తండ్రి కోసం తంటాలు.
ఇహం పరం విశ్వసించే మన సంస్కృతిలోనే ఇలాంటి చరిత్రలు కనిపిస్తాయేమో!
కొడుకులు వందమందీ చచ్చినా "వాళ్ళు వెన్ను చూపక ధర్మయుద్ధం చేసి కన్నుమూశారులే"— అంటే ఆ ధృతరాష్ట్రుడికి గొప్ప సంతృప్తి. వాళ్ళు అందరూ వీరస్వర్గం అనుభవిస్తారని.
భారతయుద్ధం జరిగింది పాండురాజు కోసమే— అనే రహస్యం ఈనాడు చాలా మందికి వింతవిషయం . అంతటి వీరాధివీరులూ కష్టాలు అనుభవించడానికి కారణమూ ఈ పితృభక్తే.
తండ్రిని సరిగా గూడా చూచి ఉండని పిల్లలు పాండవులు. అంత చిన్న వయసులోనే ఆ తండ్రి కన్నుమూశాడు.
ఐనా పితృభక్తి పితృభక్తే.
కష్టాలు పడ్డారు. చావుబతుకుల మధ్య జీవితం గడిచింది. చదువులు నేర్చారు. ఒక ఇంటివాళ్ళైనారు.
పాండురాజు తర్వాత తనకు దక్కవలసిన రాజ్యం పెదతండ్రి తనకింద ఉంచుకొన్నాడు. పెద్దలు చెప్పినా వినీ వినని పరిస్థితి.
కడకు విధిలేక కొంత రాజ్యం ఇచ్చి ఏలుతూ ఉండు అన్నాడు. 23 సంవత్సరాలు ఇంద్రప్రస్థంలో హాయిగా గడిచిపోయింది. అపూర్వమైన సభ మయసభ నిర్మితమయింది.
నారద మహర్షి వచ్చాడు. ఈ సభ (భవనం) అపూర్వం. నేను ఇంద్ర బ్రహ్మ వరుణ యమసభలు చూచాను. వాటితో సరితూగేట్టుంది ఇది అని ప్రశంసించాడు.
ఔనా? ఆ సభల విశేషాలు చెప్పండి.. అన్నాడు.
ఆయన ఆయా సభలలో ఉన్న రాజర్షులు, ఋషులు, అప్సరసలు ఆ వివరాలన్నీ చెప్పాడు. హరిశ్చంద్రాదులు ఇంద్రసభలో ఉండగా మా నాయన యమసభలో ఉండడం ఏమిటి? అని అడిగాడు ధర్మరాజు.
మీ నాయన నీవు రాజసూయం చేస్తే ఆ ఇంద్రలోకం చేరగలుగుతాడు. భూ లోకానికి వెళ్లినప్పుడు నీకావిషయం చెప్పమన్నాడు అని చెప్పాడు . ఐతే దానివల్ల రాజలోకప్రళయమైన భీకరయుద్ధం— తర్వాత 13 ఏళ్ళకు జరుగుతుంది. నీయిష్టం—అని కొసమెరుపుతో ముగించాడు.
ఇపుడు పితృకార్యంగా రాజసూయం చేయవలె. సోదరులతో ఆత్మీయులతో రహస్యంగా చర్చించాడు . ఐతే తన కారణంగా లోకవినాశం జరగగూడదు. ఆ పాపం నాకు వద్దు అన్నాడు ధర్మరాజు .
పెద్దలు చెప్పినదే చేద్దాం. అపుడు మన కర్తృత్వం ఉండదు. దాయ భాగం కోసం / అధికారం కోసం కౌరవులతో ఇపుడు సాగుతున్న ఈ భేదభావం యుద్ధంగా పరిణమించకుండవలె . పెద్దలు ఏది ఆదేశిస్తే అదే చేస్తే మనం దోషదూరులమౌతాము గదా అని చెప్పాడు. ధర్మరాజు మాట అందరమూ పాటిద్దాం అని ఒక నిశ్చయానికి వచ్చారు.
రాజసూయం చేసి పితృ ఋణం తీర్చారు.
పెదతండ్రి జూదం ఆడమంటే ఆడారు. బలం ఉండీ ఇడుమలు పడ్డారు . పదమూడేళ్ళు కష్టాలు పడ్డారు.
ఇక న్యాయంగా మాకివ్వవవలసిన రాజ్యం మేము 13 ఏళ్ళక్రితం ఏలినది ఇచ్చి సత్యం నిలపండి — అన్నాడు.
యుద్ధం రానే వచ్చింది.
ధర్మరక్షణ రాజధర్మం. శస్త్రం పట్టారు. స్వధర్మం నెరవేర్చి తామూ సద్గతి పొందారు.
భీష్ముడు తండ్రి స్వయంగా చెప్పకపోయినా శంతనుడికోసం బ్రహ్మచర్య దీక్ష పట్టాడు. కృతార్థుణ్ణైనాను అని భావించాడు.
రాముడూ స్వయంగా తండ్రి నోరుతెరిచి చెప్పకపోయినా తండ్రి సత్యవాక్యుడు కావాలి. ఆయనకు బ్రహ్మలోకం ప్రాప్తించాలి అని తనలో తానే అనుకొన్నాడు. కైకమ్మకు ఆయన ఎపుడో తాను పుట్టక ముందు ఇచ్చిన వరం —తండ్రికి మారుగా తాను నెరవేర్చడానికి కృతనిశ్చయుడైనాడు. ఎవరు ఎన్నిరకాలుగా చెప్పినా పునరాలోచనలో పడలేదు. వెనుకంజ వేయలేదు..
తండ్రి మాట కొడుకులుగా నెరవేర్చి పుత్రేణ లోకాన్ జయతి అనే మాటను సార్థకం చేశారు.
వాళ్ళే ఈ నాటికీ సమాజానికి ఆదర్శంగా నిలబడగలిగారు.
No comments:
Post a Comment