Saturday, August 23, 2025

 _[-సత్యం శంకరమంచి గారి *"అమరావతి కథలు"* నుంచి ఈ కథ మీకోసం.... చదవండి]_ 
*°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°*
*_కథ:-"లేగదూడ చదువు"_*
*°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°*
*తెలతెల వారుతుండగా*

*ఇళ్ళల్లో చల్ల చిలికే వేళ. తల్లులు పిల్లల్ని 'లేవండ్రా' అంటుంటే వాళ్ళు దుప్పట్లు ఇంకా బిగదీసుకు పడుకుంటున్నారు. 'మా బాబు కదూ! మా తల్లి కదూ అంటూ తల్లులచేత మేలుకొలుపు పాడించుకుని చెంగున మంచాల మీంచి గెంతి దొడ్లలోకి పరుగెత్తుతున్నారు. ఇంత కచ్చికతో పళ్ళు తోముకుని తాటాకుతో నాలిగ్గీసుకుని మొహంమీద చెంబెడు నీళ్ళు కొట్టుకుని తుడుచుకోకుండానే చద్దన్నాలకి వంటింట్లో చేరుతున్నారు.*

*నాలుగేళ్ళు నిండని చిట్టి దొడ్లో పాలుతాగి చెంగనాలు పెడ్తున్న లేగదూడతో ఆడుకుంటోంది. దాంతోపాటే పరుగులు తీస్తూ దానిచేత వొళ్ళు నాకించుకుంటూ కిలకిల నవ్వుతోంది. "ఒసే చిట్టీ! అన్నం తినవా? బడికెళ్ళవా?" అని తల్లి కేకేస్తే "అన్నం వొద్దు .... బడికెళ్తా" అంటూ పరుగెత్తుకొచ్చింది చిట్టి. చిట్టినింకా బళ్ళో వెయ్యలేదు. అయినా అన్నయ్య సోముతోను, అక్క బాలతోను రోజూ బడికెళ్తుంది. "చద్దన్నం తింటే కడుపు చల్లబడుద్ది. కూర్చో" అంటూ చిట్టిని కూర్చోబెట్టింది తల్లి. బాల అప్పటికే అన్నం ముగించి పుస్తకాలు సర్దుకుంటోంది. సోముకి చదువుకంటే తిండిధ్యాసే ఎక్కువ. అన్నం ముందునించి ఎంతసేపటికీ లేవటంలేదు. బాల విసుక్కుంటూ “తింటూ కూర్చో. ఒక్కో క్లాసు రెండేళ్ళు చదువుదుగాని" అంది. సోము కిందటేడు తప్పాడు.*

*గడ్డపెరుగు రెండోసారి కలుపుతూ సోము అన్నాడు "అక్కా! కడుపు నిండా తింటేగాని చదువు వొంటబట్ట దన్నారే పంతులుగారు. అయినా ఆడదానికి నీకెందుకే చదువు." ఆడపిల్లకి చదువక్కర్లేదు సరే.. తనకి చదువెందుకొద్దో చెప్పడు సోము.*

*" బండవెధవ".. తిట్టింది బాల.*

*పక్కింట్లో గోపీ, వెన్నముద్ద వేస్తేనేగాని తిననని మారాం చేస్తున్నాడు. అవతలింట్లో రాము ఆవకాయ ముక్కకోసం అల్లరి చేస్తున్నాడు. ఆపై ఇంట్లో వెంకు, వాళ్ళమ్మ చూడకుండా నేతిగిన్నె సాంతం కంచంలో బోర్లించుకుంటున్నాడు. ఆ చివరింట్లో శేషు, పెరుగొద్దు నాకు పులిమజ్జిగే కావాలని పట్టుబడ్తోంది. ఇలా అందరిళ్ళలో చద్దన్నాల రంగం ముగిశాక చక్రకడ్డీలు, జీళ్ళు కొనుక్కోటానికి తల్లుల దగ్గర డబ్బులు తీసుకొని వీధిలో కొచ్చారు. “ఒరే వెంకూ, సీతా, రమా, పొట్టీ!" ఇంటింటికీ వెళ్ళి నేస్తాల్ని పిలుచుకొని పాతికమందికి పైగా పిల్లలు బడికి బయలుదేరారు. జారిపోతున్న బొందు లాగులు పైకి లాక్కుంటూ పుస్తకాల సంచులు ఒక బుజంమీంచి ఒక బుజంమీదికి మార్చుకుంటూ ముందుకు నడుస్తున్నారు.*

*సోము "అక్కరకురాని చుట్టము ..... అక్కరకు ....." పద్యం మననం చేసుకుంటున్నాడు. పద్యం అప్పజెప్పకబోతే పంతులు గోడకుర్చీ వేయిస్తాడు. "అక్కరకురాని.... ...." గింజుకుంటున్నాడు. “ఒరేయ్ కిట్టి” అక్కరకురాని చుట్టము .... తర్వాత చెప్పరా” అని బతిమిలాడాడు. కిట్టిగాడు "అమ్మ ఆశ! నిన్న జీళ్ళు కొనుక్కుని నాకు పెట్టావేం! నేనేం చెప్పను" అన్నాడు.*

