Thursday, October 10, 2024

 రాక్షసులు శివుడుని ఎందుకు ఆరాధిస్తుంటారు? % (రావణాసురుడు, హిరణ్యాక్షుడు)?
బ్రహ్మ సృష్టి, విష్ణువు స్థితి, శివుడు లయ కారులు అని మనకి తెలిసిన విషయమే కదా. ఇందులో బ్రహ్మ, శివుల పని కొంత సులభం. సృష్టి చేయడం, లయం చేయడం. కానీ సృష్టిని ఎటువంటి ఈతి బాధలు లేకుండా, అనుక్షణం కాపాడుకుంటూ చూసుకోవడం కష్టమైన పని. అందుకే శ్రీమహావిష్ణువు పని కష్టతరం. అవతారాలు దాల్చి, ఎన్నో అగచాట్లు పడి, నిందలు మోసి, శాపాలు భరించి చక్కదిద్దాలి.

సృష్టించిన బ్రహ్మకి, లయకారుడు అయిన పరమేశ్వరునకు సృష్టిలో సమస్యలు పరిష్కరించాల్సిన భాధ్యత తక్కువ. అందుకే సృష్టిలో ఏ సమస్యలు వచ్చినా దేవతలు విష్ణు మూర్తి దగ్గరకు పరిగెట్టేది. తద్వారా ఆ సృష్టిలో వినాశన కారకులు అయిన రాక్షసులకు, ఆ సృష్టిని కాపాడే భాధ్యత కలిగిన విష్ణువుకు శతృత్వం సహజమే కదా?

విష్ణువుకు ఆ బాధ్యత, అందులో కష్టనష్టాలు తెలుసు కాబట్టే ఆయన అసులభుడు. అంత తొందరగా ఎవరినీ నమ్మడు, ఒక పట్టాన ప్రత్యక్షం కాడు, వరాలు ఇవ్వడు. ఎందుకంటే ఏ వరం ఇస్తే అది దుర్వినియోగం అయ్యి తాను మళ్ళా మరో అవతారం దాల్చాల్సి వస్తుందేమో అని చిరాకు. భగవంతుడు కూడా అందరూ పుణ్యాత్ములు అయ్యి ఆయనకి పని కల్పించకుండా ఉంటే హాయిగా వైకుంఠంలో ఉంటాను అనే కదా అనుకుంటాడు? భూలోకంలోకి వచ్చి ఇన్ని కష్టాలు పడడం ఆయనకు మాత్రం ఇష్టమా? ఎందుకొచ్చిన ఈ రాముడు, కృష్ణుడు అవతారాలు అందరిచేత మాటలు పడడానికి తప్పా?

బ్రహ్మను, శివుడిని ఎవరైనా ఏమైనా అంటున్నారా? ఈ కోరాలోనే చూడండి అన్నీ ప్రశ్నలూ రాముడు ఎందుకు అలాగా, కృష్ణుడు ఎందుకు ఇలాగా అంటూ ఆయనకు ఈ కలియుగంలో అసలు మనశ్శాంతి లేకుండా చేస్తున్న శిశుపాలులు ఎందరో. రాక్షసులు కూడా అందుకే బ్రహ్మ, శివుడు ఆరాధన చేస్తారు. అయితే తరవాత ఏం జరుగుతుందో తెలియకుండా ఇష్టం వచ్చినట్టు పరమేశ్వరుడు కూడా ఒకోసారి వరాలు ఇవ్వడు. అంతే కాదు శ్రీమహావిష్ణువుతో పాటూ ఆయన కూడా కొన్ని అవతారాలు తన అంశ ద్వారా దాల్చాడు. ఉదాహరణకు శ్రీరాముని సేవకు హనుమగా.

కానీ రాక్షసులకు దేవతలను, మనుషులను, ఈ సృష్టిని ఇబ్బంది పెట్టే పని ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ సృష్టిని కాపాడే భాధ్యత ఉన్న విష్ణుమూర్తి ఆరాధన సరిపడదు. పరమేశ్వరుని ఆరాధనే సరి అయినది. పరమేశ్వరుడు భక్త సులభుడు కూడా కాబట్టి వాళ్ల పనికి ఆటంకం, కోరికలకు లోటు ఉండదు. అయితే శ్రుతి మించితే మాత్రం త్రిమూర్తులు ముగ్గురూ ఏకమై దుష్ట శిక్షణ చేయకా తప్పదు.

No comments:

Post a Comment