Wednesday, September 6, 2023

నిశ్శబ్ద శక్తిరూపం… పుస్తకం!

 నిశ్శబ్ద శక్తిరూపం… పుస్తకం!
September 5,2023
A silent power house...the book!
📘📘📘📘📘📘📒📒📒📗📗📗📗📗
పుస్తకం హస్తభూషణమే కాదు మస్తిష్క వికాసం కూడా అని మనకు తెలుసు.పుస్తక పఠనం ఓ చక్కని అలవాటు.జ్ఞాన భాండాగారంగా పూజించబడే పుస్తకాలను సరస్వతీ రూపాలుగా కొలుస్తాం.

పుస్తకం విశ్వాన్ని పరిచయం చేస్తుంది, వింతలు, విడ్డూరాలను విప్పి చూపుతుంది.పుస్తకం మానవాళి మేధోశక్తిని పోషిస్తుంది.పుస్తకం అక్షరాల కుప్ప కాదు,జ్ఞాన జ్యోతిని వెలిగించే ఇంధనం.

పుస్తకం మనో నేస్తం,సమాజోద్ధరణకు ఊతం. ప్రపంచాన్ని పరిచయం చేస్తూ,నూతన ఆవిష్కరణాగ్నికి ఆజ్యం పోసేది పుస్తక పఠనమే.లోక రీతు, శాస్త్ర ప్రగతులు,సాంకేతిక జిలుగులు, అజ్ఞానాన్ని పారద్రోలే మహోజ్వల వెలుగులను నింపగల మహా శక్తివంతమైంది పుస్తకమే కదా! 

జ్ఞాన లోతులను పరిచయం చేస్తూ,ప్రపంచ సమస్యలకు సరైన సమాధానం ఇవ్వగల మేధో నిధి పుస్తకమే. పుస్తక ప్రాధాన్యతను గుర్తించి పుస్తక పఠనానికి జీవనశైలిలో సింహభాగం కేటాయించడాన్ని ప్రోత్సహించే కృషిలో భాగంగా ప్రతి యేటా 06 సెప్టెంబర్‌ రోజున ప్రపంచవ్యాప్తంగా ”జాతీయ పుస్తక పఠన దినోత్సవం (నేషనల్‌ రీడ్‌ ఏ బుక్‌ డే)” పాటించుట జరుగుతోంది.

గ్రంథాలయాల సందర్శన,వ్యక్తిగత గ్రంథాలయాన్ని నిర్మించుకోవడం, పుస్తక పఠన సంఘాలను ఏర్పాటు చేసుకోవడం, విలక్షణ పుస్తకాల సేకరణ చేసే అభిరుచిని కలిగి ఉండడం,స్నేహితులు పుస్తకాలను మార్చుతుంటూ చదువుకోవడం,పుస్తక పఠన ప్రాధాన్యతలను వివరించడం, పుస్తక పఠన పోటీల నిర్వహణ, పాఠశాలల్లో పుస్తక పఠనాన్ని ఆదరించడం, పుస్తకాన్ని జీవితకాల నేస్తంగా భద్రపరుచు కోవడం లాంటి అంశాలను జాతీయ పుస్తక పఠన దిన వేదికల్లో విద్యార్థుల ముందు చర్చించాలి.

1990లో హోవర్డ్‌ బెర్గ్‌ రికార్డు స్థాయిలో నిమిషానికి 25వేల పదాలు చదవడంతో అత్యంత వేగంగా చదివిన వ్యక్తిగా గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లో చోటు దక్కించుకున్నారు. సాధారణ పాఠకులు నిమిషానికి 300 వరకు పదాలు చదువగలుగుతారు.

అన్నీ జోన్స్‌ అనబడే పాఠకురాలు హారీ పోట్టర్‌ పుస్తకాన్ని నిమిషానికి 4,200 పదాల వేగంతో 47 నిమిషాల్లో చదివి ప్రపంచ పఠన బహుమతిని గెలుచుకున్నారు. మన పిల్లలు ఘనకార్యం చేసినప్పుడు ఓ మంచి పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వడాన్ని తల్లిదండ్రులు పాటించాలి.

 పుస్తక పఠనాభిరుచితో మేధో వ్యాయామం జరిగి చురుకుగా తయారవుతారు.వాడవాడలా పుస్తక క్లబ్‌లు ఏర్పాటు చేయాలి.పుస్తకాలు అపూర్వ వినోద, విజ్ఞాన కోవెలలుగా భావించబడాలి.

పుస్తకాన్ని పదిమందికి అందుబాటులో ఉంచుట ద్వారా విజ్ఞాన వితరణకు దోహదపడిన వారమవుతాం. అది జ్ఞాపకశక్తిని పెంపొందించుట, ఏకాగ్రతను సాధించుట, మానసిక ఒత్తిడిని కలిగించ కుండా చేస్తాయి.

ఇంకా జీవన సంక్లిష్టతలను అధిగమించడం, మేధావిగా రాణించడం,సృజనను పెంపొందించడం, జ్ఞాపకశక్తిని పెంచడం,అజ్ఞానాన్ని తరిమేయడం పుస్తక పఠనంతో కలుగుతాయి.

జీవన లక్ష్యాలను అధిగమించడం,జీవనోపాధిని పొందడం, కుటుంబ సభ్యులను విద్యావంతులుగా మార్చడం, సహానుభూతిని పోషించడం,నిద్ర సమస్యలు తొలగడం వంటివి జరుగుతాయి.

విద్యావంతుడిగా గుర్తింపు పొందడం,మెదడు చురుకుదనం పెరగడం,ప్రేరణ కలిగించడం, నైపుణ్యాలను పొందడం,పలు ప్రశ్నలకు సమాధానాలు లభించడం,మంచి స్నేహితులను పొందగలగడం లాంటి అనేక ప్రయోజనాలు ఉంటాయి.

నేటి నానో,డిజిటల్‌ విప్లవయుగంలో పుస్తక పఠనాభిరుచి పలుచ బడుతోంది.చదవడం మానేసి టీవీ,గూగుల్‌ సైట్స్‌ చూసే కల్చర్‌ను అలవర్చు కుంటున్నారు.బుక్‌ కల్చర్‌ను నిర్లక్ష్యం చేస్తూ లుక్‌ కల్చర్‌కు అలవాటు పడుతున్నారు.

గూగులమ్మ కన్న పుస్తక సరస్వతే మిన్న అని విద్యార్థులకు వివరించాల్సిన అవసరం ఉంది.దాన్ని ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించాలి. కానీ ఎక్కువసేపు పుస్తక పఠనం చేయాలి.

జ్ఞాన సంపదను తరతరాలకు అందజేస్తున్న పుస్తకాలు మనకు అపూర్వ ఆస్తులుగా నిలపాలి. పుస్తకాన్ని నమ్మినవారు,పునీతులైనారు.అక్షరాలు కొలువైన పుస్తకాలు సమాజ ప్రగతి రథాలుగా మారాలి.

ప్రపంచ మానవాళిని అక్షరాస్యులుగా, విద్యావంతులుగా మార్చగలిగే నిశ్శబ్ద శక్తిరూపం పుస్తకమే అని గమనించి పుస్తక పఠనాన్ని మహా యజ్ఞంగా కొనసాగించాలి.

(నేడు ‘జాతీయ పుస్తక పఠన దినం’)
✍-డా: బుర్ర మధుసూదన్‌ రెడ్డి,
*-9949700037*

No comments:

Post a Comment