Tuesday, August 26, 2025

 .     *రాముడు తల్లికి, లక్ష్మణునకు* 
                   *నచ్చచెప్పడం*
*꧁❀❀━❀🏕️🌏🏕️❀━❀❀꧂*

*లక్ష్మణుడు: ఆర్యులారా! దశరథమహారాజు వృద్దుడైపోయినా ఇంకా యౌవనంలోనే ఉన్నానను కొంటున్నాడు. అందువల్ల ఆయనలో భోగాసక్తి తగ్గలేదు. కామంచేత ఒక ఆడదాని మాటలకు బానిసై విపరీతపు నిర్ణయాలు తీసుకున్నాడు. అంతమాత్రం చేత రాముడు ఒక ఆడదానికిచ్చిన మాటకోసం రాజ్యలక్ష్మిని వదులుకోవటం నాకు బొత్తిగా ఇష్టంలేదు. ఆ మాటకు వస్తే రాముడు ఏం తప్పుచేశాడని దేశాన్నుంచి బహిష్కృతుడవుతున్నాడు. అరణ్యాలకు పంపాల్సినంత దోషం అతడు ఏమి చేశాడు? ఎంతటి శత్రువైనా రాముణ్ణి గూర్చి ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడలేడు. రాముడు దేవతలలో పరిగణించదగ్గవాడు. ధర్మబుద్ధి గలవాడు, ఇంద్రియనిగ్రహం కలవాడు, కపటం లేనివాడు. శత్రువులకు కూడా మేలు చేసే స్వభావం గల రాముణ్ణి ఎందుకొరకు అడవులకు పంపాలి? ఏ తండ్రి అయినా అటువంటి వాడికి ఇలాంటి* *ఏకపక్షమైన శిక్షను విధిస్తాడా?*

*రామా! ఈ విషయం నలుగురికీ తెలియకమునుపే రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుందాం. ధనుస్సును ధరించి, నేను నీ ప్రక్కన ఉంటే నిన్ను ఎదిరించే ధైర్యం ఎవరికుందో చూద్దాం. నా వాడిబాణాల ధాటికి ఈ అయోధ్యా నగరమే నిర్మానుష్యమైపోతుంది. భరతుని పక్షాన ఎవరొచ్చినా, ఎందరొచ్చినా వాళ్ళందరినీ నాశనం చేస్తాను. ఒకవేళ దశరథ మహారాజే కైకేయిని వెనకేసుకువస్తే ఆయన్నూ బంధిస్తాను. తప్పనిసరైతే చంపుతాను. గురువైనా అధర్మమార్గాన్ని అనుసరిస్తే అతణ్ణి శిక్షించాల్సిందే.* 

*రామా! కామంతో కళ్ళు మూసుకుపోయిన వారు తండ్రే అయినా దండించాల్సిందే. ఇది రాజధర్మమే కదా! నీకు ధర్మబద్ధంగా రావలసిన రాజ్యాన్ని దశరథ మహారాజు కైకేయికి ఏ కారణంచూపి కట్టబెడదామని అనుకున్నాడు? ఆ విషయంలో ధర్మం ఆయన పక్షాన లేదు. శౌర్యపరంగా, ఆయన సైన్యమంతా ఏకమై వచ్చినా మనిద్దరినీ జయించలేడు.*

*అమ్మా! ఓ కౌసల్యాదేవీ! నేను త్రికరణశుద్ధిగా రాముని అనుచరుణ్ణి. ఈ మాట నా ధనుస్సు మీదా, నేను చేసుకున్న పుణ్యం మీద, ధర్మం మీద ఒట్టువేసి చెబుతున్నాను. అమ్మా! రాముడి కోసం మండే మంటల్లోనైనా దూకుతాను. రాముడి కోసం ఏ త్యాగానికైనా సిద్ధమే. రాముడు అడవులకు వెళ్ళేందుకు నిర్ణయించుకుంటే నేనూ అడవులకుపోతాను. అమ్మా! నీ దుఃఖాన్ని చూడలేకుండా ఉన్నాను. నా పరాక్రమంతో నీ దుఃఖాన్ని, సూర్యరశ్మి చీకటిని అంతంచేసినట్లు, అంతం చేస్తాను.*

*కౌసల్య: రామా! లక్ష్మణుని మాటలు విన్నావు కదా! ఏం చెయ్యాలో నీవే నిర్ణయించుకో. మహారాజు నా సవతి మెప్పుకోసం, నన్ను దుఃఖంలో ముంచి నిన్ను అడవులకు పంపుతున్నాడు. నన్ను ఒంటరిదాన్ని చేసి పితృవాక్య పరిపాలన అంటూ అడవులకు పోవద్దు. నువ్వు ధర్మాలన్నీ తెలిసినవాడవు. ఈ వృద్దాప్యంలో నాకు సేవలు చేయడం కూడా పరమధర్మమే అని తెలుసుకో కుమారా! పూర్వం కాశ్యపుడు ఇంట్లో ఉంటూనే మాతృసేవలు చేస్తూ స్వర్గాన్ని పొందాడు. గురువుగా తండ్రి నీకెట్లా పూజ్యుడో అట్లాగే తల్లిగా నేనుకూడా పూజ్యురాలినే. కాబట్టి నేను నీకు అనుమతి ఇవ్వటం లేదు. నువ్వు లేనిచోట ఎన్ని సుఖాలున్నా నన్ను సంతోషపెట్ట లేవు. కాబట్టి నీతోపాటే వస్తాను. అక్కడ నీతో గడ్డి తిని బ్రతకమన్నా సంతోషంగా తింటాను. నా మాట కాదని అడవులకు వెళ్లే నేను ఆమరణ నిరాహారదీక్ష చేపడతాను.*

*రామా! పిప్పలాదమహర్షి విషయంలో సముద్రుడు అధర్మంగా ప్రవర్తించటం మూలంగా, సముద్రుడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. అట్లానే నీ మూలంగా నేను మరణిస్తే నీకు గూడా ఘోరమైన దుర్గతి పడుతుంది.*
{ఇంకా ఉంది}

*┈┉┅━❀꧁జై శ్రీరామ్꧂❀━┅┉┈*
         *ఆధ్యాత్మిక అన్వేషకులు*
🦚🏹🦚 🙏🕉️🙏 🦚🏹🦚

No comments:

Post a Comment