహ్రూ గురించి చెబుతూ 'నెహ్రూ మరణంతో భారతదేశం మొదటి ప్రధానమంత్రినే గాక రత్నంలాంటి మొదటి వ్యక్తిని కోల్పోయింది. మళ్ళీ అలాంటి వ్యక్తిని పొందడం కోసం 700 సంవత్సరాలు వేచియుండా' లని చెప్పారు.
🪷
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*

*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

No comments:

Post a Comment