*తెలుగు రాష్ట్రాల్లో మన దేవాలయాలు వాటి ప్రముఖ్యత -11*
🛕
*కృష్ణాజిల్లా*
*విజయవాడ కనకదుర్గ*
అన్ని విధాల ఆంధ్రదేశానికి నడిగడ్డలో వుంది విజయవాడ. మద్రాసు నుండి కలకత్తాకు. ఢిల్లీకి వెళ్ళే రైలుమార్గాలక్టి పెద్ద కూడలి. ఆంధ్రదేశము లో ప్రధానమైన పట్నము. ఇచ్చట ముఖ్యమైన గుడులు మూడు. కనకదుర్గ గుడి, మల్లేశ్వర స్వామి గుడి. విజయేశ్వరస్వామి గుడి.
పురాణాలలో ఇది విజయవాటిగా ప్రసిద్ధము. కొన్ని శాసనాలలో "రాజేంద్ర చోళపురము" అని కూడ పేర్కొనబడింది. కృష్ణ ఒడ్డున ప్రసిద్ధ యాత్రా స్థలమైన యీ ప్రదేశంలో శివునికి మల్లేశ్వరుడను పేర ఆలయం ఉంది. ఈ స్వామికి "జయసేను" డని కూడ ప్రసిద్ధి. అగస్త్య మహర్షి యీ స్వామి వివిధ లీలలకు సాక్షియైన గొప్ప భక్తుడు.
కనకదుర్గ యిచ్చట ఎపుడు వెలిసిందో తెలియదు. ఆమె తనకు తానే దక్షిణాపథ వాసులను పీడిస్తున్న దుర్గమాసురుడ్ని చండి స్వరూపంలో ఇచ్చట సంహరించింది.
మల్లికార్జునుడనీ, మల్లీశ్వరుడనీ పురాణాలలో వినబడే ఈ స్వామిని తమ దక్షిణాపథ విజయ చిహ్నంగా పాండవాగ్రజుడైన యుధిష్ఠిరుడు ప్రతిష్ఠించినట్లు తెలుస్తున్నది.
చరిత్రను బట్టి క్రీ.శ. 10వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్య ప్రభువు త్రిభువన మల్లుడు ఈ గుడిని నిర్మించాడు.
విజయేశ్వర ప్రతిష్ఠ అర్జునుడు చేసిందంటారు. (కిరాత రూపంలో వచ్చిన శివునిపై తన విజయ చిహ్నంగా). ఈ ప్రదేశమంతా చిన్న చిన్న కొండలతో చుట్టబడి ఉంటుంది. అన్నింటిలోను పెద్దది సీతానగరం కొండ. చిన్నది కనకదుర్గ. దీనిని "కనక కొండ" అని కూడ అంటారు. దుర్గగుడికి దక్షిణం వైపున చిన్న గుట్ట వుంది. దాని నిండా శిల్పాలు, శాసనాలు వివిధ దేవతల వారి వారి పేర్లతో చెక్కి వున్నాయి. చాలా ప్రతిమలు దుర్గవే. అవన్నీ మంత్రశాస్త్రానికి సంబంధించినవి. పూర్వం యీ కొండలన్నీ వరసగా కలిసి వుండేవనీ పరమేశ్వరుని ఆజ్ఞచేత కృష్ణ ప్రవహించడానికి వీలుగా ప్రక్కప్రక్కలకు తప్పుకున్నాయనీ అంటారు.
ఈ కొండల్లో ఒకటి "ఇంద్రకీల" మనే పేరుతో మహాభారతంలో పేర్కొనబడింది. ఈ కొండమీదనే అర్జునుడికి శివుడు పాశుపతమనే పరమాస్త్రాన్ని అనుగ్రహించాడు. అనుగ్రహించడానికి ముందు శివుడు అర్జునుని యెదుట కిరాతరూపంలో నిలిచాడు. ఈ కథను "కిరాతార్జునీయం”గా
భారవి శాశ్వతం చేశాడు.
తన పాశుపతాస్త్ర సిద్ధికి స్మృతి చిహ్నంగా ఇచ్చట విజయేశ్వరుడిని అర్జునుడు ప్రతిష్ఠించా డంటారు. మిగిలిన మహాభారతం కథా సన్నివేశా లతో సహా కిరాతార్జునీయం యీ గుడిలో శిల్ప రూపంలో నెలకొని వున్నది ఆ గాధ ఇದಿ.
