"నేనే" విశ్వకేంద్రం
అన్యం లేని "నేను" జ్ఞానం.
అన్యం ఉండే నేను అజ్ఞానం.
ఏకాత్మస్వరూపుడైన తానే సత్యం.
ప్రపంచరూపంగా ఉండే నానాకార జ్ఞానం అజ్ఞానం.
అసత్యమైన ఆ జ్ఞాన,విజ్ఞానములు కూడా
సత్యజ్ఞానమైన "తన" కన్నా వేరుగా లేవు.
పలువిధములైన నగలు సత్యము కావు.
అవి సత్యమైన బంగారమును వదిలి ఉండగలవా? అన్నారు రమణులు.
అమాయకుడైన ఒకడు ఆర్థిక ఇబ్బందుల కారణంగా తాతల నాటి బంగారు గణపతి విగ్రహాన్ని అమ్మటానికి తీసుకెళ్లాడు...
శేఠ్ గణపతిని, గొడుగును, సింహాసనాన్ని, ఎలుకను తూచి వెలకట్టాడు.
శేఠ్ వ్రాసిన ఆ పట్టీ చూచి గొడవపడ్డాడు
ఆ అమాయకుడు...
గణపతికీ అదే రేటు, ఎలుకకూ అదేరేటా? అని
శేఠ్ నవ్వి, నాకు గణపతి అయితే ఏమి? ఎలుక అయితే ఏమి?
నాకు కావలసింది బంగారం....ఈ నామరూపాలతో నాకు పనిలేదు...అన్నాడు.
అలాగే నామరూపాలను చూసేవాడు అజ్ఞాని.
నామరూపాలకు అధిష్ఠానంగా ఉన్న ఆత్మను చూసేవాడు జ్ఞాని.
* * *
అన్నింటిలో భగవంతుణ్ణి చూసేవాడు విశిష్టాద్వైతి.
ముందు నామరూపాలు చూసి
తరువాత ఆత్మను చూస్తాడు ఈ భక్తియోగి.
* * *
భగవంతునిలో అన్నింటినీ చూసేవాడు అద్వైతి.
ముందు ఆత్మను చూసి
తరువాత నామరూపాలు చూస్తాడు ఈ జ్ఞానయోగి.
* * *
నేను - ఉత్తమ పురుషము(మనస్సు)
నీవు - మధ్యమ పురుషము(జగత్తు)
వాడు - ప్రధమపురుషము(జగదీశ్వరుడు)
* * *
విశ్వకేంద్రం - 'నేను'.
'నేనే'(మనస్సే) జగత్తుగా, జగదీశ్వరునిగా వ్యక్తం అయ్యింది.
ఈ ఉత్తమపురుషమైన 'నేను'యొక్క తత్త్వాన్ని తెలుసుకోవడం వలన,
అనగా 'నేనెవడను?' అని ఆత్మవిచారణ చేయడం వలన 'నేను' అనేది మిథ్య (లేనిదే) అని తెలుస్తుంది.
'నేను' అనేదే మిథ్య అయినప్పుడు
దానిని ఆధారం చేసుకుని ఉనికి గలిగి ఉన్న
నీవు, వాడు కూడా మిథ్యే అవుతాయి.
లేనివే అవుతాయి.
ఈ మూడూ లేకుండా పోవడం అంటే
శూన్యమైపోవడం కాదు.
మూడూ కలిసి ముద్దగా పరిపూర్ణవస్తువుగా తయారవ్వడం అన్నమాట.
ఆ పరిపూర్ణవస్తువే 'అసలు నేను'.
* * *
ఉండేది వర్తమానం ఒక్కటే.
గడిచిన వర్తమానం - భూతకాలం.
రాబోవు వర్తమానం - భవిష్యత్కాలం.
భూతకాలం గానీ, భవిష్యత్కాలం గానీ
ఆయా సమయాల్లో వర్తమానమే.
ఏ క్షణానికాక్షణం ఉండేది వర్తమానమే.
* * *
పురుషత్రయంలో 'నేను' లేకపోతే
నీవు-వాడు ఎలా ఉండవో
కాలత్రయంలో 'వర్తమానం' లేకపోతే
భూత-భవిష్యములు కూడా ఉండవు.
