*అవతార్ మెహర్ బాబా - 56*
🪷
రచన: బి. రామకృష్ణయ్య
*ప్రధమాంధ్ర దేశ పర్యటన*
16.01.1953 తేదీన మద్రాసు నుండి బయలుదేరి బాబా ఆంధ్రదేశం పర్యటనకు వచ్చారు. మద్రాసు నుండి కాకినాడ ప్యాసింజర్ రైల్లో ప్రయాణించి సాయంత్రం విజయవాడ స్టేషన్ లో దిగి ఆ రాత్రి స్టేషన్ లోనే బసచేసి ఆ మరునాడు రైలులో తాడేపల్లి గూడెం వెళ్ళారు. బాబా ఆదేశానుసారం బాబాతో ప్రయాణించే ప్రేమికులు బాబా బృందంతో విజయవాడ లో చేరారు. అందరూ 59 మంది బృందం బాబాతో పర్యటించారు. 17.01.53 తేదీన తాడేపల్లి గూడెం స్టేషన్ లో డా. ధనపతి రావు, ఇతర ప్రేమికులు పుర ప్రముఖులు బాబాకు ఘన స్వాగతం ఇచ్చారు. నింగి నుండి దేవతలు పుష్ప వృష్టి కురిపించారా అనన్నట్లుగా ఒక వానజల్లు కురిసింది. బాబా ప్రభుత్వ రహదారి బంగళాలో బస చేసారు.
18.01.53 తేదీన బాబా ధనపతి రావు ఇంటిలో ఏడుగురు బీదలకు కాళ్ళు కడిగి వారి పాదాలపై తన శిరస్సు నానించి ఒక్కొక్కరికి రూ.51/- దక్షిణగా ఇచ్చారు.
అలాగే 16 సంవత్సరాల వయస్సు గల మురళీధర్ రావు అనే ఒక బాలునికి పాదాలు కడిగి రూ.14/- దక్షిణగా ఇచ్చారు. వి.వి. నారాయణ రావు గారి అబ్బాయి జగత్ కుమార్ కి కూడా ఇచ్చారు. 'నమో మెహెర్ బాబా' అనే గీతాన్ని బాల గోపాల భాస్కరరాజు బాబా ముందు గానం చేసారు. ఆయన అన్న గారైన రామభద్ర రాజు గారు గీతాన్ని వ్రాసారు. ఆ కీర్తన విని బాబా చాలా ఆనందించారు. ఆంధ్రలో సర్వసాధారణం గా ఈ గీతంతో భజనలు ప్రారంభం చేయడం పరిపాటి అయ్యింది. బాబా ధనపతిరావు ఇంటినుండి 50 గజాల దూరం నడిచి ఒక ఎరుకలవారి ఇంటి ముందు 2 నిమిషాలు కూర్చున్నారు. వారి అదృష్టమేమో తెలియదు గదా!
19.01.53 తేదీన ఉదయం డా. ధనపతి రావు ఇంటిలో విశ్రమించారు. పిదప ప్రజా దర్శనం కోసం వేసిన పందిరిలో దర్శనం ఇచ్చారు. ఆ రోజు దాదాపు 30వేల మంది బాబా దర్శనం చేసుకున్నారు. యోగి శుద్ధానంద భారతి మద్రాసు నుండి వచ్చి బాబా దర్శనం చేసుకున్నారు. రాత్రి భజన గాత్ర కచేరీలు జరిగాయి. బాబా సప్త భూమికలు మొదలగు విషయాలపై ప్రవచనాలిచ్చారు. చిత్ర లేఖనం, కవిత్వం, గానం ఇత్యాది కళలతో బాటు ఆధ్యాత్మిక చింతన కలిగి బాబా ప్రేమికుడైన బాల గోపాల భాస్కరరాజును బాబా చాలా అభినందించారు.