పాండవుల వనవాసంలో వేదవ్యాస మహర్షి వచ్చి శత్రు విజయార్ధమై పాశుపతాస్త్ర సిద్ధికై శివుడిని గూర్చి తపస్సు చేయవలసిందిగా ఆదేశించాడు. ధర్మరాజు, అర్జునుని నియోగించాడు. అర్జునుడే ఇంద్రకీల శిఖరం మీద ఒంటికాలిపై నిలిచి ఊర్ధ్వ బాహుడై పంచాగ్ని మధ్య తపస్సు మొదలు పెట్టాడు. ఘోరమైన ఆ తపస్సుకు పరమేశ్వరుడు సంతోషించాడు. అర్జునుడిని పరీక్షించవలెనని పించింది. కిరాతవేషం ధరించాడు. పార్వతి కిరాతివేషం ధరించింది. ప్రమధులంతా రకరకాల వేషాలు ధరించారు. వేదాలు వేటకుక్కలైనాయి. ఇలా యింద్రకీలం మీద శివుడు వేటాడుతూ ఒక అడవి పందిని అర్జునుని ముందుకు తరుముకు వచ్చాడు. అడవిపంది అర్జునునికి దగ్గరగా వచ్చింది. ఆయన మహావీరుడు కదా! గాండీవం తీసుకొని ఒక్క బాణంతో దాన్ని కొట్టాడు. తరుముకు వస్తున్న కిరాతుడు అదే సమయంలో ఒక బాణంతో కొట్టాడు. రెండుప్రక్కల రెండు బాణాలు గ్రుచ్చుకొని గురగుర ధ్వనితో గిరగిరా తిరిగి ఆ అడవిపంది నేలకొరిగింది. నా బాణంతో చచ్చిందంటే నా బాణంతో చచ్చిందని తగాదా మొదలైంది. "నేను తరుముకు వచ్చే పందిని కొట్టడానికి నీవెవడవురా! నావేట తమకమంతా చెడకొట్టావు. ఈ కిరాతి ముందు నాకు తలవంపు లైంది. అసలు తపస్సు చేసుకునేవాడివి, నీవు పందిని కొట్టడం దేనికి? ఈవేషం నిన్ను కాపాడింది. లేకపోతే నేడు పందితో సహా నిన్నిక్కడే చంపియుండేవాడిని" అంటూ కిరాతుడు అర్జునుడిని రెచ్చగొట్టాడు.
మహావీరుడైన అర్జునుడు ఈ బోయవాడు చేసిన తిరస్కారానికి మండిపోయాడు. అయినా నిగ్రహించుకొని "పో! పోరా! కోయవాడివి నీతో నాకేమిటి? నా శివపూజకు అలస్యమవుతోంది" అన్నాడు. పట్టువిడువలేదు. నిలబడి అర్జునుని తిట్టడం మొదలుపెట్టాడు. పందిని కిరాతుడు కొట్టి వేట తమకం అంతా పాడుచేసినందుకు ప్రాయశ్చిత్తంగా తన కోయసాని ఎదుట కుస్తీకి రమ్మన్నాడు. ని శివపూజ ఎక్కడికి పోదులే! అన్నాడు. ఈ కోయసాని ఎదుట నీతో యుద్ధం చేయడానికి మనస్సు పొంగుతున్నది. పందిని కొట్టిన నేరానికి నీకిది తప్పదన్నాడు. చేసేదిలేక అర్జునుడు కిరాతునితో మల్లయుద్ధానికి సిద్ధమయ్యాడు.
ఎంత మహావీరుడైనా అర్జునుడు పరమేశ్వరుని ముందు తట్టుకోలేకపోయాడు. వెంటనే ఆయాసం వచ్చింది. డస్సి పోయాడు. ప్రాణానికి తెగించి పోరాడుతున్నా మనస్సులో శివునిమీద ఏకాగ్రత చెదరలేదు. ఇంతలో ఒక చిత్రం జరిగింది. ప్రాతఃకాలార్చనలో తాను శివలింగం మీద ఏ పూవులతో పూజించాడో ఆ పూవులు తాను పోరాడుతున్న కిరాతుని శరీరము మీద నుండి రాలటం కనబడింది.
ఆ కిరాతుడు సాక్షాత్పరమేశ్వరుడని తెలిసింది. వెంటనే కిరాతుడు మాయమైపోయాడు. ఎదుట తమ సమస్త పరివారంతో శివుడు నిలిచాడు. పాశుపతం అతనికి ప్రసాదించబడినది. ఈ పరమ సన్నివేశానికి తార్కాణంగా యీ ఇంద్రకీలాద్రి మీద అర్జునుడు 'విజయేశ్వర లింగాన్ని' ప్రతిష్ఠించాడు. ఈ ఇంద్రకీలం మీద కొండలలో నిలిచిన ప్రాచీన దేవాలయాలెన్నో వున్నాయి. అవన్నీ కాలక్రమంలో శిథిలములై పూడిపోయినాయి. ఇళ్ళరాళ్ళ కోసం బెజవాడ కొండలు పగులగొట్టటంలో అవి బయటపడ్డాయి. అవన్నీ భద్రపరుపబడ్డాయి. విజయేశ్వరాలయం లో అద్భుతమైన శిలాశిల్పం ఒకటి వుంది. దానిమీద నాలుగువైపులా కిరాతార్జునీయ కథ చెక్కబడి వుంది.
