Friday, September 29, 2023

నిండా ముప్పై నిండలేదు , షుగర్ వచ్చింది. ఒకరి ఆవేదన.

సార్ నాకు నిండా ముప్పై నిండలేదు , షుగర్ వచ్చింది. ఒకరి ఆవేదన.
మా అమ్మాయి పట్టుమని పది అడుగులు కూడా నడవలేదు, బండి కావాలి. ఓ తల్లి వేదన.
మావాడు ఎప్పుడూ సెల్ తోనే ప్రపంచం. ఊబకాయం, ఓ తండ్రి దిగులు.
ఎందుకు ఇలా...!
పూర్వం అంటే 60సంవత్సరాల  క్రితం అంటే 1960 ప్రాంతాల్లో
పొద్దున్నే చద్దిఅన్నం, పెరుగు తినేవాళ్ళము. ఇంటిపని చేసే వాళ్ళము, అంటే బైట చిమ్మడం, బావి నుండి నీళ్ళు తేవడం, ఊరి చివర ఉన్న ఒకే మంచినీటి బావి నుండి మంచినీళ్లు తేవడం, సరుకులు తేవడం. స్కూల్ కు నడిచి వెళ్లే వాళ్ళము. చెప్పులు కూడా ఉండేవి కాదు. సంచి మోసుకుంటూ బాక్స్ లో అన్నం, పప్పు అంతే.
సాయంత్రం ఐదు నుండి ఆరు వరకు బైట మట్టి రోడ్డు మీద ఆటలు. ఏడు గంటలకు స్నానం చేసి అన్నం, కూర, మజ్జిగతో తిని హాయిగా పడుకోవడం. పొద్దున్నే లేచి చదువుకోవడం, మిగతావన్నీ మాములే.
1980 వచ్చేసరికి సైకిళ్ళు వచ్చాయి, ఉన్నవాళ్లు పిల్లలకు సైకిళ్ళు కొని పెట్టేవారు. ఇంట్లో పనిమనిషి సంస్కృతి కూడా వచ్చింది. తిండిలో కూడా ఖరీదైనవి చోటు చేసుకున్నాయి.
2000 వచ్చే సరికి ప్రతి ఇంట్లో బండి కంపల్సరీ. డబ్బు ఉంటే కారు కూడా. ప్రయివేటు స్కూళ్ల హవా. దర్జాగా నడిచే పని లేదు. బస్సుల్లో, ఆటోల్లో, సొంత వాహనాల్లో అడిగిన ప్రతిదీ కొని పెట్టె స్తోమత ఉన్నా, లేకున్నా పోటీ ప్రపంచం. పని తక్కువ, సుఖం ఎక్కువ, తిండీ ఎక్కువ. బైట రెడీ మేడ్ ఫుడ్,  కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, టీవీలు, ఫోన్లు, బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్, గిన్నెలు తోమడానికి పనిమనిషి. అన్నం, పప్పు కుక్కర్లతో సమయం ఆదా. ఆ సమయాన్ని టీవీల ముందు, ఫోన్ తో గడపడం. శ్రమ తక్కువ, తిండి ఎక్కువ, అదీ పోషకాలు లేని జంక్ ఫుడ్.
2020వచ్చేసరికి అందరూ ఆన్ లైన్ లో అన్నీ తెప్పించు కోవచ్చు. కరెంటు బిల్లు, కూరగాయలు, వండిన కూరలు, భోజనం, మందులు, సరుకులు, బట్టలు ఒకటేమిటి సమస్తం, బటన్ నోక్కితే ఇంట్లో,
అంతా సులభసాధ్యం, వళ్లు అలిసిపోదు. శరీరం రోగాల మయం. అరే నేను వాకింగ్ చేస్తానే అంటారు కొందరు, 
ఎలా, పార్కు వరకు కారు లేక బండి మీద అక్కడ కబుర్లు చెప్పుకుంటూ అరగంట నడక ,
దారిలో రెండు సమోసాలు, ఒక కూల్ డ్రింక్.
2040 లో  ఏముంది గర్వకారణం, శరీరం సమస్తం రోగాల మయం.
మేలుకోండి, ఇంట్లో వండుకొని మంచి కూరగాయల భోజనం, తినండి. మాంసాహారం కూడా పరవాలేదు వారానికి ఒక్కసారి. మీ పని మీరు చేసుకోండి. చిన్న చిన్న పనుల కోసం బండి తీయకండి. ముందు తరాలను రోగాల బారి నుండి కాపాడం మన చేతుల్లోనే ఉంది..🙏

No comments:

Post a Comment