20.01.53 తేదీన బాబా ప్రేమికుల ఇళ్ళకు వెళ్ళారు. తాడేపల్లిగూడెంలో బస చేసిన ఆ రోజుల్లో ఒక రోజు ఉదయం 4 గంటలకు బాబా ఆకస్మికంగా ఈరుచ్ ని పిలిచి స్నానానికి వేడి నీళ్ళు కావాలని అడిగారు. ఆ సమయంలో బాబాకు వేడి నీళ్ళు ఎలా ఏర్పాటు చేయాలా అని ప్రయాస పడుతున్న ఈరుచ్ కి గేటు ఎదుట ఎవరో వ్యక్తి కనబడ్డాడు. వెళ్ళి విచారించగా అతడు బందేలి బాపిరాజని తేలింది. ఎవరూ అడగకుండానే అతడు అంత ఉదయమే లేచి వేడి నీళ్ళు కాచి బిందెలో పోసుకొని తలపై పెట్టుకొని వచ్చాడు. ఈరుచ్ కి చిత్రంగా తోచింది. అయినా బాబా అనుమతి లేకుండా ఎవ్వరినీ రానివ్వకూడదు. కావున ఈరుచ్ వెళ్ళి బాబాకు విషయం తెలియజేసాడు. బాబా అనుమతి ఇచ్చారు. అతనిని లోపలికి తీసుకొని వెళ్ళి అతను తెచ్చిన వేడినీళ్ళ తో బాబా స్నానానికి ఏర్పాటు చేసాడు ఈరుచ్. ఎన్నడూ లేని విధంగా ఆకస్మికం గా వేడి నీళ్ళు అడగటం, అదే సమయం కి బాపిరాజు మనస్సులో వేడినీళ్ళు బాబాకు తీసుకొని వెళ్ళాలనే ఆలోచన కలగడం జగన్నాటక సూత్రధారి, ఆర్తత్రాణపరాయ ణుడైన బాబాకే చెందింది. ఈ రకంగా బాపి రాజుతో సేవ చేయించుకొని అతన్ని బాబా ఏర్పాటు చేసిన ట్రస్ట్ లో శాశ్వత లబ్ధి దారుడిగా నమోదు చేసారు. జీవనోపాధి లేక అవస్థ పడే బాపిరాజుగారికి మిగతా జీవితకాలం ట్రస్ట్ నుండి వచ్చే డబ్బుతో జీవితం సాఫీగా సాగింది. అతనెప్పుడు తలపై గులాబీ రంగు టోపీ ధరించేవాడు. నీ తల మొండెం వేరైనా ఎప్పుడూ ఆ టోపిని ధరించాలని బాబా ఆదేశించారు.
21.01.53 తేదీన బాబా పెంటపాడు, పిప్పర మరియు నిడదవోలు గ్రామాలకు వెళ్ళి దర్శనమిచ్చారు. పిప్పరలో బాబా సందేశము ఇస్తూ "భగవంతుని నిజాయితీ తో ప్రేమిస్తే మన సందేహాలు, చింతలు అన్నీ అదృశ్యమైపోతాయి, ప్రేమ ద్వారా నన్ను ప్రతివారిలో చూడగల్గుటకు ఆశీస్సు లిస్తున్నా"నని బాబా చెప్పారు.
పెనుగొండలో శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఇచ్చిన దర్శనంలో 800 మంది బాబా దర్శనం చేసుకున్నారు. 22.01.53 తేదీన బాబా నిడదవోలు వెళ్ళారు. దారిలో కాపవరం వద్ద కారు ఆపి సుబ్బయ్య అనే సాధువు సమర్పించిన పళ్ళు స్వీకరించారు. నిడదవోలులో బోర్డు ఉన్నత పాఠశాల ఆవరణలో వేసిన పందిట్లో ప్రజాదర్శనం ఇచ్చారు. అనేక వేల మంది బాబా దర్శనం చేసుకున్నారు. బాబా వారికి ప్రసాదం పంచిపెట్టారు. నిడదవోలులో బాబా తాడిమేటి కుటుంబ శాస్త్రి, ఇవటూరి చిన మల్లికార్జునరావు గార్ల ఇళ్ళకు వెళ్లారు. వారి కుటుంబ సభ్యుల నాశీర్వదించారు. నిడదవోలు నుండి కొవ్వూరు వెళ్ళారు. కొవ్వూరులో బాబా రామలింగేశ్వర రావు, న్యాయవాది కుమార్తె వివాహానికి వెళ్ళి వధూవరుల నాశీర్వదించారు. కోడూరి కృష్ణారావు ఇంటికి వెళ్లి వారి ఆతిధ్యం స్వీకరించారు.