* * *
నదిగట్టున చేరి యెడతెగని ప్రహాహాన్ని చూస్తుంటే
ప్రస్తుతక్షణంలో నీ యెదుట ఉన్న నీరు - వర్తమానం.
జరిగిపోయిన నీరు - భూతకాలం.
పై నుంచి వచ్చే నీరు - భవిష్యత్కాలము.
ఆయా సందర్భాన్ని అనుసరించి ఆత్మనే
ఈశ్వరుడు-జీవుడు-జగత్తులుగా చెప్పుకున్నట్టు
ఆయా సందర్భంలో వర్తమానాన్నే
భూత-భవిష్యత్తు-వర్తమానములుగా చెప్పుకుంటున్నాము.
"ఇప్పుడు" (వర్తమానం) యొక్క తత్త్వాన్ని తెలుసుకోకుండా భూత-భవిష్యత్తుల గురించిన ఆలోచించడం ఎలా ఉంటుదంటే-
"ఒకటి"ని వదిలి లెక్క పెట్టినట్లు ఉంటుంది.
ఆ లెక్క వృధా.
"నేను" (ఆత్మ)ను వదలి లోకాన్ని గురించి, దైవాన్ని గురించి ఆలోచించడం కూడా వృధా.
* * *
వర్తమానం ఒక్కటే ఉన్నది.
వర్తమానమే పరమగు దైవం.
అది సనాతనం.
ఆద్యంతరహితం.
శాశ్వతం.
మార్పు లేనిది.
* * *
గడియారం - వర్తమానం.
గడియారంలోని ముల్లులు - భూత-భవిష్యములు.
గడియారం కదలదు.
ముల్లులు కదులుతూ ఉంటాయి.
* * *
ప్రవాహం కదిలి వెళుతున్నప్పటికీ
నది శాశ్వతంగా అక్కడే ఉంటుంది.
నీరుగా అశాశ్వతం.
నదిగా శాశ్వతం.
వ్యక్తిగా అశాశ్వతం.
ఆత్మగా శాశ్వతం.
* * *
'కాలం మారింది' అని వ్యవహారంలో వాడుతామేగాని,
మారేది కాలం కాదు మన మనస్సు.
కానీ మనం ఆ మార్పును కాలానికి ఆపాదిస్తాం.
గీతలో కూడా 'కాలోస్మి' అన్నారు...
'నేను కాలమును' అంటే,
'నేనే' కాలమును...
'నేనే' వర్తమానమును...
అని అర్థం.
* * *
తాను పరిమితంగా ఉన్నప్పుడు
అంటే ఈ తనువు మాత్రమే నేను అని తానున్నప్పుడు
దేశకాలాలు, కార్యకారణాలు, విధిమతులు...
అన్నీ తనపై ప్రభావం చూపుతాయి.
'మొత్తంగా తానున్నప్పుడు' ఇవేవీ పనిచేయవు.
తన'లో ' ఉంటాయేగాని తనపై పనిచేయవు.
పాములోని విషపుకోర వలన పాముకు ఏ హానీ లేనట్లు.
మనము ఈ దేహమాత్రమేనా? అని విచారించినప్పుడు
ఇది మాత్రమే నేను కాదు,
నాతో సహా సకలమూ 'నాలో ' ఉన్నది అనే 'మొత్తపుతత్త్వము'గా అనుభవంలోకి వస్తుంది.
* * *
బిందు సముదాయం - సముద్రం.
ధూళి సముదాయం - భూమి.
జీవసముదాయం - 'నేను'(దైవం).
* * *
వ్యవహారంలో నేను-నీవు-అతడు అనే బేధాలున్నప్పటికీ, తాత్త్వికంగా అంతా 'ఒక్కటే'.
వ్యవహారంలో అన్నింటిలో, అందరిలో ఒకటిగా, ఒకరుగా ఉంటూ...
అనుభవంలో తనతో సహా అన్నీ 'ఒకటి'లో ఉండడమే
ఆధ్యాత్మిక లక్ష్యం.
* * *
ఇప్పుడు-అప్పుడు-ఎప్పుడూ ఒకరమే.
ఇక్కడ-అక్కడ-ఎక్కడా ఏకమే.
* * *
No comments:
Post a Comment