Wednesday, April 1, 2026

 ధర్మరాజు తన గుర్తింపు దాచి కొలువులో చేరాడు కదా? మరి అబద్దం ఆడినట్టు కాదా?
పాండవులు అజ్ఞాతవాస కాలంలో మారురూపాలలో ఉన్నారు. సంవత్సరం గడిచిపోతే నష్టరాజ్యప్రాప్తి ఔతుంది.

దేవీ అనుగ్రహం ఉంది. విరాటనగరప్రవేశ సమయంలోనే దర్శనం అనుగ్రహించి చెప్పింది. మీకే కష్టమూ కలగదనీ, పూర్వవైభవం కలుగుతుంది అనీ.

ఐనా మనిషి తన పురుషకారం తాను చేయాలి. ఏ స్థితిలోనూ వంశానికి అపకీర్తి తేగూడదు.

నలమహారాజుకూ ఈ కష్టం వచ్చింది. అపుడు ఆయన బాహుకుడు అని పేరు మార్చుకొని, అజ్ఞాతంగా కాలం గడుపుకొన్నాడు. ఆయన నిత్యసత్యవచనుడని ప్రఖ్యాతి పొందబట్టి ఆయనను పరీక్షింప వచ్చారు ఇంద్రాది దేవతలు.

కష్టకాలంలో తమను చూచి ఇతరులు అయ్యో పాపం అని మనసు నొచ్చుకో గూడదు. ఉత్తములను ఎప్పుడూ నొప్పించగూడదు. అందుచేత గూడా కాలానికి తగిన రూపం, వేషం, భాష ఉండక తప్పదు.

ఆత్మ రక్షా కర్తవ్యా— అని చెప్పారు. ప్రతి ఒక్కరూ తనను తాను తప్పక కాపాడుకోవాలి. బతికి ఉండి ధర్మం సాధించాలి. మోక్షం పొందాలి. మధ్యలో ప్రాణాలు తీసుకుంటా అనే హక్కు లేదు.

ఇక్కడ అబద్దం ఆడి — ఇతరులను మోసగించడం లేదు. అది ఆపద్ధర్మం. ఆపదలో తనను తాను రక్షించుకోవాలి.

దేశ కాలౌ ప్రతీక్షస్వ క్షమమాణః ప్రియాప్రియే— అని

శ్రీరాముడికే కాలానుకూలత కోసం వేచిఉండడం యొక్క ఆవశ్యకత చెప్పారు ఆప్తులు.

ధర్మరాజూ ఒక సంవత్సరం మంచి సమయం రావడానికి వేచి ఉండవలసి వచ్చింది.

లోకప్రతారణం చేయడం అబద్ధంలో ప్రధానంగా ఉంటుంది.

ఇక్కడ పాండవులు ఆత్మ రక్షణ మాత్రమే చేసుకొన్నారు. అక్కడ విరాట రాజ్యంలో ఎవరినీ వంచించలేదు. కష్టం వచ్చిపడినపుడు ఆ రాజ్యం కోసం యుద్ధమే చేశారు.

లోకరక్షణకోసం పలికే అసత్యం సత్యాతిశయం.

*ప్రాణాతురుడైనచోన్ * అని ధర్మ వ్యాధుడి మాట. కౌశికునితో ధర్మసూక్ష్మాలు చెప్తూ అంటాడు..

భూతహితంబుగా పలుకు బొంకును సత్యఫలంబునిచ్చు అనే పద్యంలో వచ్చేది ఈ మాట.. (అరణ్య పర్వం)

వారిజాక్షులందు వైవాహికములందు

ప్రాణవిత్త మాన భంగమందు ….

బొంకవచ్చు అఘము పొందదధిప! —అని . (భాగవతం)

తన ఆశ్రితుడి క్షేమం కోరి చెప్తాడు శుక్రాచార్యులు బలిచక్రవర్తితో .

ఇక్కడ తన/& తన వారి ప్రాణం కాపాడుకోవడం కోసం బొంకడం ధర్మం అయింది.

సత్యం పలికి కౌరవుల చేతిలో (రక్షణ లేని పరిస్థితిలో) ఆపద తెచ్చుకోవడం ఆత్మహత్యా సదృశమే ఔతుంది.

శుక్రనీతులు వక్రనీతులని అనుకోవడం మన అపోహ.

No comments:

Post a Comment