22.01.53 తేదీన సాయంత్రం కొవ్వూరులో ఉన్నత పాఠశాల ఆవరణలో వేసిన పందిట్లో అనేక వేలమందికి బాబా దర్శన మిచ్చారు. సాయంత్రం రాజమండ్రికి వెళ్ళి నవభారత గురుకులంలో క్రొత్తగా నిర్మించిన కార్యనిర్వాహక భవనాలకు ప్రారంభోత్సవం చేసారు. రాజమండ్రికి వెళ్ళే దారిలో గోదావరి నది వద్ద కారు ఆపి గోదావరి జలాల్లో తన కాళ్ళు చేతులు ముంచి ఆ జలాలను పునీతం చేసారు. ఆ రాత్రి గురుకులంలో బస చేసారు.
23.01.53 తేదీన గురుకులంలో దర్శనమిచ్చారు. ఆ రోజే తెలంగాణాలో బాబా నామాన్ని విసృతంగా వెదజల్లి బాబా ప్రేమికులకు ఆప్తుడైన రెంటాల సూర్యనారాయణమూర్తి బాబా దర్శనం చేసుకున్నారు. బాబా ఇచ్చిన అరటి పండు
ప్రసాదంగా స్వీకరించారు. ఆనందాశ్రువులు
ప్రవహించగా బాబా శిరస్సు వెనకాల ప్రకాశించే కాంతి చక్రాన్ని చూచి తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుకు రాగా మొదటి సారి దర్శనంలోనే బాబా దివ్యత్వంలోని అచంచలమైన విశ్వాస మేర్పడింది. నిజామాబాద్ కేంద్రంగా తెలంగాణాలో అనేకానేక బాబా కేంద్రాలను స్థాపించి ప్రేమికులను తయారుచేసిన మూర్తిగారు నిస్వార్థ ప్రేమికులు.
23.01.53 తేదీన బాబా ప్రత్యేక రైలు పెట్టెలో మధ్యాహ్నం రాజమండ్రి నుండి ఏలూరు వెళ్ళారు. అన్ని స్టేషన్లలోను ప్రజలు తండోప తండాలుగా వచ్చి బాబా దర్శనం చేసుకున్నారు. ఏలూరు స్టేషన్ ఇసుక వేస్తే రాలనంత జనంతో నిండి పోయింది. వై. వి. రంగారావు, ఆర్. వి. రామారావు, పంగిడి గూడెం రాజుగారు ఎంతోమంది ప్రేమికులు బాబాకు స్టేషన్ లో స్వాగతం పలికారు. ఏలూరులో కట్టా సుబ్బారావు తోటలో ప్రకృతి సౌందర్యంతో నిండిన మామిడితోపులోని చెట్ల నీడలోని ఇళ్ళలో బాబా బస ఏర్పాటు చేసారు. కట్టా సుబ్బారావు బాబాకు, మండలి వారికి, బాబా ప్రేమికులకు ఇచ్చిన ఆతిధ్యం చిరస్మరణీయమైనది. 24, 25, 26 తేదీల్లో ప్రజాదర్శనం కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి. 26.01.53 తేదీన రామకోటి తీర్థంలో సాయంత్రం జరిగిన దర్శన కార్యక్రమాల్లో వేలమంది బాబా దర్శనం చేసుకున్నారు.
"ఆధ్యాత్మికంగా ఎండిపోయిన నదులలోకి ప్రేమ మహా సముద్రం నుండి ప్రేమ వెల్లువలై ప్రవహించే సమయమాసన్న మైనది. నేను వేలమందికి పంచి ఇచ్చే ప్రసాదం ద్వారా నా ప్రేమ ప్రవాహం మానవాళికి అందజేయబడుతుంది" అని సమావేశానంతరం చెప్పారు.
27.01.53 తేదీన బాబా ఏలూరు జిల్లా జడ్జిగారి ఆహ్వానం మేరకు వారి ఇంటికి వెళ్ళారు. అక్కడ బాబా నిజాయితీ గురించి ఈ సందేశం ఇచ్చారు.
🪷
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం*
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
*తెలుగు భాషా రక్షతి రక్షితః*
*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*
*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment