Saturday, May 2, 2026

 *పురుషోత్తముడు* 

*వాచ్యావాచాం ప్రకుపితో* *నవిళానాతి* *కర్హిచిత్‌*  
 *నా కార్యమస్తి క్రుద్ధస్య* *నావాచ్యాం విద్యతే క్వచిత్‌* 

‘‘క్రోధం అధికంగా కలిగినవానికి ‘ఇది అనవచ్చు, ఈ మాట అనరాదు’ అనే విచక్షణా జ్ఞానం ఉండదు. వాడు చేయని కార్యము గాని, ఆడని మాట గాని ఉండదు’’ ..అనుకుంటూ హనుమంతుడు లంకాదహనం చేసిన అనంతరం చింతిస్తాడు.

 తన తోకకంటించిన నిప్పును రావణుని పై క్రోధంతో లంకాదహన కార్యానికి ఉపయోగించిన హనుమ.. సీతాదేవికి ఏదైనా ప్రమాదం జరిగిందేమోనని బాధపడే సందర్భంలో వాల్మీకి చెప్పిన యీ మాటలు సార్వకాలిక సత్యాలు.

 క్రోధం మనిషి విజ్ఞతను పోగొడుతుంది. మానవత్వానికి విఘాతం కలిగిస్తుంది. అనేక ప్రమాదాలకు కారణమౌతుంది. కోపం అతిశయించినప్పుడు దాన్ని తన అదుపులోకి తెచ్చుకోని సందర్భాల్లో అది సృష్టించే నష్టం అపారం. నష్టపడిన తర్వాత విచారించినా దాన్ని మనం పూరించుకోవడం సాధ్యపడదు. అందుకే భారతీయ సంస్కృతి క్రోధాన్ని అరిషడ్వర్గాలలో ఒకటిగా చెప్పింది.

 
రాగద్వేషాలకు అతీతంగా ఉండటం అంత సులభమైన విషయమేమీ కాదు. 

కానీ మనిషి తనవంతు ప్రయత్నం చేసి క్రోధాన్ని అదుపు చేసుకోగలిగే సంయమనం చూపితే తప్పక విజయం సాధిస్తాడు.

 అలాగని.. కోపం ప్రకటించకుండా లోకవ్యవహారము సాధ్యపడదు. అందుకే పూర్వులు సామ, దాన, భేదాలు విఫలమైనప్పుడే నాల్గవ ఉపాయంగా దండోపాయం ప్రయోగించమన్నారు. అది చివరి అస్త్రమే తప్ప మరొకటి కాదు. 

రామాయణంలో చాలా సందర్భాల్లో రాముడు తన కోపాన్ని ప్రదర్శించాడు. సుగ్రీవుడు ఇచ్చిన మాట మరచి భోగపరవశుడైనప్పుడు లక్ష్మణునితో పంపిన సందేశంలోనూ, యుద్ధరంగంలో రావణుడు హనుమంతుని బాధించినప్పుడు, లంకకు వెళ్లే మార్గంలో సముద్రుడు సహకరించనప్పుడు, 

ఈ విధంగా ఎన్నో చోట్ల శ్రీరాముని కోపాన్ని మహర్షి వర్ణించాడు. కానీ శ్రీరామచంద్రుని క్రోధాన్ని వర్ణిస్తూ ‘‘క్రోధమహారయత్‌’’ అన్నాడు వాల్మీకి. అంటే రాముడు కొన్ని సందర్భాల్లో కోపాన్ని తెచ్చుకుంటాడు తప్ప అది ఆయన ప్రకృతి కాదు.

 అందుకే ఆయన పురుషోత్తముడయ్యాడు.

 క్రోధాన్ని విసర్జించిన వాడే నిజమైన పురుషోత్తముడు🌞.     

No comments:

Post a Comment