*"ఇవ్వాళ పెడ్తాగా" అన్నాడు సోము.*

*"ఒట్టు."*

*"ఒట్టు" చేతిలో చెయ్యివేసి గిచ్చాడు సోము.*

*వీధి చివర సాలె రంగమ్మ నూలు ఆరేసింది. ఈ పిల్లమూక రావటం చూసి కర్ర జళిపిస్తూ 'ఒహోయ్' అంటూ వచ్చింది. పిల్లలకి ఆ నూలు తాకుతూ : పోవటం ఓ సరదా. రంగమ్మ 'ఓహోయ్' అనగానే పిల్లలంతా 'ఒహోయ్' అని అరుస్తూ ముందుకు పరిగెత్తారు. ఆ పరుగెత్తుతున్న పిల్లల వెనక చిట్టి. చిట్టిని బళ్ళో వెయ్యకపోయినా సంచిమాత్రం మహాబరువు. అందులో వాళ్ళన్నయ్య చదివేసిన పుస్తకాలు, విరిగిన పలకలు, బెచ్చాలు, లక్కపిడతలు, సుద్దముక్కలు, అచ్చనగాయలు, చిన్న బొట్టుపెట్టె అందులో కొయ్య బొమ్మలు, వాటి చీరలు అన్నీ ఉన్నాయి. ఆ సంచీ బరువు మోయలేక ఒక పక్కకు వాలిపోయి మాటిమాటికీ బుజం మార్చుకుంటూ ఆయాసంగా పరుగెత్తుతోంది. అందరితోటీ. మొదటి ప్రాకారం గేటు దగ్గర పిల్లలంతా ఆగారు. ఆ గేటు తలుపు ద్వారంలో గుర్రపు స్వారీలా కొందరు కూర్చోటం, మిగతావాళ్ళు గేటుని అటూ ఇటూ తిప్పటం. ఆ ఆట కొంతసేపు ఆడి గాలిగోపురం దగ్గర కొచ్చారు. మంటపంలో గంగన్నతాత బడికెళ్ళే పిల్లకోసమే ఎదురుచూస్తున్నాడు. పొద్దున్నే స్నానంచేసి విభూతి పెట్టుకుని తంబూరా మీటుకుంటూ ఈ చిన్నారి దేవుళ్ళని పలకరించి గానీ గుళ్ళోకి వెళ్ళడు. ఒక్కొక్కరే గంగన్నతాతతో "బడికెల్తన్నాం తాతా" అని చెప్తుంటే 'మా నాయనే', 'మా తండ్రీ' అంటూ అందరికీ విభూతి పెడ్తున్నాడు. అందరి కంటే ఆఖర్న చిట్టి 'నేనూ బలికెల్తున్నా' అంటూ గంగన్నతాత దగ్గర కొచ్చింది. 'మా తల్లే' అంటూ చిట్టిని దగ్గరికి తీసుకుని ముద్దుపెట్టుకున్నాడు. వెండి తీగల్లాంటి గంగన్న మీసం పాలబుగ్గల చిట్టికి గిలిగింతలు పెట్టగా విడిపించుకుని పరుగు పరుగున వెళ్ళి మిగతా వాళ్ళని కలిసింది.*

*బళ్ళో సిరిచుక్క పెట్టించుకుని ఎవరి క్లాసుల్లో వాళ్ళు కూర్చున్నారు, పంతులు చూడకుండా ఇంటినుంచి తెచ్చుకున్న మరమరాలు పాఠం మధ్య నములుతున్నారు.*

*పది గంటలయింది. పశువులు బీళ్ళకి, లంకలకి మేతకెడుతున్నాయి. పెద్ద బజారునిండా పశువులు. చిట్టి బజారువైపే చూస్తోంది. మళ్ళీ మళ్ళీ చూస్తోంది. ఆ వచ్చింది లేగదూడ లేగదూడ సరాసరి వచ్చి బడిముందు నుంచుంది. పాలేరు అదిలించినా ముందుకు సాగదు. లేగదూడని చూడగానే చిట్టి చేతనున్న పలకతో బజార్లోకి పరుగెత్తుకొచ్చింది.*

*లేగదూడ చిట్టి చేతులూ, వొళ్ళూ నాకుతుంటే చిట్టి తన పలకమీద పిచ్చి గీతలు చూపిస్తూ లేగదూడకి చెప్తోంది. "ఇది అ... ఆ.. ఇవి వొంట్లు ... ఒకటి ... రెండు. ఇది నీ బొమ్మ.... అది నా బొమ్మ. ఇది అమ్మ బొమ్మ... సాయంత్రం తొరగా రా” అంటూ చిట్టి ఏదో చెప్తుంటే లేగదూడ చూసి చూసి సర్ సర్ మని పలక్కి ఇటుపక్కా అటుపక్కా నాకేసి చెంగున తల్లిని కలుసుకోటానికి పరుగు పెట్టింది.*

*బళ్ళో వెయ్యని పసిపాపకంటె నోరులేని లేగదూడకంటె చాలా చదువుకొన్నాం మనం. కానీ......🤔🙏*
*_{ఇదండీ కథ... ఎలా ఉందో మీరే చెప్పాలి: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు, ఆత్మకూరు పట్టణం, నెల్లూరు జిల్లా🙏}_*
*°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°*

No comments:

Post a Comment