ఎవరివాడిని నేను?
*చదవండి.*
ఒకసారి రైలు లో ఒక భిక్షుకుడు భిక్ష అడుగుతూ తిరుగుతున్నాడు. అప్పుడు సూట్, బూట్లు వేసుకున్న ఒక వ్యాపార వేత్తని చూశాడు.
“ఇవ్వాళ్టి రోజు అదృష్టం కలిసొచ్చింది, ఇతను చాలా డబ్బున్న వాడిలా కనిపిస్తున్నాడు. ఖచ్చితంగా నాకు మంచి దానం చేస్తాడు” అని ఆ భిక్షుకుడు అనుకున్నాడు.
అతడిని దగ్గరికి వెళ్లి డబ్బు అడిగాడు.
ఆ వ్యాపారవేత్త అతని వైపు చూసి అన్నాడు:
“నువ్వు ఎప్పుడూ అడుగుతావు గాని, ఎప్పుడైనా ఎవరికి ఏదైనా ఇచ్చావా?”
భిక్షుకుడు బదులిచ్చాడు:
“సార్, నేను భిక్షుకుడిని, నా దగ్గరేముంది ఇవ్వడానికి? అడగడం మాత్రమే చేయగలను.”
అప్పుడు వ్యాపారవేత్త నవ్వుతూ అన్నాడు:
“అయితే నీకు అడిగే హక్కు కూడా లేదు. నేను వ్యాపారి, లావాదేవీల మీదే నమ్మకం. నువ్వు ఏదైనా ఇస్తే, నేను కూడా నీకు ఇస్తాను.”
రైలు ఆగింది. ఆ వ్యాపారి దిగిపోయాడు.
భిక్షుకుడు ఆ మాటలు మళ్ళీ, మళ్ళీ, ఆలోచించడం మొదలు పెట్టాడు. “బహుశా నేనెందుకు ఎక్కువ డబ్బు సంపాదించ లేక పోతున్నానంటే... నేను ఎవరికీ ఏం ఇవ్వడం లేదు, కాబట్టి కావచ్చు” అని ఆలోచించాడు.
కానీ తను భిక్షుకుడు – ఇవ్వడానికి తన దగ్గరేముంది? అని తడబడ్డాడు.
తరువాత రోజు స్టేషన్ దగ్గర కూర్చున్నప్పుడు, అక్కడ పూస్తున్న పూలపై చూపు పడింది.
అతనికి ఒక ఆలోచన వచ్చింది:
“ఎవ్వరైనా నాకు భిక్ష ఇస్తే... నేను వారికి పూలు ఇస్తే ఎలా ఉంటుంది?”
అప్పటి నుంచి అతడు భిక్ష అడుగుతూ, పూలు ఇచ్చేవాడు. జనాలు ఆనందంగా ఆ పూలు తీసుకునే వారు.
కొద్ది రోజుల్లోనే అతనికి ఎక్కువ మంది డబ్బు ఇవ్వడం మొదలు పెట్టారు.
ఒక రోజు మళ్ళీ అదే వ్యాపార వేత్తను రైలులో చూశాడు. వెంటనే అతడి దగ్గరికి వెళ్లి:
“ఇవాళ నేను మీకు పూలు ఇవ్వగలుగు తున్నాను సార్” అన్నాడు.
ఆ వ్యాపారి డబ్బు ఇచ్చాడు. భిక్షుకుడు పూలు ఇచ్చాడు.
వ్యాపారి చిరునవ్వుతో అన్నాడు:
“అద్భుతం! నువ్వూ ఇప్పుడు నాతో సమానంగా వ్యాపారివే.”
ఆ మాటలు భిక్షుకుడి హృదయాన్ని లోతుగా తాకాయి.
తనను తాను చూసుకొని అన్నాడు:
“ఇక నేను భిక్షుకుడిని కాదు... వ్యాపారిని! నేను కూడా ధనవంతుడను అవ్వగలను.”
అప్పటి నుంచి అతడు అక్కడ కనబడలేదు.
నాలుగు సంవత్సరాల తరువాత...
ఒకే స్టేషన్ నుంచి ఇద్దరు సూట్లు వేసుకున్న వ్యాపారులు రైలు ఎక్కారు.
అందులో ఒకరు, చేతులు జోడించి మరొకరిని అడిగాడు:
“సార్, నన్ను గుర్తు పట్టలేరా?”
ఇతరుడు ఆశ్చర్యపోయాడు:
“లేదు, మనం తొలిసారి కలుస్తున్నాం అనుకుంటా.”
మొదటివాడు చిరునవ్వుతో అన్నాడు:
“లేదు సార్, ఇది మూడో సారి. మొదటి సారి మీరు నన్ను రైలులో చూశారు – అప్పుడు నేను భిక్షుకుడిని. రెండోసారి చూశారు – అప్పుడు నేను పూలు ఇస్తున్న వాడిని.
ఇప్పుడు మూడోసారి – నేను పెద్ద పూల వ్యాపారిని అయ్యాను.”
తర్వాత గౌరవంతో అన్నాడు:
“మీరు నాకు నేర్పింది ఒకే విషయం – ఇవ్వడం నేర్చుకో. తీసుకోవడం అంతకు ముందు వస్తుంది.
రెండోసారి నన్ను చూసి నప్పుడు మీరు అన్నది – ‘నువ్వూ వ్యాపారివే’. అదే మాట నా జీవితాన్ని మార్చింది.
ఇప్పుడీ స్థితికి రావడానికి కారణం మీరు.”
మన జీవితం మన ఆలోచనల ప్రతిబింబం.
మనల్ని మనం ఏం అనుకుంటామో, అదే అవుతాము.
భిక్షుకుడు తనను భిక్షుకుడిగా భావించినంతకాలం భిక్షుకుడిగానే ఉన్నాడు.
తనను వ్యాపారిగా భావించిన క్షణం నుండి వ్యాపారివయ్యాడు.
భారతీయ ఋషులు ఎప్పుడూ చెప్పేది అదే – “నిన్ను నువ్వు తెలుసుకో.”
మనసులో బంధం అనుకుంటే బంధమే, స్వేచ్ఛ అనుకుంటే స్వేచ్ఛే.
“మనల్ని మనం స్వేచ్ఛావంతులమని అనుకుంటే స్వేచ్ఛ వస్తుంది. బంధమని అనుకుంటే ఎప్పటికీ బంధమే. మన ఆలోచనల ఆధారంగానే మనం మారుతాం.” – 🙏
No comments:
Post a Comment