మల్లేశ్వరస్వామి ఆలయము గూర్చి కొన్ని గాథలున్నాయి. కలియుగానికి ముందే వుంది. అగస్త్య మహర్షి యీ స్వామికి 'జయసేను'డని పేరు పెట్టారు. మహాభారత వీరుడైన అర్జునుడు మల్లయుద్ధంలో గట్టివాడు. తన అనుభవాన్ని బట్టి అతడే స్వామికి మల్లేశ్వరుడని పేరుపెట్టాడు. స్వామి తన సాన్నిధ్యం చేత కృష్ణ ఒడ్డున వున్న విజయవాటిని అనుగ్రహిస్తున్నాడు.
ఇంకొక గాథలో యిలా వుంది. కలియుగంలో శాలివాహన శకం మొదట 117 వ సంవత్సరంలో మాధవవర్మ అనే ప్రసిద్ధుడైన రాజు వుండేవాడు. చింతకాయలమ్ముకొని బ్రతికే ఒక స్త్రీ కొడుకు ప్రమాదవశాత్తు రాజకుమారుని రధంక్రింద పడి మరణించాడు. న్యాయార్థినియై వచ్చిన ఆ స్త్రీ మొఱ అలకించి ధార్మికుడైన ఆ రాజు తన కొడుకికి మరణశిక్ష విధించాడు. అతని ధర్మ బుద్ధి కానందించి మల్లేశ్వరస్వామి అతనిమీద కనక వర్షం కురిపించాడు. ఆ కనకవర్షం వల్ల ఆ అవ్వ కొడుకూ, రాజకుమారుడూ పునరుజ్జీవితు లైనారు. ఆ రీతిగా పరమేశ్వరుడు ఆ మహారాజు పేరు భూమి మీద శాశ్వతంగా నిలిపాడు. తరువాతి కాలంలో పండితారాధ్యుడనే మహాభక్తుడు శివభక్తులు ఋషిశ్వరులకంటే గొప్పవారని లోకానికి చాటి దానికి నిదర్శనముగా జమ్మిచెట్టు కొమ్మకు 'కణకణ లాడే పండు బొగ్గులు వస్త్రంలో కట్టి వ్రేలాడదీశాడు. ఆ వస్త్రం కాని చెట్టుకాని కాలిపోలేదు. మల్లేశ్వరస్వామి ప్రసన్నుడై తన భక్తుని ఎదుట సాక్షాత్కరించాడు. జన సామాన్యంలో ప్రచురమైన గాధను బట్టి యీ స్వామి "మహాదేవ మల్లేశ్వరుడు" భక్త ప్రియుడు ఆయనను సేవించి పూర్వ రాజులు వర్ధిల్లారు.
ఈ ఆలయంలో ఒక శాసనం తెలుగు లిపిలో వుంది. క్రీ.శ. 9వ శతాబ్దం నాటిది. ఈ శాసనం చిత్రంగా క్రిందనుండి పైకి చెక్కబడి వుంది. సారాంశం ఇది. -
పెచ్చవాడ కలియబోయ కుమారుడు త్రికోటిబోయ అనేవాడు తనపేర తన కుల ప్రసిద్ధికై యీ స్థంభాన్ని నెలకొల్పాడు. శాసనంలో "త్రికోటిబోయ' అర్జునునికి ఇంద్రకీల మార్గం చూపడానికి ఇంద్రునిచే నియోగింపబడిన గుహ్యాక యక్షుడుగా గుర్తింపబడినాడు.
అర్జునునికి మార్గం చూపిన సుకృతం వల్ల "త్రికోటిబోయి”కి పూర్వజ్ఞానం కలిగి అర్జునుడు తపస్సు చేసిన ప్రదేశంలో ఈ స్థంభాన్ని నెలకొల్పాడు. ఈ గుహ్యాక వృత్తాంతం మహాభారతంలో లేదు. భారవిలో వుంది. కాబట్టి ఇది భారవికి పూర్వంది.
పౌరాణిక ప్రశస్తి అలావుండగా విజయవాడ ఆంధ్ర సంస్కృతికి ప్రధాన కేంద్రంగా గోచరిస్తుంది. ఒకప్పుడు కళ్యాణి చాళుక్యులు దీన్ని ఏలినారు. ప్రసిద్ధుడైన చైనా యాత్రికుడు "హ్యూన్ త్సాంగ్" ఈ ప్రదేశాన్ని క్రీ.శ. 639లో బౌద్ధమతం పరమోచ్చ దశలో వున్న దినాల్లో దర్శించాడు.
ఇన్ని విధాల ప్రసిద్ధమైన విజయవాడ పెక్కు ప్రాచీన దేవాలయాలకు నిలయమై వుంది. వానిలో ప్రధానంగా శ్రీ కనక దుర్గాలయం మహిమాన్వితమై వేలకొలదీ యాత్రికులను నేటికీ ఆకర్షిస్తోంది.
🛕
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం*
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
*తెలుగు భాషా రక్షతి రక్షితః*
*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*
*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment